logo
Published : 01/12/2021 03:46 IST

ఆన్‌లైన్‌ వేదిక.. ప్రతిభా వీచిక

‘కళా ఉత్సవ్‌’లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

చిన్నారుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యం, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా పాఠశాల స్థాయిలో ‘కళా ఉత్సవ్‌’ పోటీలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్‌లోనే పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు వివిధ రంగాల్లో అబ్బురపరిచారు. ఎనిమిది కేటగిరీల్లో బాలికలు, బాలుర విభాగాల్లో పోటీలు జరిగాయి. కవితలు, చిత్రలేఖనం, సంప్రదాయ నృత్యం ఇతర రంగాల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆన్‌లైన్‌ ప్రదర్శనలో సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన చిన్నారుల నేపథ్యంపై ‘న్యూస్‌టుడే’ కథనం.


నృత్యంలో హారిక అదుర్స్‌

పాలకుర్తి మండలం కుక్కలగూడూరు ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని హారిక సంప్రదాయ లంబాడా నృత్యంలో రాణించింది. చిన్నతనం నుంచి నృత్యంపై మక్కువతో ఖాళీ సమయంలో సాధన చేస్తూ, నైపుణ్యం పెంచుకునేందుకు శ్రమిస్తోంది. పలు పోటీల్లో ఉత్తమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకుని ప్రశంసలు పొందింది. ఆన్‌లైన్‌ పోటీల్లో కళా నైపుణ్యం ప్రదర్శించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.


వాహ్‌.. 2డీ చిత్తరువు

పెద్దపల్లి బాలుర పాఠశాలకు చెందిన మంజుల 2డీ చిత్రలేఖనంలో పట్టు సాధిస్తోంది. ఆమె చేతి నుంచి జాలువారిన చిత్తరువుల్లో సహజత్వం ఉట్టిపడుతోంది. ‘ఇండియా గేట్‌’ను అందంగా, నిజమైన కట్టడం లాగే గీసింది. చిన్ననాటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న మంజుల సాధనతో నైపుణ్యం పెంచుకుంటోంది. ఆన్‌లైన్‌ పోటీల్లో ఆమె గీసిన బొమ్మలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. పర్యావరణం, పలు రకాల కళాకృతులకు జీవం పోస్తోంది.


పనికి రాని వస్తువులకు జీవం

వాడి పారేసిన ఖాళీ ప్లాస్టిక్‌ సీసాలతో బొమ్మలకు ప్రాణం పోసింది పెద్దపల్లి బాలుర పాఠశాల విద్యార్థిని స్పందన. అంతరించిపోతున్న తోలుబొమ్మలాట కళను గుర్తుకు తెచ్చేలా మనుషుల ఆకృతిలో బొమ్మలను రూపొందించి అబ్బురపరిచింది. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజు ఎలా నిమజ్జనం చేస్తారో బొమ్మల ద్వారా చూపించి ఆకట్టుకుంది. వాడి పారేసిన వస్తువులు వృథా కాకుండా సందేశాత్మక కళను ప్రదర్శించింది.


విద్యార్థుల కళా నైపుణ్యం వెలికితీత
జగదీశ్వర్‌, గుణాత్మక విద్య జిల్లా సమన్వయకర్త

విద్యార్థుల్లోని నైపుణ్యం, సంప్రదాయ కళలను వెలికితీసేందుకు కళోత్సవ పోటీలు దోహదపడుతున్నాయి. ఆన్‌లైన్‌ పోటీల్లో చిన్నారులు అద్భుతమైన కళలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో చదువుతో పాటు కళలను ప్రోత్సహించే ప్రయత్నం మంచిదే.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని