విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు
వేములవాడ గ్రామీణం, న్యూస్టుడే: అభివృద్ధి పనులను అధికారులు రోజూ పర్యవేక్షించి పూర్తి చేయాలని, విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలుంటాయని కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్ పనుల పురోగతిని శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని శామకుంటలో రూ.2.70 కోట్లతో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని మూలవాగు ఒడ్డున చేపడుతున్న వైకుంఠధామం పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ శామ్సుందర్రావు, డీఈఈ సుచరన్, ఏఈ నర్శింహస్వామి పాల్గొన్నారు.
డిసెంబరు నెలాఖరుకు మినీస్టేడియం పూర్తికి ఆదేశం
సిరిసిల్ల పట్టణం, న్యూస్టుడే: మినీ స్టేడియం పనులను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి మినీస్టేడియం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేడియంలో రన్నింగ్ ట్రాక్, టెన్నిస్కోర్టు, వాలీబాల్కోర్టు, ప్రవేశ ఆర్చి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు ఉన్నారు.