logo
Published : 03/12/2021 02:38 IST

చీలిక ఓట్లు.. అభ్యర్థుల పాట్లు

 ప్రయత్నాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు

అందరిదీ గెలుపు ధీమా

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

గడువు సమీపిస్తున్న కొద్దీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. బరిలో ఉన్న 10 మంది అభ్యర్థులు తమ పట్టును నిలుపుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే అధికార తెరాస తరపున పోటీలో నిలిచిన ఇద్దరభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న ప్రజాప్రతినిధులతో శిబిర రాజకీయాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.! ఇదే సమయంలో మిగతా స్వతంత్రులుగా ఉన్న 8 మందిలో కొందరు తమ ప్రయత్నాల్లో దూకుడును చూపుతున్నారు. కాంగ్రెస్‌, భాజపా తరపున గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతును ఇళ్ల వద్దకు వెళ్లి కూడగట్టే విషయంలో ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. మరోవైపు శిబిరంలో ఉన్న ఓట్లకు గాలం వేసేలా బయట ఉన్న అభ్యర్థులు తమవంతు ప్రయత్నాల్ని నెరపుతున్నారు. వారి సమీప బంధుగణం సహా మిత్రుల ద్వారా కనీసం ఒక్క ఓటునైనా వెయ్యమనేలా రాయభారాల్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. శిబిరంలో ఉన్న వారిలో కచ్చితంగా విజయానికి అవసరమైన ఓట్లు తమకు పడుతాయనే విశ్వాసాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నారు.
పట్టుసడలకుండా తెరాస..
తమకున్న ఓటర్ల బలమే ఆధారంగా తెరాస పార్టీ తమ ఇద్దరు అభ్యర్థుల గెలుపు ఖాయమనే విశ్వాసంతో ఉంది. ఇందులో భాగంగానే ముందస్తు జాగ్రత్త చర్యలతో దాదాపుగా వెయ్యి మంది ప్రజాప్రతినిధులను వేర్వేరు చోట్ల క్యాంపు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులతోపాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముఖ్యనేతలంతా వీరితోనే ఉంటున్నారు.   బ్యాలెట్‌ పత్రంలో ఓటు వేసే విధానంపై కసరత్తు చేయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మొదటి. రెండో ప్రాధాన్య ఓట్లు వేసే విషయమై  సూచనల్ని పార్టీ ముఖ్యులు అందిస్తున్నట్లు తెలిసింది. శిబిరంలో ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా స్వతంత్రులకు పడకుండా.. ఓట్లు చీలిపోకుండా తగు జాగ్రత్త్తల్ని తీసుకుంటున్నారు. సగం మంది చొప్పున విడదీసి ఇద్దరు అభ్యర్థులకు ఒకటో ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు ఎలా వేయాలనే విషయమై  ఆదేశాల్ని తెలుపుతున్నట్లు సమాచారం.
మూడో వంతు ఓట్లొస్తే విజేత..!
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటే బ్యాలెట్‌పై ఈ ఎన్నిక జరుగుతుండటంతో ఓట్ల పరంగా మొదటి రెండో స్థానాల్లో ఎక్కువ ఓట్లను ఎవరైతే సాధిస్తారో వారే విజేతగా నిలిచే అవకాశం ఉంది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 1326 ఓట్లున్నాయి. ఇందులో మృతి చెందిన ఇద్దరు ఓట్లు తొలగించగా.. మిగతా 1324మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. వాస్తవానికి ఒక అభ్యర్థి గెలువాలంటే మొత్తం ఓట్లలో సగానికిపైగా ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన విజేతగా నిలుస్తారు. కానీ ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండటంతో మొత్తం ఓట్లలో మూడో వంతు ఓట్లను దాటేలా విజేతకు ఓట్ల మద్దతు అవసరమవుతుంది. ఈలెక్కన 443 ఓట్లు ఎవరికి వస్తాయో వారే విజేతగా నిలుస్తారు. ఇలా మొదటి ప్రాధాన్య ఓట్లు ఇద్దరు అభ్యర్థులకు ఈ సంఖ్యను దాటినా.. ఇద్దరు విజేతలుగా నిలుస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్య ఓట్లలో నిర్ణీత సంఖ్యలో ఓట్లు రాకుంటే రెండో ప్రాధాన్య ఓట్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అందుకనే మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలుపు పీఠాన్ని అందుకోవాలని అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని