logo
Published : 01/12/2021 03:46 IST

ఆదాయం లక్షన్నర..ఆమ్యామ్యాలక్ష

ఆది నుంచీ వివాదాస్పదంగానే ఆర్డీవో వ్యవహార శైలి

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం ఇన్‌ఛార్జి కమిషనర్‌ శంకర్‌కుమార్‌

జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే మరో ఉన్నతాధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం చర్చనీయాంశమైంది. రామగుండం నగరపాలక సంస్థ గుత్తేదారుల నుంచి ఇన్‌ఛార్జి కమిషనర్‌, పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌ లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. మూడు నెలల కిందట సెప్టెంబరు 4న జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి వెంకటనారాయణ రూ.40 వేల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు.  ఆర్డీవోగా శంకర్‌కుమార్‌కు నెలకు రూ.1.20 లక్షల వేతనం పొందుతుండగా రామగుండం బల్దియా ఇన్‌ఛార్జి కమిషనర్‌గా అదనంగా మూలవేతనంలో 1/5 వంతు, ఇతర భత్యాలతో కలుపుకుని రూ.30 వేలు కలిపి మొత్తం రూ.1.50 లక్షల వేతనాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు.

రాజకీయ అండదండలతో..
శంకర్‌కుమార్‌ 2020 జనవరి 6న పెద్దపల్లి ఆర్డీవోగా నియమితులయ్యారు. అప్పటి జిల్లా పాలనాధికారిణి శ్రీదేవసేన ఆయనను విధుల్లోకి అనుమతించేందుకు నిరాకరించారు. విధి నిర్వహణలో అలసత్వం, లంచాలు తీసుకునే మనస్తత్వం కావడంతో అభ్యంతరం తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు వెళ్లాల్సినన శంకర్‌కుమార్‌ అక్కడికి వెళ్లకుండా ఏరికోరి స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో పెద్దపల్లి ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు.

* రామగుండం నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జిగా శంకర్‌కుమార్‌ను ఇటీవల ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి అతడి నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రామగుండంలో భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతున్నందున ఐఏఎస్‌ స్థాయి అధికారిని నియమించాలని పట్టుబట్టిన వారికి చుక్కెదురైంది.

* ఆర్డీవో శంకర్‌కుమార్‌ స్వస్థలం వరంగల్‌ కాగా, హన్మకొండలోని ఏనుగులగడ్డ ప్రాంతానికి చెందిన తోట మల్లికార్జున్‌ను పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పనిలో పెట్టుకున్నారు. అతడిని ఇలాంటి వ్యవహారాలకే ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఆర్డీవో కార్యాలయంలో మల్లికార్జున్‌ను కలిస్తే ఆర్డీవోను కలిసినట్టేనని ఆయన బాధితులు చెబుతున్నారు.

* ఆర్డీవో కార్యాలయంలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు చేతులు తడపనిదే ఫైళ్లు కదలని పరిస్థితి నెలకొంది. సీసీ కెమెరాలున్నా వాటి పరిధి లేని ప్రాంతాల్లో డబ్బులు చేతులు మారుతుంటాయి.


రెవెన్యూ శాఖలో కలకలం

ఆర్డీవో రూ.లక్ష లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కడంతో జిల్లాలోని రెవెన్యూ అధికారుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులపై భూ సేకరణ సంబంధిత అంశాల్లో పలు అవినీతి ఆరోపణలున్నాయి. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ధరణి సేవలు అందుబాటులోకి వచ్చినా అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో చోటుచేసుకున్న లొసుగులను ఆధారంగా చేసుకుని అర్హులైనా డబ్బులిస్తేనే పట్టా హక్కులు ఇస్తామని బహిరంగంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేక రైతులు ఎంతో కొంత ముట్టజెప్పి పని చేయించుకుంటున్నారు.


శభాష్‌.. గైక్వాడ్‌

రామగుండం నగరపాలక సంస్థలో గుత్తేదారుగా వ్యవహరిస్తున్న గైక్వాడ్‌ రజనీకాంత్‌ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. గతంలో డీఈ స్థాయి అధికారిని పట్టించిన ఆయన సాహసం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్డీవో స్థాయి అధికారిని పట్టించడంపై పలువురు ఆయనను అభినందిస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని