logo

యువ స్ఫూర్తి... సేవా దీప్తి

యువతరం తలచుకుంటే సాధించలేనిదేమీ లేదని నిరూపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్వగ్రామంలో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. తమ కాళ్లపై తాము 

Published : 09 Dec 2021 05:24 IST

క్రీడా విజ్ఞాన కళా వేదిక పేరిట సేవా, చైతన్య కార్యక్రమాలు

న్యూస్‌టుడే, రుద్రంగి

నర్సింగాపూర్‌లో తాత్కాలిక గ్రంథాలయం ప్రారంభ కార్యక్రమంలో  వేదిక సభ్యులు

యువతరం తలచుకుంటే సాధించలేనిదేమీ లేదని నిరూపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్వగ్రామంలో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. తమ కాళ్లపై తాము నిలబడుతూ ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. వారే చందుర్తి మండలం నర్సింగాపూర్‌ యువత. పుట్టిన ఊరిలో గ్రామ అభివృద్ధి, నిరుపేదలకు సేవా కార్యక్రమాలను అందించాలనే ఆలోచనతో ‘క్రీడా విజ్ఞాన కళా వేదిక’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా యువకులు సమష్టిగా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.

తాత్కాలిక గ్రంథాలయం ఏర్పాటు

గ్రామంలోని యువత విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా చదివి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు తాత్కాలిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సివిల్స్‌తోపాటు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల పోటీ పుస్తకాలను అందుబాటులోకి ఉంచారు. ఇప్పటికే పలు రకాల ఉద్యోగాలు సాధించిన వారితో నిరుద్యోగ యువకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామ యువకులు పలు పోటీ పరీక్షల కోసం ఇక్కడే సిద్ధమవుతున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం దాతలు, ప్రజాప్రతినిధుల సహకారంతో రూ.4.50 లక్షల విరాళాలు సేకరించి పనులు ప్రారంభించారు.

* క్రీడల్లో గ్రామీణ విద్యార్థి, యువకులు రాణించాలనే లక్ష్యంతో గ్రామంలో మైదానాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో కూడా క్రీడలకు ఆటంకం కలగకుండా హైమాస్ట్‌ విద్యుత్తు దీపాలను అమర్చారు.

*  పోలీస్‌, ఆర్మీ వంటి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారి కోసం మైదానంలో రన్నింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. మినీ జిమ్‌ పెట్టారు.

* వివిధ పండగలు, ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని విద్యార్థులు, మహిళలు, యువకులకు ప్రత్యేకంగా వివిధ రకాలైన క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వారిలో సమష్టితత్వం ఏర్పడుతుందని సంస్థ సభ్యులు ఆశిస్తున్నారు.

* ప్రభుత్వ పాఠశాలలతో పాటు గ్రామంలో అనేక మార్లు శ్రమదాన కార్యక్రమాలను నిర్వహించి గ్రామంలో పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

* కరోనా బారిన పడ్డ సుమారు 50 మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

* పంచాయతీలో పని చేసే రవికి బ్లాక్‌ఫంగస్‌ సోకి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో రూ. 6.15 లక్షలను సమీకరించి కుటుంబ సభ్యులకు అందించి ఆసరాగా నిలిచారు.

* గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానిస్తూ నిరుద్యోగ యువతలో తాము కూడా ఏదైనా సాధించాలనే స్ఫూర్తిని నింపుతున్నారు.

* ఈ సంస్థ సేవా కార్యక్రమాలను గుర్తించి ఆహా, జనహితం, ప్రణవి ఫౌండేషన్లు, లంబోదర అకాడమీ వంటి సంస్థలు రాష్ట్ర స్థాయి అవార్డులను అందజేశాయి.


బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న యువకులు

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం - పూడూరి అజయ్‌రెడ్డి, క్రీడా విజ్ఞాన కళా వేదిక సభ్యుడు

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పల్లెల్లో గుణాత్మక మార్పు అవసరమని క్రీడా విజ్ఞాన కళా వేదిక గుర్తించింది. గ్రామంలోని యువత సన్మార్గంలో నడిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే అవకాశం ఉంది. అందుకే యువకులు తప్పు దారి పట్టకుండా, సమయాన్ని వృథా చేయకుండా ఉన్నత లక్ష్యాల సాధన వైపు వారిని మళ్లించటానికి స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం.

సమష్టి కృషితో ముందుకు సాగుతున్నాం - పెరుక రణధీర్‌, క్రీడా విజ్ఞాన కళా వేదిక

గ్రామంలోని యువకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. యువత సామాజిక మాధ్యమాలతో నష్టపోకుండా వారిని గ్రంథాలయం, క్రీడా మైదానాల వైపు మళ్లిస్తున్నాం. గ్రామాన్ని ఆదర్శవంతంగా నిలపాలన్నదే ఈ సంస్థ ప్రధాన ధ్యేయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని