logo
Published : 01/12/2021 03:46 IST

అవినీతిగుండం

కమీషన్లు లేనిదే కదలని దస్త్రం

వరుస ఘటనలతో బల్దియా అభాసుపాలు

న్యూస్‌టుడే, గోదావరిఖని

రామగుండం నగరపాలక కార్యాలయం

రామగుండం నగరపాలక సంస్థ అక్రమాలకు కేంద్రంగా మారుతోంది. గుత్తేదార్లకు పనుల కేటాయింపు నుంచి బిల్లుల చెల్లింపు వరకు కమీషన్లు లేకుండా దస్త్రాలు కదలని పరిస్థితి. గోదావరి వంతెనపై ఏర్పాటు చేస్తున్న ఫెన్సింగ్‌ పనుల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పట్టణ ప్రణాళిక నిధుల మళ్లింపుతో పాటు 14వ ఆర్థిక సంఘం పనులు అప్పగించకుండా ఆగిపోవడం వెనుక కూడా కమీషన్ల దందా ఉందన్న చర్చలు జోరుగా సాగాయి. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులకు సంబంధించిన పనుల కేటాయింపులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపించాయి.

కొవిడ్‌ పనుల్లో భారీ అవినీతి
కొవిడ్‌ సమయంలో హైపోక్లోరైడ్‌ ద్రావణం చల్లేందుకు ఏర్పాటు చేసుకున్న ట్రాక్టర్లలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. 14 ట్రాక్టర్లను ఆరు నెలలు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించి, ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.64 వేల చొప్పున చెల్లించాలని బల్దియా నిర్ణయించింది. అయితే రెండు నెలలు మాత్రమే వినియోగించారు. ఆ తర్వాత యజమానులు బయట పనులకు వినియోగించుకున్నారు. కానీ ఆరు నెలల వరకు నడిపించినట్లు బిల్లులు తయారు చేసేందుకు అధికారులతో అంతర్గతంగా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మూడు నెలలకు సంబంధించిన బిల్లులు తయారు చేసినట్లు సమాచారం. వీటిని ట్రాక్టర్‌ యజమానులకు అప్పగించేందుకు కమీషన్లు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లు బయట తిరిగినప్పటికీ నగరపాలక సంస్థలో పనిచేసినట్లు రికార్డులు తయారు చేసి బిల్లులు చెల్లించేందుకు భారీ ఎత్తున కమీషన్ల వ్యవహారం కుదిరినట్లు సమాచారం..


పక్కదారిలో పనులు.. దర్జాగా దందాలు

* గుత్తేదార్లకు కేటాయించే పనుల్లో కమీషన్ల దందా సాగుతోంది. గతంలో పని చేసిన అధికారి కొన్ని పనులను పక్కనపెట్టి వెళ్లారు. వాటిని తిరిగి కేటాయించేందుకు ఒక్కో పనికి కొంత మొత్తంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ.3 కోట్ల విలువైన పనులను నామినేషన్ల కింద కేటాయించినట్లు సమాచారం. రాజీవ్‌రహదారి ఓ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ ఫ్రీలెఫ్టు కోసం మధ్య డివైడర్‌ను తొలగించి సిమెంటుతో చేపట్టే పనులకు రూ.50 వేల వరకు వెచ్చించారు. కాని రూ.2 లక్షల విలువ చేసే బిల్లును తయారు చేసినట్లు  తెలిసింది.

* హరితహారంలో నాటిన మొక్కల కంటే ఎక్కువ బిల్లు కోసం ప్రయత్నించారు. కాగా ఓ సంస్థ అక్కడ నాటిన మొక్కల లెక్క జియో ట్యాగింగ్‌ ప్రకారం తక్కువగా చూపిస్తోందని వెల్లడించింది. నగరపాలక చెప్పిన మొక్కల లెక్కకు బిల్లులు చెల్లించలేమని తెలిపింది. అటవీ శాఖ అధికారులతో రికార్డు చేయిస్తే బిల్లులు చెల్లిస్తామని ఆ సంస్థ అధికారులు వివరించారు. నాటింది 60 వేల వరకు మొక్కలైతే లక్ష మొక్కలకు బిల్లు కావాలని అడగడంతో ఆ సంస్థ అంగీకరించలేదు. దీంతో పట్టణ ప్రగతికి చెందిన నిధులను హరితహారానికి మళ్లించి బిల్లులు తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

* నగరపాలక సంస్థకు చెందిన ఇనుము తుక్కు(స్క్రాప్‌) దర్జాగా తరలించుకుపోయారు. సీసీ పుటేజీలోనూ రికార్డయింది. రూ.లక్షల విలువైన స్క్రాప్‌ చోరీకి గురైతే రూ.వేలల్లో పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థకు చెందిన ఓ ప్రజాప్రతినిధి దర్జాగా తరలించుకుపోయినట్లు ఆరోపణలున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. దీనికి మరో ప్రజాప్రతినిధి సహకారం అందించాడు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని