logo
Published : 28/11/2021 02:59 IST

మొదటి బైపాస్‌ రోడ్డుకు మోక్షమెప్పుడో?

న్యూస్‌టుడే, వేములవాడ గ్రామీణం

వేములవాడ రోడ్డులో గుంతలు

దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఆలయంలో జరిగే ప్రధాన వేడుకల సందర్భంగా లక్షల్లో వస్తారు. మొదటి బైపాస్‌ రోడ్డులోనే వీరు పార్కింగ్‌ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, దుమ్ము ధూళి రావడంతో భక్తులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం ఈ పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాని దుస్థితి నెలకొంది.

పట్టణంలోని ఇరుకు రోడ్లతో రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.14.5 కోట్లను మొదటి బైపాస్‌ రోడ్డు అభివృద్ధి పనులకు మంజూరు చేసింది. అయిదేళ్ల కిందట ఈ పనులకు శ్రీకారం చుట్టారు. మూలవాగు వంతెన నుంచి పట్టణంలోని జగిత్యాల బస్టాప్‌ వరకు పనులు చేపట్టారు. అక్కడి నుంచి మున్నూరు కాపు సత్రం చివర వరకు రహదారి నిర్మించి డివైడర్‌ కూడా ఏర్పాటు చేశారు. కానీ అక్కడి నుంచి మూలవాగు వరకు కిలో మీటరు మేర పనులు రెండేళ్ల క్రితం నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ పనులకు గ్రహణం పట్టింది.

దుమ్ము, ధూళితో...

మొదటి బైపాస్‌ రోడ్డు పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. వాహనాల రాకపోకలతో దుమ్ము లేచి సమీప ఇళ్ల ప్రజలు, వాహనదారులు నరకయాతన పడుతున్నారు. పట్టణంలో ఇరుకు రోడ్లు ఉండటంతో భక్తులు అధికంగా వచ్చే రోజుల్లో పట్టణంలోకి వాహనాలను అనుమతించడం లేదు. దీంతో భక్తులు, ప్రజలు మొత్తం ఈ మొదటి బైపాస్‌ రోడ్డు మీదుగానే ప్రయాణించాలి. ఈ మార్గంలోనే రాజన్న ఆలయానికి, పార్కింగ్‌ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆది, సోమవారాల్లో వందల సంఖ్యలో వాహనాల్లో వస్తుంటారు. వీరంతా మూలవాగు వంతెన వద్ద నుంచే మొదటి బైపాస్‌ రోడ్డు మీదుగా పార్కింగ్‌ స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల వర్షాలకు గోతులు ఏర్పడటంతో ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నారు.

టెండరు పూర్తయినా...

వేములవాడ మూలవాగు నుంచి మున్నూరు కాపు సత్రం వరకు దాదాపు కిలో మీటరు రహదారిని పూర్తి చేసేందుకు రూ.3.24 కోట్లతో పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్‌ పూర్తయింది. అధికారుల అలసత్వం, గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా పనులు మొదలు కావడం లేదు. రోడ్డు పక్కన పైపులైన్లతో పనులకు ఆటంకం ఏర్పడుతుందని, ఇప్పటికే పనులు చేసిన వాటికి బిల్లులు రాలేదని తదితర కారణాలతో గత్తేదారు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మాణం పూర్తికి చర్యలు చేపట్టాలని భక్తులు, పట్టణవాసులు వేడుకొంటున్నారు.

మహాశివరాత్రికి పూర్తి చేస్తాం

-శాంతయ్య, డీఈ, ఆర్‌అండ్‌బీ, వేములవాడ

మొదటి బైపాస్‌ రోడ్డును వచ్చే మహాశివరాత్రి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు కిలో మీటరు పొడవు రోడ్డు నిర్మాణానికి రూ.3.24 కోట్లతో టెండర్లు పూర్తయి ఒప్పందం జరిగింది. గుత్తేదారుతో మాట్లాడం జరిగింది. వచ్చే నెల 15 తరవాత పనులు మొదలవుతాయి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని