logo

ఉబికివస్తున్న నీరు.. వరి వేయకపోతే కన్నీరు

భూగర్భజలాలు ఉబికి వస్తున్న తరుణంలో వరిపంట వేయవద్దంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాళేశ్వర జలాలకు తోడు పుష్కలంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా

Published : 09 Dec 2021 05:24 IST

జగిత్యాల జిల్లా రైతుల్లో ఆందోళన

ఈటీవీ, కరీంనగర్‌-సారంగాపూర్‌, న్యూస్‌టుడే

బీర్పూర్‌లో వ్యవసాయ బావుల్లో ఉబికివచ్చిన నీరు

భూగర్భజలాలు ఉబికి వస్తున్న తరుణంలో వరిపంట వేయవద్దంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాళేశ్వర జలాలకు తోడు పుష్కలంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా బావుల్లో నీరు పుష్కలంగా కనిపిస్తోంది. గతంలో విద్యుత్తు నీటి కొరత ఉన్నప్పుడే వరి పంట వేసేవాళ్లమని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని వాపోతున్నారు. గతేడాదితో పోలిస్తే పెద్దపల్లి జిల్లాలో మినహా కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో నీరు అందుబాటులో ఉన్నా వరిపంట వేయవద్దంటే ఏమి చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో బావుల్లో నీరు చేతితో ముంచుకొనే విధంగా నీటి మట్టం పెరిగింది. గతంలో అయిదారు మీటర్ల లోతులో నీరు కాస్త ఇప్పుడు చేతికి అంది వచ్చింది. అటు బావుల్లోనే కాకుండా పొలాలు సైతం నీటికారణంగా బురదమయంగానే ఉన్నాయి. నీరు అందుబాటులో లేనప్పుడు ఆరుతడి పంటలు వేసుకున్నా కొంత బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆరుతడి పంటలు ఎలా వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉన్నా నీళ్లతో బురదమయంగా ఉండటంతో యంత్రాలు కోతలు చేపట్టలేని స్థితిలో ఉన్నాయని అందువల్లనే కూలీలతో పంటలు కోయిస్తున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వరి పంటకు బదులు ఇతర పంటలు ఎలా వేయగలమని ప్రశ్నిస్తున్నారు..

ప్రత్యామ్నాయం చూపకపోతే ఉరే గతి -చిన్నమల్లయ్య, రైతు బీర్పూర్‌

చెరువుల నుంచి నీళ్లు ఇవ్వకపోయినా వర్షపు నీటితోనే ఈసారి మేము వరి పండించుకున్నాం. పొలాలు బావుల్లో నీరు తగ్గలేదు. ఇప్పుడు ఏ పంట వేయలేని పరిస్థితి ఉంది. నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు ఏ పంట కూడా ఈ పొలాల్లో వేయలేం. పంటలు కాకుండా ఏ పంట వేసుకోవాలో ప్రభుత్వమే ఆలోచన చేయాలి. వరి పంట వేయొద్దని చెప్పి ప్రత్యామ్నాయం చూపెట్టకపోతే మాత్రం ఉరి వేసుకొనే పరిస్థితి ఉంటుంది. చెరువులు కుంటలు కట్టించిందే పంటలు పండించుకోవడానికి.. ఇప్పుడు వద్దంటే పొలాలను బీళ్లుగా వదిలేయమంటారా ఆలోచించుకొని చెప్పాలి. ఇప్పుడు పంట వేయకపోతే మా పరిస్థితి ఏంటి మా పిల్లల పరిస్థితి ఏమి కావాలో ప్రభుత్వమే చెప్పాలి.

గతేడాది కంటే ఈ సంవత్సరం వర్షాలు అధికం -నర్సయ్య, రైతు బీర్పూర్‌

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. ఈ సంవత్సరం అసలు బోర్లు వాడటం కానీ కాల్వ నీళ్లు వాడటం కానీ జరగలేదు. వానాకాలం పండించిన పంట చాలావరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల పొలాలు పచ్చిగా ఉండటంతో కొన్నిచోట్ల కోతలు మొదలు పెట్టలేదు. మన బావుల్లో ఈసారి నీళ్లు బాగున్నాయి కాబట్టి ఈసారి కూడా వరిపంట వేసుకోవాలన్నదే రైతుల ఆలోచన. ఏళ్ల కొద్ది వరి పంట పండించడం వల్ల నేల కూడా వరికే అనుకూలంగా మారింది. ఇప్పటివరకు పండిన ధాన్యం ఇంకా కల్లాలోనే ఉంది. మళ్లీ వరి వేయవద్దంటే మేము ఏ పంట వేయాలి. మేము ఎలా బతకాలో ప్రభుత్వమే సూచించాలి.

వానాకాలం యాసంగి ఏదైనా మాకు వరే దిక్కు -అజ్మీరా నర్సింహ నాయక్‌, రైతు బీర్పూర్‌

మా పొలాల్లో వానాకాలమైనా యాసంగి అయినా పండించే ఏకైక పంట వరి మాత్రమే. మొదటి నుంచి ఆ పంటనే వేస్తున్నాం. కందులు, పెసర్లు ఏ పంట వేసినా ఇప్పడు పంట పురుగు తినేస్తుంది. ఆ పంట వేస్తే కనీసం పెట్టుబడి కూడా మిగలదు. కష్టమైనా నష్టమైనా మేమంతా వరి పంటకే అలవాటు పడ్డాం. ఇంతకు అనుకున్నంత మేర నీళ్లు లేకపోయినా వరి పంటను పండించుకున్నాం. ఇప్పుడు చేతిలో ముంచుకొనే విధంగా బావిలో నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. మోటార్లు పెట్టకపోయినా పొలాల్లో ప్రవహిస్తున్నాయి. కానీ వరి పంట మాత్రం వేయవద్దంటే ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. ఒక వైపు పండించిన పంట కొనకపోవడం మరోవైపు మళ్లీ పంట వేయవద్దనడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని