logo

అన్నవరంలో విజిలెన్స్‌ విచారణ

అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ - ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, వ్యవస్థాపక ధర్మకర్త నియామకం చెల్లదని తదితర 25 అంశాలతో అప్పటి ధర్మకర్తల మండలి సభ్యుడు ఒకరు కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రికి

Updated : 24 May 2022 06:14 IST


వివరాలు ఆరా తీస్తున్న విజిలెన్స్‌ ఎస్పీ, అధికారులు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ - ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, వ్యవస్థాపక ధర్మకర్త నియామకం చెల్లదని తదితర 25 అంశాలతో అప్పటి ధర్మకర్తల మండలి సభ్యుడు ఒకరు కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై గత ఏడాది డిసెంబరు 20, 21 తేదీల్లో అన్నవరం వచ్చిన విజిలెన్స్‌ అధికారులు విచారణ చేశారు. ఆ తర్వాత కూడా దేవస్థానం అధికారుల నుంచి వివరాలు సేకరించి రికార్డులు పరిశీలించారు. ఇందులో భాగంగా సోమవారం మరోసారి విచారణ జరిగింది. విజిలెన్స్‌ ఎస్పీ పి.వి.రవికుమార్‌, డీఎస్పీ ముత్యాల నాయుడు, సీఐ శ్రీనివాసరెడ్డి, ఏవో భార్గవ మహేష్‌ వివరాలు సేకరించారు. ఈవో కార్యాలయంలో విచారణ జరిగింది. వ్యవస్థాపక ధర్మకర్త, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు (ఫిర్యాదు చేసిన సమయంలో ఉన్న ధర్మకర్తల మండలి సభ్యులు), ఈవో నుంచి వివరాలు సేకరించారు.

ఒక్కో అంశంపై ఆరా..

విచారణకు వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌, ఈవో వి.త్రినాథరావు, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు వాసిరెడ్డి జమీలు, బదిరెడ్డి ఆశాలత, కర్రి భామిరెడ్డి, గాదె రాజశేఖర రెడ్డి, ముత్యాల వీరభద్రరావు, కొండవీటి సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ఒక్కొక్కరి నుంచి వివరాలు సేకరించారు. ఛైర్మన్‌ నియామకం, అర్హత, ఫిర్యాదులో పేర్కొన్న ఇతర అంశాలపై మీకు తెలిసిన సమాచారం ఇవ్వాలని అడిగారు. సభ్యులు వారికి తెలిసిన సమాచారం, అభిప్రాయం వెల్లడించారు. ఆయా వివరాలను లిఖిత పూర్వకంగా అధికారులకు అందించారు. అన్ని అంశాలపై క్షుణ్ణంగా విచారిస్తున్నామని వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వానికి మూడు నెలల్లో నివేదిక అందిస్తామని విజిలెన్స్‌ ఎస్పీ రవికుమార్‌ తెలిపారు.

నేడు కమిషనర్‌ కార్యాలయానికి ఈవో

విజిలెన్స్‌కు అందిన ఫిర్యాదుపై విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయానికి ఈవో త్రినాథరావు మంగళవారం వెళ్లనున్నారు. విజిలెన్స్‌కు అందిన ఫిర్యాదుపై వివరణకు కమిషనర్‌ కార్యాలయానికి రావాలని ఈవోకు ఆదేశాలందాయి. ఫిర్యాదులోని అంశాలపై రికార్డులు పరిశీలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని