logo
Published : 03/12/2021 02:38 IST

అయిదేళ్లుగా అదే అలసత్వం

నిలిచిన బైపాస్‌ రోడ్డు పనులు
న్యూస్‌టుడే, సిరిసిల్ల పట్టణం

అపరెల్‌ పార్కు నుంచి చిన్న బోనాల వరకు ఆగిన పనులు

జిల్లా కేంద్రంలో రగుడు నుంచి వెంకటాపూర్‌ వరకు రెండో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పట్టణంలో ట్రాఫిక్‌ పెరిగిపోవడంతో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా దీని నిర్మాణానికి రూ.95 కోట్లు కేటాయించారు. బీటీ రోడ్డుతో పాటు వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సుమారు అయిదేళ్లు గడిచినా పనులు పూర్తికాలేదు. గతంలోనే మంత్రి కేటీఆర్‌ పనుల్లో జరుగుతున్న జాప్యంపై అధికారులను హెచ్చరించారు. అయినా చలనం లేదు. ఆరు నెలలుగా ఈ పనులు నిలిచిపోయినా పట్టించుకున్న నాథుడు లేడు.

గడ్డకట్టిన సిమెంటు బస్తాలు

సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి నుంచి కరీంనగర్‌కు వాహనదారులు ఈ మార్గంలో వెళతారు. దీంతో పట్టణంలోకి భారీ వాహనాలు రావు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదని భావిస్తున్నారు. సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటకు వెళ్లే ద్విచక్రవాహనదారులు కూడా బైపాస్‌రోడ్డు నుంచి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వంద అడుగుల వెడల్పుతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రగుడు నుంచి వెంకటాపూర్‌ వరకు డివైడర్‌తో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో బైపాస్‌ రోడ్డు పూర్తయితే కరీంనగర్‌-కామారెడ్డికి వెళ్లే వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి.
భూసేకరణకు నిధులు వెచ్చింపు...
జిల్లా కేంద్రాన్ని ఆనుకుని చుట్టూ ఉన్న గ్రామాలకు రెండో బైపాస్‌రోడ్డు సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో రగుడు నుంచి చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూర్‌ గ్రామాలను ఆనుకొని జగ్గరావుపల్లి, సర్దాపూర్‌, వెంకటాపూర్‌ వరకు 11 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.65 కోట్లను కేటాయించారు. అయిదేళ్ల క్రితం ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఇందులో రూ.30 కోట్ల వరకు ఖర్చు చేశారు. అలాగే మరో రూ.30 కోట్లు భూసేకరణకు కేటాయించారు. భూసేకరణలో 90 శాతం మందికి పరిహారం చెల్లించారు. 11 కిలోమీటర్ల రోడ్డు కోసం 82.08 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో భూసేకరణ సులభమైంది.
  ఆరు నెలలుగా...
రెండో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు వంతెనలు పూర్తి చేశారు. మరో 5 వంతెనలు నిర్మాణంలో ఆగిపోయాయి. సుమారు బోనాల వద్ద 3 కిలోమీటర్లు, అపరెల్‌పార్క్‌ నుంచి వెంకటాపూర్‌ వరకు కిలోమీటరు బీటీ రోడ్డును పూర్తి చేశారు. సుమారు 8 కిలోమీటర్ల మేర డివైడర్‌ను ఏర్పాటు చేశారు. 2 కిలోమీటర్ల వరకు సైడ్‌వాల్‌ నిర్మించారు. ప్రస్తుతం బైపాస్‌ రోడ్డు పనులు ఆరు నెలలుగా నిలిచిపోయాయి.

విస్తరిస్తున్న పరిశ్రమలు
రెండో బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేస్తుండటంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా విస్తరిస్తుంది.  దీనివల్ల సిరిసిల్ల పట్టణం మరింత విస్తరించి అభివృద్ధి చెందనున్నది. బోనాల, పెద్దూర్‌ శివారులోని 1500 ఎకరాల ప్రభుత్వ భూమికి రోడ్డు సౌకర్యం కలగనుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు పూర్తిస్థాయిలో స్థాపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అపరెల్‌పార్క్‌, పోలీస్‌బెటాలియన్‌ నిర్మాణం 80 శాతం పూర్తి చేశారు. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డు, రెండు పడక గదుల ఇళ్లు ఈ ప్రాంతంలోనే నిర్మించారు. మరిన్ని ప్రభుత్వ సంస్థలకు ఇక్కడే భూములు కేటాయిస్తున్నారు. బైపాస్‌ రోడ్డు పూర్తయితే ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి, కోనరావుపేట మండలం కొలనూర్‌, మర్తనపేట గ్రామాల నుంచి సిరిసిల్లకు వెళ్లడానికి దూరం తగ్గుతుంది. వెంకటాపూర్‌ నుంచి అగ్రహారం, ముస్తాబాద్‌ మండలం తుర్కాపల్లి, తంగళ్లపల్లి మండలం గడ్డిలచ్చపేట, కస్బెకట్కూర్‌, రాళ్లపేట, మండేపల్లి మీదుగా తంగళ్లపల్లి, మరోవైపు ముస్తాబాద్‌ మీదుగా సిద్దిపేటకు రోడ్డు మార్గం ఏర్పడుతుంది. కామారెడ్డి-కరీంనగర్‌ మధ్య నేరుగా రవాణా సౌకర్యాలు దగ్గరవుతాయి. తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్న ఆలయానికి సిరిసిల్లకు రాకుండానే నేరుగా వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.
పనులు నడుస్తున్నాయి
- కిషన్‌రావు, ఈఈ ఆర్‌అండ్‌బీ, సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణంలోని రగుడు నుంచి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ వరకు 11 కిలోమీటర్ల బైపాస్‌ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో వంతెనల నిర్మాణంతో పాటు వంద అడుగుల వెడల్పుతో రహదారి తయారవుతుంది. నాణ్యతతో కూడిన పనులు చేపడుతున్నాం. వంతెనల నిర్మాణం 50 శాతం పూర్తయింది. బీటీ రోడ్డు నిర్మాణం 50 శాతం పైగా పూర్తయింది. పనులపై ప్రజలు ఎలాంటి అపోహలు పడవద్దు. మంత్రి కేటీఆర్‌ బైపాస్‌రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. పనులు వేగవంతం చేయాలని గుత్తేదారులను ఆదేశించడం జరిగింది


 

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని