logo

తెరచుకోని వంట గదులు

ప్రభుత్వ బడుల్లో చదువుతోపాటు పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలన్నదే సర్కారు లక్ష్యం. కరోనా తర్వాత సెప్టెంబర్‌ నుంచి బడులు పునఃప్రారంభించారు. మధ్యాహ్నం భోజనం పెట్టె వంట నిర్వాహకులు నెలల తరబడి బిల్లులు, వేతనాలు

Published : 07 Dec 2021 06:25 IST


ముస్తాబాద్‌ ప్రాథమిక పాఠశాల వంటగదికి తాళం పొగచూరని పొయ్యి దృశ్యం

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ బడుల్లో చదువుతోపాటు పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలన్నదే సర్కారు లక్ష్యం. కరోనా తర్వాత సెప్టెంబర్‌ నుంచి బడులు పునఃప్రారంభించారు. మధ్యాహ్నం భోజనం పెట్టె వంట నిర్వాహకులు నెలల తరబడి బిల్లులు, వేతనాలు రావడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ వండుతున్నామన్నారు. నెలల తరబడి వంట బిల్లులు, వేతనాలు రాక మేం ఎలా వంటలు చేస్తామంటూ ఇక మా వల్ల కాదంటూ వంటలు మాని సమ్మెకు దిగారు. పాఠశాల వంట గదులకు తాళం వేశారు. పొయ్యిలు పొగ చూరడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేక ఇళ్ల నుంచి మధ్యాహ్న భోజనం బాక్సులు తెచ్చుకొని తింటున్నారు. పనికి తగ్గ పారితోషికం, ప్రభుత్వమే కోడిగుడ్లు, కూరగాయలు, గ్యాస్‌ సరఫరా చేయాలంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వంటలు చేయబోమని వంటలు మానివేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిపి వేసిన వైనంపై ప్రత్యేక కథనం.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు-339, ప్రాథమికోన్నత-37, జడ్పీ పాఠశాలలు-1,11, ప్రభుత్వ పాఠశాలలు 02 ఉన్నాయి. మొత్తం కలిపి 489 పాఠశాలు ఉండగా 45,910 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 810 మంది మధ్యాహ్న భోజన వంట నిర్వాహకురాళ్లు పనిచేస్తున్నారు. ముస్తాబాద్‌ మండలంలో ప్రాథమిక-30, ప్రాథమికోన్నత-04, జడ్పీ పాఠశాలలు-10, ఆదర్శ పాఠశాల-1 ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 3,750 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో కలిపి 75 మంది వంట నిర్వాహకురాళ్లు మధ్యాహ్న భోజనం వంటలు చేస్తున్నారు. వంట నిర్వాహకులకు సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌ వంట బిల్లులు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ వేతనాలు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం ఒక్కో కోడిగుడ్డుకు రూ.4 మాత్రమే చెల్లిస్తుంది. రూ.5 నుంచి 6 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. అలాగే ప్రాథమిక పాఠశాల ఒక్కో విద్యార్థికి రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఒక్కో విద్యార్థికి రూ. 7.45 మాత్రమే చెల్లిస్తుంది. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నిర్వాహకులకు నెలకు రూ.1,000 మాత్రమే. అరకొర వేతనంతో పనిచేస్తున్నామంటూ వంట నిర్వాహకులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటలు నిలిపి వేశారు. దీంతో కొంత ఇబ్బందులకు గురవుతున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా వంట నిర్వాహకుల సమస్యలను పరిష్కరించి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటలు తిరిగి ప్రారంభించేలా సంబంధిత అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


మధ్యాహ్న భోజనం లేకుంటే ఇబ్బందే

-ఎస్‌కే సిమ్రాన్‌, 10వ తరగతి గూడూరు

మాది గూడూరు గ్రామం. నేను ముస్తాబాద్‌ జడ్పీ సక్సెస్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం నుంచి నిత్యం పాఠశాలకు బస్సులో వస్తుంటాను ఉదయం 8 గంటల వరకు బస్టాండ్‌కు రావాలి. లేదంటే బస్సు వెళ్లిపోతుంది. మా ఇంటి నుంచి మధ్యాహ్న భోజనం బాక్సు తీసుకురావాలంటే ఇంటి పనులతో ఆలస్యమవుతుంది. అసలే నేను 10 తరగతి. నాలాంటి విద్యార్థులు ఎంతోమంది ఇతర గ్రామాల నుంచి పాఠశాలకు వస్తుంటారు. వంట నిర్వాహకుల సమ్మె ఇలాగే రోజుల తరబడి కొనసాగితే అటు బస్సు, ఇటు తరగతులను కోల్పోవాల్సి వస్తుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం లేకుంటే సాయంత్ర వరకు పస్తులుండాల్సిందే.


సమస్యలు పరిష్కరించేంత వరకు వంటలు చేయం

-గొట్టె సంతోష, వంట నిర్వహకురాళ్ల జిల్లా ప్రధాన కార్యదర్శి

పనికి తగ్గ పారితోషికం అందించాలి, ప్రభుత్వమే అంగన్‌వాడీ తరహాలో కోడిగుడ్లు వంట సరకులు, గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేయాలి. వంట పాత్రలు అందించాలి. పనికి భద్రత కల్పించాలి, ఉపాధ్యాయుల వేధింపులు, రాజకీయ వేధింపులు ఉండరాదు. మా సమస్యలు పరిష్కరిస్తేనే తిరిగి వంటలను ప్రారంభిస్తాం.


వేతనాల బిల్లులు ట్రెజరీలో సమర్పించాం 

-బన్నాజి ఇన్‌ఛార్జి ఎంఈవో

మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు సంబంధించిన బడ్జెట్‌ విడుదలైంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌ మెస్‌ బిల్లులు, 1వ నుంచి 8వ తరగతి వరకు సెప్టెంబర్‌, అక్టోబర్‌ వంట నిర్వాహకుల వేతనాలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీలో సమర్పించాం. ట్రెజరీ నుంచి వంట నిర్వాహకుల వారీగా వారి వారి ఖాతాల్లో డబ్బులు చేరతాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వంటలు తిరిగి ప్రారంభించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని