logo
Published : 03/12/2021 02:38 IST

నిషేధిత జాబితా.. నిశితంగా వడబోత

 సర్వే నెంబర్ల వారీగా పరిశీలిస్తున్న అధికారులు

పెద్దపల్లి తహసీల్‌ కార్యాలయంలో పరిశీలిస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టంలో పలు ఐచ్ఛికాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్రమంగా వాటికి అనుమతి లభిస్తున్నా పట్టా హక్కుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
భూదస్త్రాల సమయంలో చోటుచేసుకున్న పొరపాట్లను సరిదిద్దే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. భూసేకరణ కింద తీసుకున్న, వివాదాస్పద, ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో పొందుపరుస్తున్నారు. గతంలో అధికారుల చేసిన తప్పిదాలతో వివాదాలు లేనివి కూడా ఈ జాబితాలో ఉండటంతో పట్టా హక్కులు, క్రయవిక్రయాలు సాగడం లేదు. దీంతో బాధితులు ధరణి ఫిర్యాదు విభాగంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ క్రమంలో నిషేధిత జాబితాలో నమోదై ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్యక్ష్రేతంలో దిగిన అధికారులు గ్రామాల వారీగా పరిశీలన జరుపుతున్నారు.

భూ సమస్యలపై ఫిర్యాదుకు ప్రజావాణిలో బాధితుల వరుస

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
వాస్తవంగా పాజెక్టులు, ప్రజా అవసరాల కోసం సేకరించిన భూములు, వివాదాస్పద, ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండాలి. అయితే కొత్తగా పాసుపుస్తకం పొందిన సర్వే నెంబర్లు కూడా ఈ జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. కుటుంబ అవసరాల కోసం విక్రయిద్దామని స్లాట్‌ బుకింగ్‌ కోసం వెళ్తే నిషేధిత జాబితాలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సవరించాలంటూ బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక రైతుకు చెందిన రెండు ఎకరాల భూమిలో అర ఎకరం భూ సేకరణ కింద కోల్పోయాడు. మిగిలిన ఎకరంన్నర భూమి కూడా ధరణిలో కనిపించడం లేదు. తనకున్న పూర్తి విస్తీర్ణం నిషేధిత జాబితాలో కనిపించడంతో ఆందోళన చెందుతున్నాడు.
ఉపసంఘం నివేదికపైనే ఆశలు
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన ఉపసంఘం నివేదికపై ఆశలున్నాయి. ఇప్పటివరకు రాని ఐచ్ఛికాలపై కసరత్తు చేస్తున్నారు. అన్ని సమస్యలకూ అనుమతి ఇచ్చేలా నివేదిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు భూ సంబంధమైన సమస్యలకు పరిష్కారం దొరక్క, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతి జిల్లాలోని కలెక్టరేట్‌లో ధరణి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉపసంఘం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భూ సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ధరణి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరగనుంది.
పరిశీలిస్తూ.. తొలగిస్తూ..
రాష్ట్రవ్యాప్తంగా భూముల నిషేధిత జాబితాపై ధరణి ఫిర్యాదుల విభాగంలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. అన్ని సమస్యల కంటే ఇవే ఎక్కువగా ఉండటంతో పరిష్కారానికి ఎట్టకేలకు ప్రభుత్వం ఉపక్రమించింది.
* భూదస్త్రాల ఆధారంగా సర్వే నెంబర్ల వారీగా నిషేధిత జాబితా పరిశీనలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతి సర్వే నెంబరు వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయం తెలుసుకోవాలని ఆదేశించారు.
* మండలాల వారీగా జాబితాను పంపించారు. జిల్లాలోని 202 రెవెన్యూ గ్రామాల్లో 12,540 సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు సీసీఎల్‌ఏ నుంచి వివరాలు వచ్చాయి.
* ప్రతి సర్వే నెంబరులోని భూమి పట్టానా? ప్రభుత్వ భూమినా? ఏదైనా కోర్టు వివాదంలో ఉందా? గతంలో ఇనామ్‌ పేరిట ఎవరికైనా పత్రాలు పంపిణీ చేశారా? అనే కోణంలో సిబ్బంది ఆరా తీస్తున్నారు. అన్ని అంశాలూ పరిశీలించి ఈ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇప్పటివరకు 146 గ్రామాల్లో పరిశీలన పూర్తయింది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని