logo
Updated : 30/11/2021 07:17 IST

ఎమ్మెల్సీగా గెలిస్తే.. ఏం చేస్తానంటే?

హక్కులు, విధుల సాధనే లక్ష్యం

మండలి బరిలోని అభ్యర్థుల హామీలిలా..

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

మండలి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటు వేటలో ముందుకు సాగుతున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరఫున శాసనమండలిలో తమ గళాన్ని వినిపిస్తామని.. పల్లెలు, పట్టణాలకు అవసరమైన ప్రగతిని అక్కున చేరుస్తామనేలా భరోసానిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా తమ హామీల వాణిని వివరిస్తున్నారు. ఒక్క అవకాశాన్నివ్వాలనే విజ్ఞాపనను ఓటరుగా మారిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్‌, కౌన్సిలర్ల ఎదుట పెడుతున్నారు. మీ ఎజెండానే మా గెలుపు జెండా అనేలా బరిలో నిలిచిన అభ్యర్థులు తమదైన ప్రచారాన్ని లోలోపల కొనసాగిస్తున్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తంగా 10 మంది బరిలో నిలిచారు. అందులో తెరాస తరఫున ఇద్దరు అభ్యర్థులు గెలుపు ధీమాతో ముందుకుసాగుతుండగా.. స్వతంత్రులుగా బరిలోనిలిచిన వారిలో మరో ఇద్దరు పార్టీలకతీతంగా తమకే ఓటు మద్దతు లభిస్తుందనే విజయకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఓటరు ఎదుట అభ్యర్థులు వినిపిస్తున్న హామీల తీరు ‘ఈనాడు’కు వెల్లడించారిలా..


అనుభవాన్ని రంగరించి..
-ఎల్‌.రమణ, తెరాస అభ్యర్థి

దాదాపుగా 20 ఏళ్లకుపైగా ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా రాజకీయాల్లో రాణించాను. నాకున్న అనుభవాన్ని రంగరించి స్థానిక సంస్థల బలోపేతానికి తగిన కృషిని చేస్తాను. ఎమ్మెల్సీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవాన్ని రెట్టింపు చేస్తాను. అన్నిరకాలుగా వారికి చేదోడు వాదోడుగా ఉంటాను. నా వంతుగా విద్య, వైద్యం విషయంలో అవసరమైన నిధులను విరివిగా అందించేలా చొరవ చూపిస్తాను. ఎంపీటీసీ , జడ్పీటీసీ సభ్యులు స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ఆరాటపడుతున్నారో వాటిని నెరవేర్చే దిశగా నా గళాన్ని మండలిలో బలంగా వినిపిస్తాను. వాటి సాధనకు అవసరమైన కార్యాచరణను వారి సహకారంతో పక్కాగా అమలుచేసి తీరుతాను. ఓటర్లైన ప్రజాప్రతినిధులు నన్ను భారీ ఆధిక్యతతో గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. తెరాస చేపడుతున్న అభివృద్ధిలో అందరం భాగస్వాములమై పల్లెలు, పట్టణాల రూపును మరింతగా ప్రగతి పథంలోకి తీసుకెళ్తాం.


పంచాయతీలో కుర్చీ ఉండేలా..
- టి. భానుప్రసాద్‌రావు, తెరాస అభ్యర్థి

తంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు వారి గౌరవాన్ని నిలబెట్టేలా నా వంతు తోడ్పాటును అందించాను. మరోసారి వారి పక్షాన నిలబడుతూ నిధులు, విధుల్లో సమున్నత గౌరవాన్ని నిలబెట్టాలనే కాంక్షతో పోటీలో నిలుచున్నాను. గ్రామపంచాయతీలో ఎంపీటీసీ సభ్యులకు కుర్చీ ఉండాలనే వారి న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చే దిశగా నా ప్రయత్నాన్ని పక్కాగా చూపిస్తాను. ఇప్పటికే జీతాల పరంగా ప్రభుత్వం పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. మరింతగా మెరుగనే పంథాలో వారికి మున్ముందు న్యాయం చేసేలా నేను వారికి అండగా నిలబడతాను. అదే విధంగా పంద్రాగస్టు, గణతంత్ర వేడుకల్లో జెండాను వేరేచోటనైనా ఎగురవేయించే అవకాశాన్ని ఇవ్వాలనే డిమాండ్‌ వారి నుంచి వినిపిస్తోంది. ఇందుకు తగినట్లుగా నావంతు సహకారం అందిస్తాను. వారికి అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ వారి విలువను పెంచుతాను.


ప్రశ్నించే గొంతుకనవుతా..!
- సర్దార్‌ రవీందర్‌సింగ్‌, స్వతంత్ర అభ్యర్థి

తెలంగాణ ఉద్యమకారుడిగా నేను అందరి సహకారంతో బరిలో నిలుస్తున్నాను. పార్టీలకతీతంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. వారి తరఫున మండలిలో నేను ప్రశ్నించే గొంతుకగా మారబోతున్నాను. ఇప్పటి వరకు ఈ కోటాలో గెలిచిన వారు ప్రజాప్రతినిధులకు ఏం చేయలేదనేది వాస్తవం. స్థానికుడినైన నన్ను ఓటర్లు ఆదరిస్తారనే విశ్వాసంతో ప్రతి గ్రామం, వార్డుల్లోని ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీకులకు కలుస్తూ ఓటును అడుగుతున్నారు. వారికి ఆరోగ్య బీమా వర్తింప చేయడానికి కృషి చేస్తాను. వారికి గతంలో ఉన్న మాదిరిగా ఉండాల్సిన హక్కులు, విధులను సాధించేందుకు అవసరమైన పోరాటాన్ని చేస్తాను. ఆరుసార్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌గా గెలిచిన అనుభవం నాకుంది. అందుకనే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపిస్తాను. అందరి మద్దతుతో గెలుస్తాననే ధీమాతో ఉన్నాను.


పూర్వ వైభవం తెస్తాను
- ప్రభాకర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చాలా సమస్యలు ఉన్నాయి. వారి పక్షాన స్వతంత్రుడిగా బరిలో నిలిచాను. ప్రస్తుతం ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాకు పార్టీలకతీతంగా అందరూ సంపూర్ణ సహకారం అందిస్తానని మాటిచ్చారు. నిర్వీర్యమైన స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తాను. హక్కులు, విధుల పరంగా వారిని సమున్నతంగా నిలబెట్టేలా పోరాటం చూపిస్తాను. ఇన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు పడుతున్న వేదనను తీర్చాలనే ఉద్దేశంతో పోటీలో నిలబడ్డాను. ఎన్నికల నోటిఫికేషన్‌ ముందరే చాలామంది ప్రజాప్రతినిధులు నన్ను బరిలో నిలబడమనేలా మద్దతును తెలియజేశారు. కచ్చితంగా నాకు అందరూ ఓట్లు వేస్తారనే విశ్వాసం ఉంది. ప్రజాప్రతినిధుల తరఫున మండలిలో ప్రశ్నించే గొంతుకగా మారుతాను. ఇన్నాళ్లుగా ఏదైతే కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి సరైన గౌరవం తీసుకొచ్చేలా శ్రమిస్తాను.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని