logo
Published : 30/11/2021 03:21 IST

అడ్డు తొలగించుకునేందుకే హత్య

భార్య, ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు
సినీ తరహాలో చంపినట్లు నిందితుడి వెల్లడి

గోదావరిఖని-జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే అంతమొందించాలని పన్నాగం వేశాడు.. అవకాశం కోసం వేచి చూస్తూ ఇంటికి పిలిపించి మరీ హత్య చేశాడు. డిటెక్టివ్‌, నాపేరు శివ సినిమా తరహాలో చంపినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. కుటుంబంలో కలహాలకు కారణమైన పొయ్యిల రాజు(28)తో ఫోన్‌లో ఘర్షణపడ్డ మీసేవ ఆపరేటర్‌ కాంపల్లి శంకర్‌(35) నేరుగా అతని ఇంటికి వెళ్లగా, అవకాశం కోసం చూస్తున్న రాజు అతన్ని అక్కడే చంపేశాడు. శరీర భాగాలను 7 ముక్కలుగా చేసి.. ఒక్కో ప్రాంతంలో పడేసి  విషయాన్ని ప్రియురాలికి తెలిపాడు. ఆమె సూచన మేరకు ఎలాంటి ఆనవాళ్లు ఉండకుండా మిగతా శరీర భాగాలను  కూడా పడేసి ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేశాడు.. రాజు, ప్రియురాలిని ఎన్టీపీసీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసే పొయ్యిల రాజుకు అదే ఆస్పత్రిలో పనిచేసే వివాహితతో పరిచయం ఏర్పడింది. భర్త శంకర్‌ పెట్టే వేధింపులను అతనితో చెప్పుకొని బాధపడేది.. ఈ క్రమంలో వారి మధ్య చనువు పెరిగింది. విషయం శంకర్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. అనేక సార్లు ఇదే విషయంలో గొడవలు జరిగాయి. దీంతో భార్య ఎన్టీపీసీ పోలీసుస్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు మంచిగా ఉండాలని చెప్పి పంపించారు. తన భార్యతో రాజుకు ఉన్న సంబంధం గుర్తుకు వచ్చిన శంకర్‌ ఈ నెల 25న రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం తాగి ఫోన్‌లోనే రాజుతో తీవ్రంగా సంభాషించాడు. ఆగ్రహంతో నేరుగా రాజు ఇంటికి వెళ్లాడు.

నీ వల్ల కుటుంబంలో కలహాలు మొదలయ్యాయని ఘర్షణ పడ్డాడు. ఇదే అదనుగా భావించిన రాజు అక్కడే ఉన్న ఖాళీ  సీసాతో శంకర్‌ తలపై కొట్టాడు. ఇదివరకే కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్న కత్తులతో గొంతు కోసి తల భాగాన్ని వేరు చేశాడు.  అదేరోజు రాత్రి శంకర్‌ ద్విచక్ర వాహనం తీసుకుని శరీర భాగాలను వేరు వేరు చోట్ల పడేశాడు.. అక్కడి నుంచి నేరుగా పెద్దపల్లికి వెళ్లి శంకర్‌ ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి బస్సులో తిరిగి ఎన్టీపీసీలోని తన ఇంటికి చేరుకున్నాడు. 26న ఉదయం ఆస్పత్రిలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న ప్రియురాలిని కలిసి శంకర్‌ను హత్య చేసినట్లు చెప్పాడు. శరీర భాగాలను కొన్నింటిని పడేసినట్లు చెప్పాడు. మరికొన్ని ఇంట్లోనే ఉన్నాయని వెల్లడించాడు. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మిగతా శరీర భాగాలను పడేసి రమ్మని ఆమె చెప్పింది. ఇంటికి వెళ్లిన రాజు మరమ్మతు కోసం ఇచ్చిన తన ద్విచక్ర వాహనాన్ని తెచ్చుకొని, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మెడ నుంచి నడుము వరకు ఉన్న శరీర భాగాన్ని మేడిపల్లి ఓసీపీ సమీపంలో, నడుము నుంచి మోకాళ్ల వరకున్న తొడల భాగాలను గోదావరిఖని ఆర్టీసీ క్వార్టర్స్‌ సమీపంలోని చెత్తకుప్పల్లో పడేసి ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం శంకర్‌ తల్లి పోచమ్మ ఎన్టీపీసీ పోలీసులకు తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 27న ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎన్టీపీసీ గోడ పక్కన తల, చేయి భాగాలు గుర్తించినట్లు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పోచమ్మ తన కుమారునిదిగా గుర్తించడంతో అదృశ్యం కేసును హత్య కేసుగా నమోదు చేశారు. రాజు, ప్రియురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే శంకర్‌ను హత్య చేసినట్లు రాజు ఒప్పుకున్నాడు. రాజు ఇంట్లో సోదాచేసి కత్తులు, పగిలిన బీరుసీసా, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. మృతుని ద్విచక్ర వాహనాన్ని పెద్దపల్లిలో, హంతకుని ద్విచక్రవాహనాన్ని అతని ఇంటి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీసీపీ రవీందర్‌, ఏసీపీ సారంగపాణి, సీఐ లక్ష్మీనారాయణ, రవీందర్‌, ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌, శ్రీధర్‌, మహేశ్‌, రాజశేఖర్‌, శరణ్య పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని