logo
Published : 27/11/2021 03:28 IST

తవ్విన కొద్దీ అక్రమాలు

 మరో బ్రాంచిలో 17 నకిలీ సంఘాలకు రుణాలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌

పొదుపు చేసుకున్న మహిళా సంఘాలకు రుణాలు మంజూరవుతాయని ఆశ పడితే.. అక్రమార్కులు రుణాలకే అర్హత లేకుండా చేస్తున్నారు. బినామీ సంఘాలను సృష్టించుకొని సంఘాల్లోని మహిళల చిరునామాలు ఉపయోగించుకోవడం.. ఈ సంఘాలను అసలా, నకిలీయా అని నిర్ధారించుకోకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం, వాటిని కట్టకుండా ఎగవేయడం చూస్తే రుణాలు ఏవిధంగా మంజూరు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో మహిళా సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంఘాల పనితీరు మొత్తం మెప్మా ద్వారానే పర్యవేక్షిస్తుండగా, అర్హత కలిగిన మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు అక్రమార్కులు బోగస్‌ సంఘాల పేరుతో నకిలీ పత్రాలతో రుణాలు తీసుకొని చెల్లించకుండా తిరగడం, నిజమైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడం వంటి సంఘటనలు ఏడాదిన్నర కిందటి నుంచి బయటకు వస్తున్నాయి. అప్పుడూ మూడు బ్యాంకుల ద్వారా రూ.6 కోట్లు స్వాహా చేశారు. ఇందులో బాధ్యులైన వారిపై శాఖపరంగా చర్యలు తీసుకోగా కొందరు జైలు కూడా వెళ్లారు. ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా బ్యాంకులు తేరుకోకపోవడం చూస్తే కొన్ని బ్యాంకులు అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది.

వివరాలు ఇవ్వకుండా దాటేయడం

బినామీ సంఘాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతుండగా తవ్విన కొద్ది అక్రమాలు బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక బ్యాంకు అధికారి మొండి బకాయిలు వసూలు కావడం లేదని లేఖ అందించడంతో అసలు విషయాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మెప్మా జిల్లా అధికారులు తీవ్రంగా పరిగణించి అన్ని బ్యాంకుల నుంచి వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరుతుండగా కొన్ని శాఖలు అసలు పట్టించుకోవడం లేదు. వివరాలు ఇవ్వకుండా దాటేస్తున్నట్లు తెలుస్తోంది. మెప్మా సిబ్బందికి తెలిసిన సమాచారం మేరకు మరో ప్రధాన నాలుగు బ్యాంకుల్లో ఇలాంటి బోగస్‌ సంఘాలకు రుణాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఆ బ్యాంకులు కనీసం స్పందించకపోవడం గమనార్హం.

24 సంఘాల పేరుతో స్వాహా

నగరంలోనే మరో ప్రాంతంలోని ప్రధాన బ్యాంకులోని మరొక శాఖలో 27 మహిళా సంఘాలకు సంబంధించిన వివరాలు దొరకడం లేదని తెలియడంతో విచారణ ప్రారంభించారు. 17 సంఘాలు బోగస్‌ అని తేలింది. ఒక్కొక్క సంఘానికి రూ.7.50లక్షల రుణాన్ని బ్యాంకర్లు ఇచ్చారు. ఈ లెక్కన రూ.1.27లక్షలు గోల్‌మాల్‌ జరిగినట్లేనని అంటున్నారు. మొన్నటివి కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 24 సంఘాలకు సంబంధించి రికవరీ కాకపోవడం చూస్తే ఇంకేన్ని బినామీ సంఘాలు ఉన్నాయో తెలియకుండా మారింది. వీటికి సంబంధించిన వివరాలు తీస్తుండగా సంఘాల్లోని మహిళల్లో ఆందోళన నెలకొంది.

ఉన్నతాధికారులు స్పందిస్తే..

కొన్ని బ్యాంకుల అధికారులు దరఖాస్తుకు జత చేసిన ధ్రువీకరణ పత్రాలు సరైన విధంగా పరిశీలించకుండానే గుడ్డిగా రుణాలు మంజూరు చేయడంపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా సొంత ఖాతాలో నగదు తీసుకునే సమయంలో సంతకం తేడా వస్తేనే అభ్యంతరాలు తెలిపే బ్యాంకు సిబ్బంది, ఇలాంటి నకిలీ పత్రాలు, అడ్రసులు తీసుకొచ్చిన సమయంలో సంతకాలు, ఇతర పత్రాలు పరిశీలించుకోకుండానే రుణాలు మంజూరు చేయడంపై ప్రజలు తప్పు పడుతున్నారు. అయితే బ్యాంకులలో ఇప్పటి వరకు రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు ఎన్ని? సకాలంలో తిరిగి చెల్లించకుండా డీఫాల్టర్‌గా ఉన్న సంఘాలన్నీ తేలాలంటే ఉన్నతాధికారుల స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని