logo
Published : 30/11/2021 03:21 IST

పాఠశాలల అభివృద్ధి.. పంచాయతీల బాధ్యత

వసతుల కల్పనకు ఆర్థిక సంఘం నిధులు
న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం

చొప్పదండి మండలంలోని ఉన్నత పాఠశాలలో అధ్వానంగా  మూత్రశాలలు

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే బాధ్యతను పంచాయతీలు చేపట్టనున్నాయి. వసతులు సమకూర్చడంతో పాటు అవసరమైన వాటికి మరమ్మతు చేసి బడులను బలోపేతం చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంచాయతీలకు ఏటా విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధుల్లో కొంత భాగం ఇందుకోసం వెచ్చించనున్నారు. ఈ మేరకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సర్కారు బడుల్లో వసతుల మెరుగుకు ఉపయోగించాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ప్రభుత్వం నుంచి అందించే నిధులపైనే పాఠశాలల అభివృద్ధి ఆధారపడేది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో స్థానికంగా పంచాయతీలే ఆర్థిక సంఘం నిధులతో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.

నాడు పారిశుద్ధ్యం.. నేడు నిధులు
కరోనా నేపథ్యంలో కొంత కాలం మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పుడు పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. జిల్లాలో మొదట్లో వాటిల్లోని కార్మికులు పారిశుద్ధ్య పనులు నిర్వహించినా మెజార్టీ బడుల్లో వాటి వైపు తొంగిచూసే వారు కరవయ్యారు. అటెండర్లు, సర్వీసు వర్కర్లు లేని కారణంగా మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. తాజాగా పాఠశాలల అభివృద్ధికి నిధులు ఆర్థిక సంఘం నుంచి కొంత వెచ్చించే బాధ్యతను అప్పగించడంతో వాటికి కొంత మేలు జరగనుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. మరో వైపు నిధుల సమస్యతో బాధపడుతున్న పంచాయతీలు కూడా పాఠశాలల అభివృద్ధి బాధ్యతను ఏ మేరకు నిర్వర్తిస్తాయనేది కూడా ఉపాధ్యాయుల్లో సందిగ్ధంగానే నిలుస్తోంది.

మానకొండూర్‌ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలమైన తలుపు

అభివృద్ధికి ఇలా..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 652 ఉన్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లోని పాఠశాలలు మినహాయిస్తే జిల్లాలోని 313 గ్రామ పంచాయతీల పరిధిలో 6 వందల వరకు బడులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు పెద్దసంఖ్యలో పెరిగాయి. మరో వైపు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పాఠశాలల యాజమాన్య కమిటీలు పాఠశాలల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలకు అనుసంధానంగా అందించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాల ప్రకారం బడుల్లో చేపట్టాల్సిన పనులు ఇలా ఉన్నాయి.

తాగునీరు, పైపులైన్ల లీకేజీల తొలగింపు, హ్యాండ్‌ వాష్‌ యూనిట్‌ ఏర్పాటు.
బాల, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు
శానిటరీ ప్యాడ్ల దహనానికి యంత్రాల ఏర్పాటు
దివ్యాంగ విద్యార్థులు ప్రత్యేకంగా మరుగుదొడ్ల, ర్యాంపుల నిర్మాణం
మధ్యాహ్న భోజనం వంట గదులు, వసతుల ఏర్పాటు, పెరటి తోటల పెంపకం.
విద్యుత్తు కనెక్షన్లు, మరమ్మతులు, మెరుగైన రీతిలో విద్యుత్తు సరఫరా
నెట్‌ వైఫై సదుపాయం.
తరగతి గదులు, మరుగుదొడ్ల ఫ్లోరింగ్‌, తలుపులు, కిటికీలు, ఫర్నీచర్‌, ప్రహరీలకు మరమ్మతులు.
మైదానాల అభివృద్ధి, వర్షం నీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతల నిర్మాణాలు.

ఉత్తర్వుల అమలు
- వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి

ప్రభుత్వ పాఠశాలలను పంచాయతీలు అభివృద్ధి చేసేలా ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నాం. పాఠశాలల్లో ఏమైనా సమస్యలుంటే ప్రధానోపాధ్యాయులు సర్పంచి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లా విద్యాశాఖ అధికారుల సమావేశంలోనూ ఈ విషయాలను చెప్పాం. ప్రధానోపాధ్యాయులు సమస్యలను ఎంపీడీవోల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని