logo
Published : 27/11/2021 03:28 IST

బ్యాలెట్‌ యుద్ధం.. పదిమంది సిద్ధం

 ముగిసిన నామపత్రాల ఉపసంహరణ ఘట్టం

ఎన్నికల ఏర్పాట్లలో జిల్లాయంత్రాంగం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

మండలి ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఎట్టకేలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో ఉండేదెవరనేది తేలిపోయింది. వచ్చేనెల 10వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం  పది మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల ఓట్లతో ఎమ్మెల్సీ పీఠాన్ని అందుకోవాలని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పనిలోపనిగా తమ ప్రచార పర్వాన్ని లోలోపల ప్రారంభించేస్తున్నారు. అధికార తెరాస తరపున ఎల్‌. రమణ, టి. భానుప్రసాద్‌రావులు బరిలో నిలువగా వీరికి పోటీగా మరో 8 మంది స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రసవత్తరంగా ప్రారంభమైన మండలి ఎన్నికల కోలాహలంలో 27 మంది నామినేషన్లు వేశారు. ఇందులో మగ్గురు నామపత్రాలు తిరస్కరణకు గురవగా.. మిగతా బరిలో ఉన్న 24 మందిలో ఆఖరు రోజున 14 మంది తమ పత్రాలను వెనక్కి తీసుకున్నారు.

చీలిక మంత్రం పారకుండా..

అధికార తెరాస తమకున్న ఓట్ల బలంతో ఎట్టిపరిస్థితుల్లో మండలి సీట్లలో పాగావేయాలనే తలంపును  చూపుతోంది. ఇప్పటికే శిబిర రాజకీయాలతో తమ మద్దతుదారుల్ని రహస్యప్రాంతాల్లో ఉంచింది. మరోవైపు పోటీలో ఎక్కువ మంది ఉంటే ఓట్ల చీలిక రూపంలో నష్టం ఎదురవుతుందనే ఉద్దేశంతో కొందరిని నామినేషన్ల నుంచి ఉపసంహరించుకునేలా అవలంబించిన ఎత్తుగడలు గులాబీ పార్టీకి వరంగానే మారాయి. అయినా మరో 8 మంది పోటీలో ఉండటంతో వారు ఎక్కువగా ఓట్లను కొల్లగొట్టకుండా అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగానే తీసుకోబోతున్నారు. తెరాస తరపున పోటీ చేసి గెలిచిన ప్రతి కార్పొరేటర్‌, కౌన్సిలర్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటు హక్కును వినియోగించుకోవాలనే సూచనల్ని అందిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా నేటి నుంచి ఈ ప్రజాప్రతినిధులంతా ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలకు వెళ్లే ఏర్పాట్లను చేస్తున్నారు.  సీనియర్‌ నాయకుల నేతృత్వంలో క్యాంపు రాజకీయాలను మరింత పక్కాగా నిర్వహించేలా చూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమకున్న ఓట్లను ఇద్దరు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో వేస్తే గెలుపు ఖాయమనేలా ప్రజాప్రతినిధుల్ని ఉత్సాహపరుస్తున్నారు.

ప్రాధాన్య ఓట్లు...

తెరాస అభ్యర్థులుగా ఎల్‌.రమణ (జగిత్యాల జిల్లా), టి.భాను ప్రసాద్‌రావు( పెద్దపల్లి జిల్లా)లు తుది పోటీలో ఉంటున్నారు. తెరాస పార్టీ తరపున బీ-ఫారాన్ని వీరిద్దరూ అందించడంతో మొదట రమణ, ఆ తరువాత భానుప్రసాద్‌ల పేర్లతోపాటు ఫోటో చిరునామాలు బ్యాలెట్‌ పత్రంలో ఉండనున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఎలాంటి గుర్తులుండవు. ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో.. వాళ్ల పేరు, ఫోటోతో కూడిన గడి పక్కన చివరగా ప్రాధాన్యత ఓట్లను వేయాలి. ప్రతి ఓటరు ఇద్దరు అభ్యర్థులను మాత్రం ఎంచుకుని 1, 2 క్రమసంఖ్యలను మాత్రమే వేయాల్సి ఉంటుంది. అంతకుమించి మిగతా సంఖ్య వేయకూడదు. అత్యధికంగా 1 లేదా 2 సంఖ్యలు ఏ అభ్యర్థికైతే వస్తాయో వారే విజేతలుగా నిలుస్తారు. ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నికకు ఒకటే బ్యాలెట్‌ పత్రం ఉండనుంది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని