logo

అరకొర వసతులు... అందుబాటులోకి రాని భవనాలు

జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటైన కళాశాల అది. విశాలమైన స్థలం, చక్కని వాతావరణంలో వసతులు సమకూర్చేందుకు భారీ అంచనాలతో మూడేళ్ల కిందటే ఆరంభమైనా నేటికీ పూర్తిస్థాయిలో వసతులు

Published : 09 Dec 2021 05:24 IST

వ్యవసాయ కళాశాల విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

నిర్మాణంలో ఉన్న పరిపాలన విభాగం భవనం

జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటైన కళాశాల అది. విశాలమైన స్థలం, చక్కని వాతావరణంలో వసతులు సమకూర్చేందుకు భారీ అంచనాలతో మూడేళ్ల కిందటే ఆరంభమైనా నేటికీ పూర్తిస్థాయిలో వసతులు సమకూరలేదు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో 2018లో జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరైంది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.36 కోట్లతో శాశ్వత వసతికి నిధులు కేటాయించారు. భవనాలు అందుబాటులోకి రాక అరకొర వసతుల నడుమ విద్యాభ్యాసం కొనసాగుతోంది.

కళాశాల మంజూరు తర్వాత స్థానికంగా వసతులు లేకపోవడంతో సర్దాపూర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల భవనాల్లో వసతి, తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కళాశాల రావడంతో ఇక్కడి పాలిటెక్నినిక్‌ కళాశాల అడ్మిషన్లు రద్దు చేశారు. ఇందులోని బోధన, బోధనేతర సిబ్బందిని కళాశాలకు వాడుతున్నారు. 60 మంది విద్యార్థులుండే వసతిలో ప్రస్తుతం 210 మందిని సర్దుబాటు చేశారు. కరోనాతో దాదాపు రెండేళ్లు ఆన్‌లైన్‌ తరగతులు జరగడంతో ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బందేమీ రాలేదు. ప్రస్తుతం కళాశాలకు మూడు సంవత్సరాల విద్యార్థులు హాజరవుతుండటంతో వసతి, తరగతి గదుల సమస్య తలెత్తుతోంది. ఈ ఏడాది మెడికల్‌, నీట్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యమైంది. ఈ నెలాఖరులోగా వ్యవసాయ ప్రవేశాలు పూర్తవుతాయి. కొత్తగా వచ్చే విద్యార్థులతో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కళాశాలలో ప్రిన్సిపల్‌, 11 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లున్నారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పదోన్నతుల్లో బోధన, బోధనేతర సిబ్బంది 15 మందిని జిల్లా కళాశాలకు కేటాయించారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక వీరు ఇక్కడ విధుల్లో చేరనున్నారు.

జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాల ప్రవేశ ద్వారం

రెండేళ్లుగా నిర్మాణాలు...

రెండేళ్లుగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల్లో 16 ఎకరాలు వసతులకు, మిగతావి పాలిహౌజ్‌లు, పంటలకు అనుకూలంగా మార్చనున్నారు. మొదటి విడతగా నాలుగు సంవత్సరాలకు సరిపడా అకాడమిక్‌ బ్లాకులు, ల్యాబ్‌లు, వసతి గృహాలను నిర్మించారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్‌, సెమినార్‌, ఆడిటోరియం, అంతర్గత రహదారుల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం నాలుగేళ్లకు అకాడమిక్‌, వసతి గృహాలు, ల్యాబ్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ నిర్మాణ దశలో ఉంది. త్రీఫేజ్‌ విద్యుత్తు లైను అందుబాటులో లేదు. కళాశాలకు ప్రత్యేకంగా విద్యుత్తు లైను అమర్చేందుకు సెస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలలో వసతి, తరగతి గదులు, ల్యాబ్‌లు సరిపోవడం లేదు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు సమకూరేందుకు ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలో తెలియని పరిస్థితి నెలకొంది.


ఈ నెలాఖరులో నూతన భవనంలోకి మారుతాం

- ఉమామహేశ్వరి, ప్రిన్సిపల్‌, వ్యవసాయ కళాశాల

నూతన కళాశాల భవనంలో వసతి గృహాలు, తరగతి గదులకు సంబంధించిన ఒక్కో బ్లాకు నిర్మాణం పూర్తయింది. విద్యుత్తు సరఫరాకు నియంత్రిక అమర్చాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా నూతన భవనంలోకి మారుతాం. విద్యార్థుల ప్రయోగాలకు పాలిహౌజ్‌లు, క్షేత్ర పరిశీలనకు అవసరమైన పంటలను సిద్ధం చేసేందుకు నేలను చదును చేశాం. నాలుగో సంవత్సరం విద్యార్థులు ఆరు నెలలు క్షేత్ర పరిశీలనకు వెళ్తారు. మొదటి సంవత్సరం ప్రవేశాలు పూర్తయ్యేలోగా అన్ని వసతులు సమకూర్చేలా అధికారులతో మాట్లాడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని