logo

సింగరేణిలో సమ్మె సైరన్

కేంద్ర ప్రభుత్వం బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు సిద్ధమయ్యారు. 72 గంటల పాటు కార్మికులు సమ్మెలోకి దిగనున్నారు. గుర్తింపు, జాతీయ కార్మిక సంఘాల ఐక్య

Published : 09 Dec 2021 05:24 IST

 నేటి నుంచి 72 గంటల ఆందోళన

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై సంఘాల నిరసన

న్యూస్‌టుడే, గోదావరిఖని

కేంద్ర ప్రభుత్వం బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు సిద్ధమయ్యారు. 72 గంటల పాటు కార్మికులు సమ్మెలోకి దిగనున్నారు. గుర్తింపు, జాతీయ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన సమ్మె నోటీసుతో పాటు విప్లవ కార్మిక సంఘాలు కూడా సమ్మె నోటీసు ఇచ్చాయి. సింగరేణిలోని కార్మిక సంఘాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నాలుగు బొగ్గు బ్లాకులను కాపాడుకోవడానికి సమ్మె తప్ప మార్గం లేదని భావించాయి. దీనిపై యాజమాన్యం, కేంద్ర కార్మిక శాఖ వద్ద చర్చలు సాగాయి. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన సంకేతాలను పంపించాలని భావించాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులకు వేలం ప్రకటన చేసింది. అందులో సింగరేణికి చెందిన కోయగూడెం బ్లాక్‌-3, శ్రావణ్‌పల్లి బ్లాక్‌, సత్తుపల్లి బ్లాక్‌-3, కేకే-6 గనులను కూడా చేర్చింది. సింగరేణి సంస్థ ఈ నాలుగు బొగ్గుబ్లాకుల కోసం అన్వేషణ పనులతో పాటు ప్రాజెక్టు నివేదికలు తయారు చేసింది. దీని కోసం రూ.కోట్లు ఖర్చు చేసింది. అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. ఓవైపు కొత్త గనుల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్న సింగరేణికి కేంద్ర ప్రభుత్వం వాటిని వేలం పాటల్లో చేర్చడంతో ఆందోళన నెలకొంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు నిక్షేపాలపై పూర్తి అధికారం సింగరేణికి ఉందన్న ధీమాతో ఇప్పటివరకు ఉన్న సంస్థకు తొలిసారిగా నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి చెందేలా వేలం ప్రకటన చేయడంపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు కూడా ఇదేవిధంగా ప్రైవేటు వారికి చేరే అవకాశం ఉందని ఆందోళన చెందాయి. మొదటి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి సమ్మె మార్గాన్ని ఎంచుకున్న కార్మిక సంఘాలు 72 గంటల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

ఉత్పత్తిపై ప్రభావం

సింగరేణి కార్మికులు గురువారం నుంచి సమ్మెలోకి దిగనుండటంతో బొగ్గు ఉత్పత్తి స్తంభించనుంది. రోజుకు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణికి 72 గంటల పాటు సమ్మెకు నిర్ణయించడంతో 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగనుంది. సింగరేణివ్యాప్తంగా పనిచేస్తున్న 42 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననుండటంతో వారి వేతనాలు కూడా నష్టపోనున్నారు. సంస్థ ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడటంతో కార్మికులు సైతం సమ్మెపై సానుకూలంగా ఉన్నారు. వేతనాలు కోల్పోయినా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

కేంద్రానికి సెగ

సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు సమ్మె బాట పట్టిన కార్మిక సంఘాలు వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేనున్నాయి. దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన తరహాలో సింగరేణి కార్మికుల నుంచి అలాంటి ఉద్యమాన్ని తీసుకురావాలని కార్మిక సంఘాలు ప్రకటన చేశాయి. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గుబ్లాకులను వేలం నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మెనే ఆయుధంగా భావించాయి. ఇప్పటికే దేశంలో బొగ్గు కొరత నెలకొంది. విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచుకోవాల్సిన సమయంలో సమ్మె చేయడంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. దీంతో బొగ్గు సరఫరాపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని బొగ్గు పరిశ్రమలు చేస్తున్న ఉత్పత్తికి అదనంగా 10 శాతం పెంచుకోవాలని ఆదేశించింది. అందులో భాగంగానే సింగరేణి 10 శాతం బొగ్గు ఉత్పత్తి పెంచుకోవడానికి ప్రణాళికలు చేసుకుంది. బొగ్గు బ్లాకుల వేలం పాటతో ఆందోళన వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు సమ్మె ద్వారా ఉత్పత్తికి విఘాతం కలిగించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని