logo
Published : 02/12/2021 03:06 IST

ఆకర్షణీయ పనులతో ఆటలు

రూ.19కోట్ల నిధుల వ్యయంలో నిదానం

రూపుమారని అంబేడ్కర్‌ మైదానం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ఇదీ.. నగరంలోని అంబేడ్కర్‌ మైదానంలోని కాలినడకదారుల కోసం నిర్మించాల్సిన మార్గం దుస్థితి. ఇటు రోజువారీగా నడకకు వీలు లేకుండా..అటు నిర్మాణంలో పురోగతి లేకుండా నెలల తరబడి అసౌకర్యం తీరుతో కొట్టుమిట్టాడుతోంది. మొక్కుబడిగా పర్యవేక్షణలు.. పని విషయంలో పక్కాగా కనిపించని శ్రద్ధ కారణంగా ఇలా అధ్వానమనే పరిస్థితి మైదానంలో అగుపిస్తోంది. సుమారు 600 మీటర్ల మేర చుట్టూరా ఏర్పాటు చేసే విషయంలో పురోగతి ఏ మాత్రం కనిపించడంలేదు.

జిల్లా.. రాష్ట్ర.. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పెట్టింది పేరు కరీంనగర్‌. మెరికల్లాంటి ఆటగాళ్లు.. నైపుణ్యతగల క్రీడాచార్యుల లోగిలిగా మారిన ఇక్కడి నగరంలో ఆటలకు అనువైన వసతుల కల్పనలో ఇంకా జాప్యం జరుగుతోంది. ఆకర్షణీయ నగరాల జాబితాలో చేరిన ఇక్కడి కార్పొరేషన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ మైదానాన్ని ఆధునికీకరించాలని మూడేళ్ల కిందటే నిర్ణయించారు. ఇందుకుగానూ రూ.19 కోట్ల నిధుల అంచనాతో అవసరమైన ప్రగతి పనుల్ని గుర్తించారు. ఎక్కడ లేని విధంగా ఇక్కడి ఆట స్థలాన్ని అన్నిరకాల హంగులతో తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే దాదాపుగా రెండున్నరేళ్ల కిందట నిధులు మంజూరై ఇక్కడి స్థితిని మారుస్తామనేలా కనిపించిన చర్యల్లో ఇంకా జాగు జరుగుతోంది. ఏడాది లోపలే పూర్తి చేయాలనే గడువును నిర్ణయించుకుని ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తవలేదు.

అంబేడ్కర్‌ మైదానం తీరిలా..

రెండు దఫాలుగా..నిధులు

ఇక్కడి అభివృద్ధి పనుల కోసం స్మార్ట్‌ సిటీ నిధుల కింద మొత్తంగా రూ.19 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇక్కడి పాత మైదానం లోపల వెలుపల అన్నిరకాల క్రీడలకు ఉపయుక్తమైన చిన్న మైదానాల్ని నిర్మించాలని ప్రణాళికల్ని రూపొందించారు. కేవలం ఆటలతోనే కాకుండా ఇక్కడి క్రీడలకు తోడ్పాటునిచ్చే ఆదాయ వనరులను అందించాలనే దృక్పథంతో బహుళ అంతస్థుల్లో వాణిజ్య సముదాయాన్ని రోడ్డు వైపునకు నిర్మిస్తున్నారు. రూ.7కోట్లతో రూపొందించిన ఈ భవనం పనులు పూర్తయ్యాయి. దాని పక్కనే బాస్కెట్‌ బాల్‌ మైదానంతోపాటు ఇండోర్‌ మైదానం కూడా ఆధునిక సొబగుల్ని అందుకుంది. స్కేటింగ్‌ ట్రాక్‌ పూర్తయింది. వాకింగ్‌ ట్రాక్‌తోపాటు సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణాలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పాత మైదానం చుట్టూర మెట్ల కింద ఉన్న స్థలాన్ని ఆహ్లాదకర లోగిలిగా మార్చాలని, పలువురు సేదతీరేలా అక్కడి ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులు ఇంకా జరగాల్సి ఉంది. మెట్ల కింద శిథిలమైన చోట మరమ్మతు చేయడంతోపాటు వాటి రూపురేఖల్ని పూర్తిగా మార్చే పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక మంజూరైన మొత్తం నిధుల్లో రెండు దఫాలుగా విడుదలైన తీరుని బట్టి పనులు చేస్తున్నారు. మొదటి దఫా పనులకు రూ.15కోట్లు రెండో దఫాకు రూ.4కోట్లు వెచ్చించబోతున్నారు.

పూర్తయిన స్కేటింగ్‌ మైదానం


పర్యవేక్షణ పెంచితేనే..!

క్రీడాకారుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడి అభివృద్ధి పనుల పర్యవేక్షణను మరింతగా పెంచాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. స్మార్ట్‌సిటీ అధికారులతోపాటు క్రీడాప్రాధికారిక సంస్థ పర్యవేక్షణ మరింతగా పెరగాల్సిన అవసరముంది. కరోనా విపత్తు వల్ల ఇక్కడ నిర్వహించాల్సిన పలురకాల పోటీలను నిర్వహించలేకపోతున్నారు. వాస్తవానికి కరోనా మొదటి దశ తరువాత పనుల్లో వేగాన్నిపెంచి కొత్త మైదానాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ ఇంకా నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి. చేసిన పనులకు సకాలంలో నిధులు అందకపోవడంతో కూడా గుత్తేదారుకు ఇబ్బందిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు నిధుల్ని సకాలంలోఅందేలా చూడటంతోపాటు పనులు చకచకా పూర్తి అయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపించాల్సిన అవసరముంది. క్రీడాకారులకు అందించిన అవకాశాల్ని వారి క్రీడల తీరుని బట్టి త్వరితగతిన ఇక్కడి వసతుల్ని అందించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా యువజన క్రీడల అధికారి రాజవీరు మాట్లాడుతూ పనులను పర్యవేక్షిస్తున్నామని వేగంగా పూర్తిచేసేలా చూస్తామన్నారు. స్మార్ట్‌సిటీ పనులను పర్యవేక్షిస్తున్న ఈఈ రామన్‌ వివరణ ఇస్తూ ఈ ఏడాది డిసెంబర్‌ నెలాకరులోగా పనులన్నింటిని పూర్తిచేయిస్తామని తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని