logo
Updated : 27/11/2021 05:19 IST

దారి కాచిన మృత్యువు

 నలుగురి మృతితో శోకసంద్రంలో కుటుంబీకులు

 మానకొండూరు వద్ద చెట్టుకు ఢీకొన్న కారు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ న్యూస్‌టుడే-కరీంనగర్‌ నేరవార్తలు, మానకొండూర్‌

మరో పదినిమిషాలైతే క్షేమంగా ఇంటికి వెళ్లేవారు...అంతలోనే దారుణం...రోడ్డు ప్రమాదం మృత్యువురూపంలో ముగ్గురు అన్నదమ్ముళ్లతో పాటు మరొకరిని కానరానిలోకాలకు తీసుకెళ్లి ఆ కుటుంబాలకు కన్నీటి వ్యథను మిగిల్చింది. తెల్లారిపోయిన బతుకులు అయినవారిని శోక సంద్రంలో ముంచింది. మానకొండూర్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన  కారు ప్రమాదం కరీంనగర్‌తోపాటు మృతుల గ్రామాలలో విషాదాన్ని నింపింది. పొద్దుపొద్దున్నే  తమ చెవిని చేరిన ఈ దారుణాన్ని తలుచుకుని అయినవాళ్లు తల్లడిల్లారు. ముగ్గురన్నదమ్ములతో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని పలువురు కంటతడిపెట్టారు. నలుగురిని బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదపు వ్యథల తీరు ఇలా..

రోదిస్తున్న కుమార్తె అలేఖ్య

ఒక్కసారి ‘లే.. నాన్న’ అంటూ..

న్యాయవాది బాలాజీ శ్రీధర్‌ మృతదేహం వద్ద ఆయన ఇద్దరు కుమారులు అభిజిత్‌, అమిత్‌లు రోదించిన తీరు చూపరుల మనసుల్ని మెలిపెట్టింది. ‘లే.. నాన్న.. ఇంకా పడుకున్నావా..?’ అంటూ రోదించిన తీరు ఆత్మీయుల కళ్లల్లో కన్నీటిని ఒలికించింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా మంచి పేరున్న శ్రీధర్‌ మృతదేహాన్ని చూసేందుకు తరలివచ్చారు. కరీంనగర్‌ మార్చురీకి వచ్చిన తోటి న్యాయవాదులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.  జ్యోతినగర్‌లో నివాసముంటున్న ఈయన పెద్దపల్లిలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య లక్ష్మీప్రసన్న గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా ఇద్దరు కుమారుల్లో పెద్దకొడుకు అమిత్‌ వెటర్నరీ కోర్సు చేస్తుండగా.. రెండో కుమారుడు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

విలపిస్తున్న  శ్రీనివాసరావు భార్య సునీత

విరమణకు ముందే.

ఏళ్లతరబడి ఇంజినీర్‌గా సేవల్ని అందించిన కొప్పుల శ్రీనివాస్‌రావు ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ తీసుకుని విశ్రాంతి పొందాలనుకున్నారు. మరో మూడేళ్ల గడువు పొడిగించడంతో సేవల్లో కొనసాగుతున్నారు.  పంచాయత్‌రాజ్‌ విభాగంలో ఈఈగా సిరిసిల్ల జిల్లాలో సేవలందిస్తున్న ఈయన మంచి అధికారిగా మన్ననల్ని అందుకున్నారు. కరీంనగర్‌లోనే స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్న శ్రీనివాస్‌రావుకు భార్య సునీతతోపాటు కొడుకు, కూతురున్నారు. వీరిద్దరి వివాహాల్ని చేసి కుటుంబపరంగా బాధ్యత తీర్చుకున్న ఈయనను రోడ్డు ప్రమాదం బలికొనడగంతో ఆ కుటుంబంలో తీరని వేదనే మిగిలింది. మృతదేహం వద్ద భార్య, పిల్లలు చేసిన ఆక్రందనలు మిన్నంటాయి. ఇంకొన్నాళ్లైతే విశ్రాంతి తీసుకుంటానంటూ.. పదేపదే అన్న ఆయన శాశ్వతంగా ఇలా తనువు చాలించి విశ్రాంతి తీసుకున్నారంటూ బంధుగణం కన్నీటి పర్యంతమయ్యారు.

కారులో నుంచి మృతదేహాలను వెలుపలికి తీస్తున్న పోలీసులు

ఊళ్లోనే అంత్యక్రియలు...

అందరికన్న చిన్నవాడైన శ్రీరాజ్‌ అంత్యక్రియల్ని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్‌లో నిర్వహించారు. మిగతా ఇద్దరు సోదరుల చివరి కార్యక్రమాలు కరీంనగర్‌లో జరగగా శ్రీరాజ్‌ అంతిమసంస్కారాలను ఆయన పెద్దన్న దగ్గరుండి ఊళ్లో జరిపించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇతన పదేళ్ల పాటు గల్ఫ్‌ దేశాల్లో పనిచేశారు. వివాహం అయిన తరువాత భార్య, కుమార్తెలకు కొంత కాలంగా దూరముంటున్నాడు. ఇతను హైద్రాబాద్‌తోపాటు కరీంనగర్‌, సొంతూళ్లకు వచ్చివెళ్తుండేవాడని అతని దగ్గరి స్నేహితులు అతనితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ముగ్గురన్నదమ్ముళ్లు ఆప్యాయంగా ఉండేవారని ఎక్కడైనా కలిసినా సందడిగా గడిపేవారని వారి ఆత్మీయతను స్నేహితులు తలుచుకున్నారు. ముఖ్యంగా శ్రీరాజ్‌  కరీంనగర్‌లో ఉండే అక్కాబావల దగ్గర ఎక్కువగా ఉంటూ వారితో ప్రేమగా మెలిగేవాడని ఆఫ్తులు అతని తీరుని గుర్తుచేసుకున్నారు.


ఆగిన బతుకు బండి..

120 కిలోమీటర్ల వేగంతో కారు  

డ్రైవింగ్‌ వృత్తినే నమ్ముకున్న ఇందూరి జలంధర్‌ మృతితో అతని కుటుంబం ఆగమైంది. రెక్కలు ముక్కలు చేసుకుని తన భార్యాపిల్లల కోసం శ్రమిస్తున్న ఇతను ఆఖరుకు ఆ బతుకునిచ్చే బండి ప్రమాదంలోనే తుదిశ్వాస వదిలిని తీరు ఆవేదన కలిగించింది. రెండేళ్ల కిందటే ఇతనికి  కీర్తనతో వివాహం జరిగింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు వేదాంశికి ఇటీవలే మొదటి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించిన జలంధర్‌ అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అతని సొంత గ్రామమైన చందుర్తి మండలం లింగపేటలో విషాదం అలుముకుంది.  కరీంనగరంలోని అద్దె ఇంట్లో నివాసముంటున్న అతని భార్యపిల్లలు రోడ్డున పడ్డారు.

సురేఖ వేదన వర్ణనాతీతం..

ఓవైపు కట్టుకున్న భర్త సుధాకర్‌రావు ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మరోవైపు తోడబుట్టిన ముగ్గురు తమ్ముళ్లు కన్నుమూసి శాశ్వత నిద్రలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆమె మాటల్లో చెప్పలేని వేదననే అనుభవించింది. పెదవికింద వేదనను అదిమిపడుతూనే అటు తమ్ముళ్లను కడచూపు చూసుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఒక్క ప్రమాదం ఊహించని గాయాన్ని ఇలాంటి ఘోరం రూపంలో మిగిల్చిందని లోలోపల కుమిలిపోయింది. తిరిగిరాని లోకాలకు వెళ్లారా.. అంటూ ముగ్గురు తమ్ముళ్లను చూసి వెక్కివెక్కి ఏడుస్తూనే ఉండిపోయింది. అంత్యక్రియల అనంతరం మళ్లీ భర్త కోసం ఆస్పత్రికి పరుగుపరుగున బయలుదేరి భర్తను కాపాడమనేలా దేవుణ్ని వేడుకుంటోంది.

సార్‌.. డ్యూటికీ రమ్మంటారా..?

ఈఈ శ్రీనివాస్‌ దగ్గర రెగ్యులర్‌ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి ఫోన్‌కాల్‌ అసలు ప్రమాదంలో వారి ఆచూకీని బయటపెట్టింది. ఏడాది కాలంలగా సర్వర్‌ అనే వ్యక్తి ఈఈ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం ప్రమాదానికి గురైన కారుని నడుపుతుండేవాడు. గత కొన్ని రోజులుగా ఇంట్లో వేరే పని ఉండటంతో డ్యూటీకి రాలేదు. దీంతో తాత్కాలిక డ్రైవర్‌గా అందుబాటులో ఉన్న జలంధర్‌ను ముగ్గురన్నదమ్ముళ్లు ఖమ్మంకు తీసుకెళ్లారు. గురువారం రాత్రికల్లా చేరుకుని ఉంటారనే ఉద్దేశంతో శుక్రవారం తెల్లవారు జామునే 5 గంటల నుంచి శ్రీనివాస్‌కు సర్వర్‌ ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. అప్పటికే ప్రమాదంలో ఆయన మృతిచెందడంతో ఆ ఫోన్‌కు సమాధానం లభించలేదు. దీంతో మరికొద్దిసేపటికి ప్రయత్నించగా.. మానకొండూర్‌ పోలీసులే  సమాధానమిచ్చారు. ఫోన్‌ ఎత్తిన వెంటనే సర్వర్‌.. సార్‌.. డ్యూటీకీ రమ్మంటారా..? సిరిసిల్లకు వెళ్దామా..? అని అడిగే లోపలే అటునుంచి ప్రమాదం జరిగిందనే సమాధానం రావడంతో సర్వర్‌ నోట మాట రాలేదు. ఇతని ఫోన్‌ ద్వారానే ఈ కారులో ఉన్నవాళ్ల వివరాలు పోలీసులకు తెలిశాయి.

శ్రీనివాస్‌రావు

బాలాజీ శ్రీధర్‌

శ్రీరాజ్‌

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని