logo
Published : 02/12/2021 03:38 IST

రద్దీలోనూ రయ్‌ రయ్‌

పట్టణాల్లో భారీ వాహనాలతో పెరిగిన ప్రమాదాలు

రాజీవ్‌ రహదారిపై అటకెక్కిన బైపాస్‌ల నిర్మాణం

న్యూస్‌టుడే, పెద్దపల్లి, సుల్తానాబాద్‌


పెద్దకల్వల వద్ద బైపాస్‌ నిర్మాణం కోసం మార్కింగ్‌ చేస్తున్న సర్వే అధికారులు(పాతచిత్రం)

* ఈ ఏడాది జులై 17న పెద్దపల్లి కమాన్‌కూడలిలో ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న మహిళా ఏఎస్సై భాగ్యలక్ష్మిని వేగంగా వచ్చిన భారీ వాహనం ఢీకొట్టింది. ఆమె శరీరం నుజ్జై అక్కడికక్కడే మృతి చెందింది. పట్టణంలోని ప్రధాన కూడలి వద్దే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

* నవంబరు 20న పెద్దపల్లి మార్కెట్‌ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సుల్తానాబాద్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్‌ను వెనుక నుంచి వచ్చిన ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అయ్యప్ప కూడలిలోని సిగ్నల్స్‌ దాటిన కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది.

ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం భారీ వాహనాల అతి వేగం వల్ల జరుగుతున్నవే. పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన కూడలిలోనే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం చోదకుల నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తోంది. వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే రాజీవ్‌ రహదారిపై ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలేవీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, గోదావరిఖని పట్టణ ప్రాంతాల్లో ప్రమాదాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి.

ప్రతిరోజూ ప్రమాదమే!

జిల్లాలో సుల్తానాబాద్‌ మండలం దుబ్బపల్లి నుంచి గోదావరిఖనిలోని గోదావరి నది వరకు ఉన్న రాజీవ్‌ రహదారిపై నిత్యం ఏదో చోట ప్రమాదం జరుగుతోంది. రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించినా ప్రమాదాలు పెరగడమే గాని తగ్గలేదు. వేగ నియంత్రణపై పోలీసులు ఏర్పాటు చేసిన స్పీడ్‌గన్‌ ప్రభావం శివారు ప్రాంతాలకే పరిమితం కావడంతో పట్టణాల్లో ప్రమాదాలు పరిపాటిగా మారాయి. సుల్తానాబాద్‌, పెద్దపల్లి, బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. రామగుండం ప్రాంతంలో రాజీవ్‌ రహదారికి సర్వీసు రోడ్డు ఉండటంతో ప్రమాదాల తీవ్రత తక్కువగా ఉంది.

స్థిరాస్తి ప్రచారం

పెద్దపల్లిలో రాజీవ్‌ రహదారికి బైపాస్‌ రోడ్డు నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం, నిధుల కొరతతో గ్రామాల అనుసంధాన రహదారులను బైపాస్‌ రోడ్లుగా స్థిరాస్తి ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దకల్వల కేంద్రంగా స్థిరాస్తి లావాదేవీలు నడిపేవారు పెద్దకల్వల నుంచి నిమ్మనపల్లి, నిట్టూరు, తుర్కలమద్దికుంట, చందపల్లి మీదుగా అప్పన్నపేట వరకు ఒక రోడ్డు, పెద్దకల్వల డిగ్రీ కళాశాల నుంచి పెద్దబొంకూరు, చీకురాయి, హన్మంతునిపేట, గౌరెడ్డిపేట, రాఘవపూర్‌, మంథని రైల్వే వంతెన వరకు మరో రోడ్డును బైపాస్‌లుగా ప్రచారం చేసుకుంటున్నారు. కాగా ఈ రహదారులన్నీ గ్రామీణ ప్రాంతాల నుంచే ఉరడటంతో స్థానికుల్లో మరింత భయాందోళన వ్యక్తమవుతోంది.


నిధులు వెనక్కి.. ప్రతిపాదనలు అటకెక్కి


ఎప్పుడూ రద్దీగా ఉండే పెద్దపల్లి కమాన్‌ కూడలి

* రాజీవ్‌ రహదారి నిర్మాణ సమయంలో రాష్ట్రంలో ఎక్కడా బైపాస్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వలేదు. అనంతరం రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నాలుగు బైపాస్‌లకు అనుమతించింది. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కుకునూరుపల్లి, ప్రజ్ఞాపూర్‌ల వద్ద ప్రత్యామ్నాయ రహదారులు నిర్మించేందుకు సర్వే చేయించారు.

* వీటిలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. పెద్దపల్లి మండలం చందపల్లి, రంగంపల్లి, పెద్దకల్వల వద్ద భూసేకరణ కోసం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం వెలువరించింది. అయితే గ్రామసభలు పెట్టే సమయంలోనే రాష్ట్ర విభజన జరగడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది.

* పెద్దపల్లిలో భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 కోట్లు కూడా వెనక్కిమళ్లాయి. ఈ నిధులను తిరిగి తీసుకురావడానికి ఇప్పటివరకు పాలకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

* పెద్దపల్లి మండలం పెద్దకల్వల నుంచి బొంపల్లి రోడ్డులోని మినీహైడల్‌ మీదుగా అప్పన్నపేట వరకు 9 కిలోమీటర్ల బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. సుల్తానాబాద్‌లో శాస్త్రీనగర్‌ నుంచి పూసాల, కట్టకిందిపల్లె గ్రామాల అవతలి వైపు నుంచి బైపాస్‌ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. ఈ రెండు బైపాస్‌ల నిర్మాణం ప్రక్రియ నిలిచిపోవడంతో రెండు పట్టణాల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది.


* పక్షం రోజుల కిందట పెద్దపల్లి రిలయన్స్‌ పెట్రోలు బంకు వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ వేగంగా ఢీకొట్టడంతో ముందు లారీ ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ను గుద్దుకుంది. ఈ ప్రమాదంలో ఇసుక లారీ రోడ్డు పక్కన నిలుచున్న యువకుడిని టైర్లతో తొక్కేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలాంటి ప్రమాదమే గత సెప్టెంబరులో సుల్తానాబాద్‌ అంబేడ్కర్‌కూడలి వద్ద చోటుచేసుకుంది. ఆయిల్‌ ట్యాంకరును ఇసుక లారీ ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ట్యాంకర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని