logo
Published : 01 Dec 2021 03:46 IST

చిత్ర వార్తలు

అంజన్న క్షేత్రం భక్తజన సంద్రం

ఆలయంలో వద్ద భక్తుల రద్దీ

మల్యాల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్నకొద్దీ వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తూ స్వామివారిని దర్శించుకొని వెళుతున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు వివిధ వాహనాల్లో తరలిరావడంతో బస్టాండు, 20 గదుల ధర్మశాల ముందు భారీగా వాహనాలు నిలిచాయి.


కాలనీలో కలవరపెడుతున్న దోమ

రామగుండం నగరపాలక సంస్థ 19వ డివిజన్‌ గోపాల్‌నగర్‌ ప్రాంతవాసులు డెంగీతో కలవరపడుతున్నారు. పాతిక గృహాలున్న ఈ ప్రాంతంలో ఇప్పటికే 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన జ్వరం, రక్తకణాల తగ్గుదలతో అనేక మంది చికిత్స పొందుతున్నారు. సింగరేణి క్వార్టర్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు గోపాల్‌నగర్‌ పక్కనుంచే వెళ్లడం, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలుండటంతో దోమలకు ఆవాసంగా మారింది. సమస్య జటిలం కాకముందే  నగరపాలక అధికారులు స్పదించాల్సిన అవసరం ఉంది. 

-న్యూస్‌టుడే, యైటింక్లయిన్‌కాలనీ


ప్రధాన ఆసుపత్రి ద్వారం ఎదుటే పార్కింగ్‌

సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం ముందే వాహనాలు నిలుపుతున్నారు. పార్కింగ్‌ స్థలం ఉన్నప్పటికీ రోగులకు సంబంధించి వచ్చే వారి వాహనాలను సెక్యూరిటీ గార్డు దూరంగా ఆపి ఓ పక్కన పార్కింగ్‌ చేయిస్తున్నాడు. సిబ్బంది వాహనాలకు మాత్రం ఆసుపత్రి ప్రధాన ద్వారం ముందే పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్లు ఉన్నారు. ప్రజలకో నిబంధన... ఆసుపత్రి సిబ్బందికో నిబంధనలా కనిపిస్తోంది.

- న్యూస్‌టుడే, సిరిసిల్లపట్టణం


భగీరథ నీరు.. మురుగుపాలు

గంభీరావుపేట మండల కేంద్రంలోని తొమ్మిదవ వార్డులోని ప్రధాన రహదారిలో మురుగు కాలువపై ఉన్న మిషన్‌భగీరథ పైప్‌లైన్‌కు నల్లాలు బిగించక పోవటంతో నీరు వృథాగా మురుగు కాలువలోకి పోతున్నాయి. గ్రామంలో చాలచోట్ల మిషన్‌ భగీరథ పైపులకు నల్లాలు లేవు. కొన్ని చోట్ల బిగించినప్పటికి భగీరథ నీరు తక్కువ మోతాదులో రావటంతో నీరు పైకి ఎక్కకపోవటంతో కొందరు నల్లాలను తొలగించారు. కొన్ని చోట్ల బిగించలేదు. నల్లాలు లేకపోవటంతో ప్రతిరోజు సాయంత్రం నీరు వృథాగానే పోతుంది.

- న్యూస్‌టుడే, గంభీరావుపేట


తాకిడి తగ్గే.. విశ్రాంతి దొరికే..!

రాజన్న ఆలయంలో సేద తీరుతున్న కోడెలు

వేములవాడ ఆలయం, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసం రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో రాజన్న కోడెలకు ఏ మాత్రం విశ్రాంతి దొరకలేదు. సోమవారం కార్తిక చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 8 వేలకు పైగా మంది భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో రాజన్న కోడెలు అలసిపోయాయి. మంగళవారం ఆలయంలో భక్తులు అంతంత మాత్రంగానే ఉండటంతో కోడెలకు విశ్రాంతి లభించింది. దీంతో ఆలయంలో కోడెలు కట్టు స్థలంలో ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా సేద తీరుతున్నాయి.


రైలు బడి.. కొత్త ఒరవడి
గ్రామస్థుల భాగస్వామ్యంతో అభివృద్ధి

విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లుతున్న దృశ్యం

పిల్లలను ఆకర్శించాలంటే.. ఏదైనా కొత్తగా ఉండాలని ఆలోచించారు.. ఆ గ్రామస్థులు.. పాఠశాలను రైలు బండిగా రంగులతో తీర్చిదిద్దారు. దీంతో పిల్లలు ఆకర్శితులయ్యారు. ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యార్థులకు ఆసక్తికి అనుగుణంగా తీర్చిదిద్దారు.. విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరగడంతో గ్రామస్థుల భాగస్వామ్యంతో పాఠశాలను మరింత అభివృద్ధి పరుస్తున్నారు. ముందుగా గ్రామస్థులంతా తమ పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించుకుంటామని తీర్మానించుకున్నారు. తరగతి గదులు కూడా అనుకూలంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, విద్యా కమిటీ, ఉపాధ్యాయ బృందం, గ్రామస్థుల సహకారంతో రైలు బోగీల మాదిరి తీర్చిదిద్దారు. 1 నుంచి 5వ తరగతి వరకు 105 మంది విద్యార్థులుండగా, పూర్వ ప్రాథమిక పాఠశాలలో 35 మంది మొత్తం కలిపి 140 మంది విద్యార్థులున్నారు. ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పిల్లలకు నూతన పద్ధతులు, చార్టులు, పరికరాలతో బోధిస్తూ, సృజనాత్మకతలను ఆవిష్కరిస్తూ బోధిస్తున్నారు.

- న్యూస్‌టుడే, ధర్మపురి


తోపుడు బండి.. రూపు మారిందండి!

తోపుడు బండి అంటే సైకిల్‌ టైర్లను పోలిన నాలుగు పెద్ద చక్రాలతో చిన్నపాటి మంచం వెడల్పుతో ఉండి.. వీధుల్లో తిప్పేదే మనకు గుర్తుకొస్తుంది. అయితే అన్ని రంగాల్లో వస్తున్న మార్పుల తీరుగానే వీటి పరిమాణమూ తగ్గింది. కోల్‌కతాకు చెందిన చిరు వ్యాపారులు మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని కమాన్‌చౌరస్తా వద్ద ఈ చిన్న తోపుడు బండిలో కుక్కపిల్ల బొమ్మలను అమ్ముతూ కనిపించారు. ‘బై హ్యాండ్‌’ తోపుడు బండిగా పిలిచే వీటిని రద్దీ ప్రాంతంలో, ఇరుకైన వీధుల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా తిప్పుతూ సామగ్రి అమ్ముకునే వీలుంటుంది.

-ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి


కాకతీయుల కాలం నాటి చాముండి విగ్రహం గుర్తింపు

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ గ్రామ శివారులోని ఆలయంలో కాకతీయ శైలి చాముండి దేవత విగ్రహం గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, యువచరిత్ర కారుడు సామలేటి మహేశ్‌లు గుర్తించినట్లు మంగళవారం తెలిపారు. మకరతోరణం కింద, సుఖాసనంలో కూర్చున్న చాముండి దేవత తలపై కరండమకుటం, చెవులకు చక్ర కుండలాలు, భుజకిరీటాలు, మెడలో హార, గ్రైవేయకాలు, అర్థోరుకం, ఉరుండాలు, చేతులకు కంకణాలు కాళ్ల కడియాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కాకతీయుల శైలి 13వ శతాబ్దం శిల్పమని భావిస్తున్నారు. కాకతీయుల నాటి చాముండి విగ్రహాన్ని కాపాడుకోవాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని