logo
Published : 01/12/2021 03:46 IST

ఇటు లక్ష్యం.. అటు నిర్లక్ష్యం

మాయమవుతున్న మొక్కలు

సంరక్షణ చర్యలపై చిన్నచూపు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

శనివారం అంగడి బజారు నుంచి రాజీవ్‌ నగర్‌ వెళ్లే దారిలో నేతబజారు ఎదురుగా నెల రోజులుగా మొక్కలు, ట్రీగార్డులు పడి పోయాయి. నాటిన మొక్కలు విరిగిపోయి ఎండి పోయాయి. వీటిని అప్పటి నుంచి ఇప్పటివరకు సరి చేసిన వారే లేకుండా పోయారు.

‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్న అధికారులు ఆ లక్ష్యం పూర్తయిన తర్వాత సంరక్షణ బాధ్యతలు అటకెక్కిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కరీంనగర్‌ నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిందని, ఏవైపు చూసినా ఎడారిని తలపిస్తుందని మూడోవిడత హరితహారం కార్యక్రమానికి ప్రారంభంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొనడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇళ్లలో, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, పార్కులు, రోడ్లకు ఇరువైపులా, రిజర్వాయర్లు, ఫిల్టర్‌బెడ్‌లు, శ్మశానవాటికలు మొదలగు ప్రాంతాల్లో మొక్కలు నాటి నగర వీధులను పచ్చదనంతో నింపుతున్నారు. అందులో భాగంగా ఏడో విడతలో ఎక్కడ స్థలం కనిపిస్తే చాలు అక్కడ మొక్కలు నాటడం, మియావాకీ మాదిరిగా పట్టణ ప్రకృతి వనాల పేరుతో భారీగా చెట్లను నాటించారు. ఇంకేముంది ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేశారు.

అశోక్‌నగర్‌ నుంచి హుస్సేనీపురకు వచ్చే అంతర్గత వీధిలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు.  మొక్కలు, ట్రీగార్డులు కనిపించకుండా పోయాయి. ట్రీగార్డులు అయితే ఇతరులు తీసుకెళ్లి సొంత అవసరాలకు వాడుకుంటున్నారు.

భారంగా..
నగరంలో ఈ ఒక్క విడతలోనే 5,62,326 మొక్కలు నాటించాల్సి ఉండగా గత నెలాఖరు వరకు 5,62,800 నాటి లక్ష్యాన్ని పూర్తి చేశారు. సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉండగా ఈ మధ్య పూర్తిగా వదిలేశారు. 60 డివిజన్లలోని అంతర్గత వీధుల్లో 1,45,000 మొక్కలు నాటించగా వాటి పరిస్థితి దయనీయంగా మారింది. ఏ డివిజన్‌లో ఎన్ని మొక్కలు నాటించారు? ఎన్ని ప్రస్తుతం ఉన్నాయనే లెక్కలు తీస్తే అసలు విషయం బహిర్గతమవుతోంది.

మొక్కలు, ట్రీగార్డులు..
నగర వీధుల్లో నాటిన మొక్కలు, సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రీగార్డులు మాయమవుతున్నాయి. ఒక్కో మొక్కకు రూ.వందల్లో ఖర్చు చేసిన అధికారులు ఆ తర్వాత అక్కడి పరిస్థితిని పరిశీలించడం లేదు. 60 డివిజన్లలో వందల్లో మొక్కలు, ట్రీగార్డులు లేకుండా పోయాయని ఆయా ప్రాంతవాసులు అంటున్నారు. రోడ్లపై నాటిన మొక్కలు అభివృద్ధి పనుల కారణంగా ఇష్టానుసారంగా తొలగిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం వీటిని లేకుండా చేస్తుండగా కొత్తగా సీసీ రోడ్లు అయిన చోట కనీసం రింగులు వేయడం లేదు.

రెండు నెలల కిందట ప్రతీ డివిజన్‌లో వారానికి ఒకరోజు మొక్కల సంరక్షణ కార్యక్రమం చేపట్టే వారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఏ డివిజన్‌లో చూసినా మొక్కల పరిస్థితి నిర్లక్ష్యంగా ఉంది.

నామమాత్రంగా ప్రతీ శుక్రవారం
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ శుక్రవారం మొక్కలను రక్షించేందుకు గత కమిషనర్‌ వల్లూరు క్రాంతి చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్‌, శానిటేషన్‌ ఇన్‌ఛార్జులు కలిసి డివిజన్లలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆయా వీధుల్లో నాటిన మొక్కలు పరిశీలించారు. మొక్క చుట్టూ గడ్డి తొలగించి, నీటిని పట్టే విధంగా మట్టిని సరి చేశారు. చెట్టు పడిపోకుండా కర్రలు కట్టించారు. ట్రీగార్డులు పడిపోతే మళ్లీ బిగించారు. ఇలాంటి పనులు గత రెండు నెలలుగా కనిపించడం లేదు. ఒకటెండ్రు చోట్ల పనులు చేస్తున్నప్పటికీ నామమాత్రంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలను కాపాడేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశాలిస్తామని ఈఈ రామన్‌ వివరణ ఇచ్చారు. మరింత జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేస్తామన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని