logo
Published : 02/12/2021 03:38 IST

నిధులు రావు... మరమ్మతులకు నోచుకోవు

అధ్వాన రహదారులతో అవస్థలు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల


ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ వద్ద తెగిన కాజ్‌వేపై మట్టితో చదును చేసిన దృశ్యం

జిల్లాలో రెండేళ్లుగా రహదారుల నిర్వహణ లేదు. నిధుల కోసం ఇంజినీరింగ్‌ అధికారులు చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వరుసగా రెండేళ్లు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వరదలకు రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. పూర్తిగా తెగిన రహదారులను కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తాత్కాలికంగా మట్టితో చదును చేసి రాకపోకలు సాగిస్తున్నారు. పంచాయతీరాజ్‌ పరిధిలో తాత్కాలిక మరమ్మతులకు వెసులుబాటు ఉంది. రహదారులు, భవనాలశాఖ పరిధిలో ప్రతి పనిని టెండరు ద్వారానే చేపట్టాలి. రెండు శాఖల పరిధిలో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన పనులకు ప్రతిపాదనలు పంపి నాలుగు నెలలు గడుస్తున్నా నిధుల మంజూరుకు నోచుకోలేదు.

జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు ఛిద్రమయ్యాయి. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని రెండు డివిజన్ల పరిధిలో 28 రహదారులు, 14 కాజ్‌వేలు దెబ్బతిన్నాయి. రహదారులపై తారు చెదిరిపోయి గుంతలు ఏర్పడ్డాయి. వరద తాకిడికి కాజ్‌వేలపై సిమెంటు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారాయి. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతో కొన్ని చోట్ల మట్టితో తాత్కాలిక మరమ్మతులు చేసి సరిపెట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌, పదిర, తిమ్మాపూర్‌, బాకురుపల్లితండాల పరిధిలో రహదారులు ధ్వంసం కావడంతో రాత్రిపూట సమీప గ్రామాల నుంచి తిరిగి వెళ్తున్నారు. కోనరావుపేట మండలంలో సుద్దాల, నిమ్మపల్లి, కనగర్తి, నిజామాబాద్‌, వెంకట్రావ్‌పేట, కొండాపూర్‌ వెళ్లే రహదారి కోతకు గురైంది. దీంతో నిత్యం వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. వీర్నపల్లి అటవీ ప్రాంతంలో కల్వర్టులు, రహదారులు కోతకు గురయ్యాయి. మద్దిమల్లతండాకు రెండు వైపులా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోయినపల్లిలో కొదురుపాక, విలాసాగర్‌ మధ్య కాజ్‌వే సీసీ ధ్వంసమైంది. దుండ్రపల్లి, దేశాయిపల్లి, అచ్చన్నపల్లిలో రహదారులు కోతకు గురయ్యాయి. వీటికి రూ.1.36 కోట్లతో తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాలేదు. దీంతో ఇటీవల శాశ్వత మరమ్మతులకు రూ.14 కోట్ల అంచనాలతో మళ్లీ పంపించారు.


వీర్నపల్లి మండలం గుంటపెల్లిచెరువు తండా వద్ద రహదారి దుస్థితి

ప్రతిపాదనలు ఆమోదించే దశలో ఉన్నాయి : - కిషన్‌, ఈఈ, రహదారులు భవనాలశాఖ

జిల్లాలో దెబ్బతిన్న రహదారుల నిర్వహణకు తాత్కాలిక, శాశ్వతంగా పనులు చేపట్టేందుకు రెండు రకాల ప్రతిపాదనలు పంపాం. ఉన్నతాధికారుల వద్ద ఆమోదించే దశలో ఉన్నాయి. లింగన్నపేట వద్ద వంతెన నిర్మాణానికి రూ.17 కోట్లు, ఇల్లంతకుంట మండలంలో గాలిపల్లి, జవారిపేట, నర్సక్కపేట రహదారిలో వంతెనల నిర్మాణాలకు రూ.14 కోట్లు, కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లో ఆరు వంతెనల ఏర్పాటుకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.


23 ప్రాంతాలు... రూ.8 కోట్ల నిధులు

రహదారులు, భవనాలశాఖ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ డివిజన్లలో 23 ప్రాంతాల్లో రహదారులు, కాజ్‌వేలు దెబ్బతిన్నాయి. వీటిలో సిరిసిల్ల డివిజన్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. సిద్దిపేట-కామారెడ్డి మార్గంలో లింగన్నపేట కాజ్‌వే శిథిలావస్థకు చేరుకుంది. సిరిసిల్ల-కామారెడ్డి రహదారిలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ శివారు మూలమలుపు వద్ద వరద తాకిడికి రహదారి పక్కన గోతులు ఏర్పడ్డాయి. ముస్తాబాద్‌ మండలం అవునూరు-పదిర గ్రామాల మధ్య మానేరువాగుపై ఉన్న కాజ్‌వే వరదలకు శిథిలమైంది. వేములవాడ-సిరికొండ, మరిమడ్ల-నిజామాబాద్‌, వట్టిమల్ల, వేములవాడ-నిమ్మపల్లి రహదారులు తారు లేచిపోయాయి. ఎల్లారెడ్డిపేట-వీర్నపల్లి మార్గంలో అల్మాస్‌పూర్‌, గుంటపల్లి చెరువుతండా తదితర ప్రాంతాల్లో రహదారి కోతకు గురైంది. రాత్రి సమయంలో ఎదురెదురుగా వాహనాలు వచ్చి అదుపు తప్పితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కనీసం హెచ్చరిక సూచికలు కూడా ఏర్పాటు చేయలేదు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని