పత్తి రైతును ముంచిన వర్షాలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
వీర్నపల్లిలో రైతుల ఇంటి వద్ద పత్తి కొనుగోళ్లు
జిల్లాలో అధిక వర్షాలు పత్తి రైతును నిలువునా ముంచాయి. మంచి ధర ఉన్నప్పటికీ ఆశించిన దిగుబడి రాక అన్నదాతలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వానాకాలంలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేయడం ఆనవాయితీ. గతేడాది మార్కెట్లో మద్దతు ధర లభించకపోవడంతో పెట్టుబడులు భారమయ్యాయి. దీంతో సాధారణంగా పత్తి సాగు 98 వేల ఎకరాల విస్తీర్ణం నుంచి ఈ ఏడాది 69 వేల ఎకరాలకు పడిపోయింది. ఎదుగుదల దశలో ఒకసారి... పూత, కాయ దశలో మరోసారి వర్షాలు పడటంతో దాదాపు సగం దిగుబడి తగ్గింది.
జిల్లా అంతటికి ఏకైక పత్తి మార్కెట్ వేములవాడ. ఇక్కడి యార్డులో దసరా పండుగకు ముందు మార్కెటింగ్‌శాఖ అడ్తిదారులతో లాంఛనంగా కొనుగోళ్లు ప్రారంభించింది. అది ఒక రోజు మురిపెంగానే ముగిసింది. ఉమ్మడి జిల్లాలో జమ్మికుంట, పెద్దపల్లి మార్కెట్లలో వ్యాపారులు ధరలతో పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఆ ఊసేలేదు. జిల్లాలో వేములవాడ పరిధిలోని సంకెపల్లి, నాంపల్లి, కోనరావుపేట మండలం సుద్దాల, బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని ఒక్కొక్క మిల్లు ఉన్నాయి. ఆయా మిల్లుల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,025. జిన్నింగ్ మిల్లుల్లో అంతకు మించి రూ.1,000 నుంచి రూ.1,500 చెల్లిస్తున్నారు. జిల్లాలో సాగు చేసిన పత్తి విస్తీర్ణానికి 60 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెటింగ్‌శాఖ అంచనా. కాగా జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటి వరకు 31 వేల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు.
పెట్టుబడుల భారం
ఎకరాకు సగటున రూ.25 వేలు పెట్టుబడి అయింది. దీనికి తోడు కౌలు రైతులైతే అదనపు చెల్లింపులు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. చిన్న రైతులు తమ దిగుబడులను జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్లాలంటే రవాణా, హమాలీ ఖర్చులు మరింత భారంగా మారుతోంది. దీనికితోడు ప్రస్తుత వాతావరణంతో పత్తిలో తేమశాతం 30 శాతం వరకు ఉంటుంది. సేకరించిన పత్తిని రైతుల ఇళ్ల వద్ద ఆరబెట్టలేని పరిస్థితి. వీటిని అవకాశంగా చేసుకుని దళారులు గ్రామాల్లోనే తూకాలు వేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల ధరల కంటే మరింత తక్కువ చేసి చెల్లిస్తున్నారు.
నష్టమే మిగిలింది
- ఉప్పల మల్లేశం, మంగళంపల్లి, పత్తి రైతు
నాకున్న రెండు ఎకరాలకు తోడు పక్కనున్న మరో ఐదెకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. గతేడాది 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ సారి 25 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. మరోసారి తీసినా కూలీల చెల్లింపులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆశించిన మేరకు ధరలున్నా... వచ్చే మొత్తానికి కౌలు చెల్లింపులు.. పెట్టుబడులు పోను చివరికి నష్టమే మిగులుతుంది.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.