ఇసుక మేట.. కాసుల వేట
వాగుల్లో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తవ్వకాలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల, న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలం పదిర వద్ద వాగులోకి వాహనాల రాకపోకలకు మట్టితో నింపిన తీరు
భారీ వర్షాలకు జిల్లాలోని మానేరు, మూలవాగులు వరదలతో ఉప్పొంగాయి. వాగులు, వంకల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటేసింది. దీనిపై ఇసుకాసురుల కళ్లు పడ్డాయి. రెవెన్యూ ఆదాయానికి గండి కొడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు.
జిల్లాలోని వాగులు, వంకల్లో రాత్రి ఏడు దాటితే చాలు సామగ్రి తరలించే వాహనాలు, ట్రాక్టర్లతో నిండిపోతాయి. మానేరు, మూలవాగుల్లో రెవెన్యూశాఖ అనుమతి ఉన్న ఇసుకరీచ్‌లు ఉన్నాయి. ఒక్కో మండలానికి వారంలో రెండ్రోజులు ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో వేబిల్లులు జారీ చేస్తారు. వీటిని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 లోపు ఇసుక తరలించాలి. నిబంధనలు తుంగలో తొక్కి రాత్రికి రాత్రి జిల్లా సరిహద్దులు దాటిస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. స్థానికంగా ట్రాక్టర్ రూ.3000-3500 చెల్లిస్తుండగా.. ఇతర ప్రాంతాలకు తరలించే వాహనాల సామర్థ్యాన్ని మట్టి రూ.8000-30,000 వసూలు చేస్తున్నారు. ఒక ఇసుక ట్రాక్టర్ నింపితే రూ.300 కూలీ చెల్లిస్తారు. ఈ లెక్కన నాలుగు ట్రాక్టర్లు నింపితే ఒక్క రాత్రి రూ.1200 గిట్టుబాటవుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులు ఇసుక నింపే కూలీకి ఆకర్షితులవుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
మానేరువాగులో ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాలు, మూలవాగు పరిధిలో కోనరావుపేట, వేములవాడ మండలాల పరిధిలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఇష్టారీతిన ఇసుక తవ్వకాలతో సమీపంలోని వ్యవసాయ పొలాల్లోని బోరుబావులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, పదిర, తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు ఇసుక తవ్వకాలను నిరోధించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి సమయంలో ఇసుక వాహనాలను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసుశాఖలు సాహసం చేయలేకపోతున్నాయి. అక్రమార్కులు వాగు పరిసర ప్రాంతాల్లో బృందాలుగా ఉంటారు. సెల్‌ఫోన్‌తో ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకుంటారు. ఎవరైనా ఆకస్మికంగా ఎదురువస్తే మద్యం మత్తులో ఎంతటికైనా తెగిస్తారు. అధికారులు సాహసం చేసి పట్టుకున్నా.. అపరాధ రుసుము, పైరవీలతో తప్పుకుంటారు. గ్రామాల్లో ఇసుక దాందా కోసమే ట్రాక్టర్లు కొనుగోలు చేయడం గమనార్హం.
పటిష్ఠమైన చర్యలు లేక..
జిల్లాలో స్థానిక అవసరాలు.. ప్రభుత్వ నిర్మాణాలకు 2019లో మానేరు, మూలవాగు పరిధిలో ఆరు ఇసుకరీచ్‌లలో 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను గుర్తించారు. వీటిని 13 మండలాలకు కేటాయించారు. రెండేళ్లుగా అవే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వాగులు, వంకల్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలున్నాయి. గనులు, రెవెన్యూశాఖ కొత్తగా వచ్చి చేరిన ఇసుక నిల్వలను గుర్తించి ఎంతమేరకు తీయాలనే ఆదేశాలేవీ లేకపోవడంతో ఇష్టారీతిన తవ్వుతున్నారు. వేబిల్లులో ఒక క్యూబిక్ మీటరుకు రూ.100 చెల్లించాలి. ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్లు మాత్రమే అనుమతి. ఇసుక తవ్వకాలపై పకడ్బందీ ప్రణాళికా.. పటిష్ఠమైన చర్యలు చేపడితేనే గ్రామాల్లో ఇసుక వివాదాలు సద్దుమణుగుతాయి.
ఫిర్యాదు చేసినా స్పందించరు..: - కంచర్ల సాయిలు, పదిర, రైతు
ఇసుక తవ్వకాలతో వాగులోని బోరుబావులు పనిచేయడంలేదు. మా గ్రామంలో ఇసుక రీచ్ లేకున్నా అక్రమంగా ఇసుక తీస్తున్నారు. దీనిపై రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
అక్రమ తవ్వకాలను గుర్తిస్తాం..: - మాజీద్, తహసీల్దార్, ఎల్లారెడ్డిపేట
స్థానిక అవసరాలకు మాత్రమే వేబిల్లులు జారీ చేస్తున్నాం. అనుమతి పొందిన ట్రాక్టరు పగటిపూట మాత్రమే ఇసుకను తీసుకోవాలి. రాత్రి సమయంలో ఇసుకను తీసి ఇతర ప్రాంతాలకు తరలించే అనుమతిలేదు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
నిఘా పెంచుతాం..: - మొగిలి, సీఐ, ఎల్లారెడ్డిపేట
రెవెన్యూశాఖ జారీ చేసిన వేబిల్లుల ప్రకారం ట్రాక్టర్ల జాబితా పోలీసుశాఖ వద్ద ఉంటుంది. ఇతర వాహనాలకు ఇసుక తరలించే అనుమతి లేదు. మానేరువాగు పరిసర గ్రామాల్లో గస్తీ పోలీసుల నిఘా పెంచుతాం. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.