logo
Published : 30/11/2021 03:21 IST

అక్రమ లేఅవుట్లపై అధికారుల్లో కదలిక

హద్దురాళ్లు తొలగిస్తున్న మున్సిపల్‌ అధికారులు
వేములవాడ పరిధిలో 425 ఎకరాల్లో వెంచర్లు
వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే

అక్రమ వెంచర్లలో హద్దులను తొలగిస్తున్న మున్సిపల్‌ అధికారులు

ధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ పట్టణ పరిధిలో అక్రమ లే అవుట్లపై మున్సిపల్‌ అధికారుల్లో కదలిక మొదలైంది. కొంతకాలంగా అక్రమ లేఅవుట్ల జోలికి వెళ్లని అధికారులు ఇటీవల పలు వెంచర్లలోని హద్దురాళ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. వేములవాడ పట్టణ పరిసరాల్లో స్థిరాస్తి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. పట్టణం దినదినం అభివృద్ధి చెందడంతో పట్టణ శివారు ప్రాంతాల భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇదే అదనుగా స్థిరాస్తి వ్యాపారులు అక్రమ వెంచర్లను ఏర్పాట్లు చేస్తూ విక్రయాలు చేస్తున్నారు. వేములవాడ పట్టణ శివారు ప్రాంతాలతో పాటు మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌, నాంపల్లి, అయ్యోరుపల్లి, శాత్రాజుపల్లి, కోనాయిపల్లి ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్ని అంటారు. ఈ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకో వెంచర్లుగా మారుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారులు అక్రమ వెంచర్లకు తెరతీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లా అధికారులు అక్రమ వెంచర్ల నిరోధానికి చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ అధికారులకు ఆదేశించడంతో అక్రమ వెంచర్లపై మున్సిపల్‌ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల మున్సిపల్‌ పరిధిలో 9 వెంచర్లను గుర్తించి ఇప్పటివరకు ఏడింటిలో హద్దురాళ్లను తొలగించారు. మిగతా వాటిలో తొలగించే పనిలో ఉన్నారు.


యథేచ్చగా విక్రయాలు

మున్సిపల్‌లోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు గతంలో వేములవాడ ప్రాంతంలో 425 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 57 సర్వే నంబర్లలో అక్రమ వెంచర్లున్నట్లు గుర్తించారు. ఇవి అక్రమ వెంచర్లని తెలిసినా వాటిలో చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇటీవల ఏర్పాట్లు చేసిన వెంచర్లలో మాత్రమే హద్దురాళ్లను తొలగించడం పైనే మున్సిపల్‌ అధికారులు దృష్టి సారించారు. వీటిలోని ప్లాట్లను రిజిస్టేషన్‌ చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్‌కు మున్సిపల్‌ అధికారులు సర్వే నంబర్లతో వినతి ఇచ్చారు. అయినా అందులోని ప్లాట్లకు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అక్రమ వెంచర్ల ద్వారా మున్సిపల్‌కు పెద్ద ఎత్తున ఆదాయం గండి పడుతోంది.


నిబంధనలు గాలికి...
వ్యవసాయ భూములను లే అవుట్‌ చేయాలంటే వ్యవసాయేతర భూములుగా మార్పు చేసి అధికారికంగా లే అవుట్‌ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సామాజిక అవసరాల కోసం లేఅవుట్‌ చేసిన వెంచర్లలో పది శాతం స్థలం వదిలి వేయడంతో పాటు 33 ఫీట్లు, 40 ఫీట్ల వెడల్పుతో రోడ్లు వేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రోడ్లు, విద్యుత్తు, మురుగు కాలువలు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించి అనుమతులు పొంది ప్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. ఇలాంటి వసతులు ఏవీ ఏర్పాటు చేయకుండా ఎలాంటి అనుమతులు పొందకుండానే మున్సిపల్‌ పరిధిలో వందల ఎకరాల్లో రూపాయి ఖర్చు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేసి ప్లాట్లను అమాయక ప్రజలకు స్థిరాస్తి వ్యాపారులు అంటగడుతున్నారు. మరి కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కి పేపర్లపై నక్ష తీయించి కాగితాలపైనే ప్లాట్లు క్రయ విక్రయాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ వెంచర్లతో మున్సిపల్‌ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్న మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి ఇప్పటికైనా పూర్తిస్థాయిలో అక్రమ వెంచర్లపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అక్రమ వెంచర్లపై చర్యలు
- శ్యామ్‌సుందర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ వేములవాడ

మున్సిపల్‌ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల కొన్నింటిలో హద్దులను తొలగించాం. ఇంకా తొలగించాల్సి ఉంది. అక్రమ వెంచర్లలో రిజిస్ట్రేషన్‌ చేయొద్దని సబ్‌రిజిస్ట్రార్‌కు వినతి ఇచ్చాం. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిబంధనల ప్రకారం అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకుంటాం. వాటిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరగదు

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని