logo
Updated : 28 Nov 2021 06:13 IST

పాశవికం.. కలకలం

వేర్వేరు చోట్ల హతుడి శరీర భాగాల గుర్తింపు

దారుణ హత్యతో ఉలిక్కిపడిన కోల్‌బెల్ట్‌

గోదావరిఖని, జ్యోతినగర్‌, న్యూస్‌టుడే

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఓ వ్యక్తిని పాశవికంగా హతమార్చిన నిందితులు అతడి తల, ఇతర శరీరభాగాలను ముక్కలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిని వివిధ ప్రాంతాల్లో పడేశారు. ఈ ఘటన కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. నిందితులు పథకం ప్రకారమే హత్య చేసినట్లు సంఘటన ఆధారంగా తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్టీపీసీ ఖాజీపల్లిలో నివాసం ఉండే కాంపల్లి శంకర్‌(35) గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌ మీసేవా కేంద్రంలో పనిచేస్తున్నాడు. ఇతనికి పదహారేళ్లకిత్రం మాతంగికాలనీకి చెందిన హేమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. శంకర్‌, అతని భార్య, పిల్లలతో కలిసి ఖాజీపల్లిలో తనతల్లి పోచమ్మ వద్ద ఉంటున్నారు. దంపతుల మధ్య కుటుంబ కలహాలున్నాయి. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం తనను వేధిస్తున్నాడంటూ హేమలత భర్తపై ఎన్టీపీసీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శంకర్‌ను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఎన్టీపీసీ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న పోచమ్మ గురువారం రాత్రి వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం ఉదయమే ఎన్టీపీసీ ప్లాంటు గోడ పక్కన తల, చేయి భాగాలు పడి ఉన్నట్లు పోలీసుల నుంచి ఫోన్‌ రావడంతో అక్కడికి వెళ్లి కుమారుడి తలగా గుర్తించింది. సంఘటన స్థలాన్ని రామగుండం పోలీసు కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మిగతా శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు. రాత్రి వరకు బసంత్‌నగర్‌ రైల్వే పై వంతెన సమీపంలో శరీర భాగాన్ని గుర్తించారు. అక్కడి నుంచి గోదావరిఖని సప్తగిరికాలనీ ప్రాంతంలో మెకాలి పైభాగం వరకు తొడల భాగాలను గుర్తించారు. మెకాలి నుంచి కింది భాగం వరకు బసంత్‌నగర్‌ సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వాటిని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

విషాదంలో శంకర్‌ పిల్లలు

పదునైన ఆయుధాలతో...

శంకర్‌ను హత్య చేసేందుకు నిందితులు పదునైన ఆయుధాలు వినియోగించినట్లు తెలుస్తోంది. హతుడి తల వెనుక భాగంలో మూడు రక్తగాయాలున్నాయి. పక్కా పథకం ప్రకారమే ఆయుధాలను సమకూర్చుకున్న నిందితులు అతన్ని నమ్మించి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మద్యం తాగించి మత్తులో ఉండగానే అతనిపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అక్కడే తల, చేయి భాగాలను నరికి వేరు చేసిన అనంతరం వాటిని తీసుకొచ్చి ఎన్టీపీసీ ప్లాంటు గోడ పక్కన పడేసినట్లు అనుమానిస్తున్నారు. హత్య సంఘటనలో ఎంతమంది ఉన్నారు...హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. తన కుమారుడిని అతని భార్య, ఆమె బంధువులే హత్య చేశారంటూ శంకర్‌ తల్లి పోచమ్మ ఆరోపించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది.

ఇది మూడో ఘటన

వ్యక్తి తల నరికి హత్య చేసిన సంఘటన కోల్‌బెల్టు ప్రాంతంలో మూడోది. 20 ఏళ్ల క్రితం గోదావరిఖనిలో హరికృష్ణ అనే యువకుడి తల నరికి ప్రధాన చౌరస్తాలో పడేశారు. యువతి విషయంలో హరికృష్ణను హత్య చేసిన నిందితులు శరీరం నుంచి తలను వేరు చేసి ప్లాస్టిక్‌ కవర్‌లో తీసుకువచ్చి చౌరస్తాలో పడేశారు. ఆ సంఘటన తర్వాత క్షుద్రపూజల కోసం ఓ బాలిక తలను నరికి పూజ చేసిన సంఘటన పదేళ్ల క్రితం సంచలనం సృష్టించింది. తాజాగా కాంపల్లి శంకర్‌ హత్య స్థానికంగా కలకలం రేపింది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని