logo

పల్లె లోగిలి.. వెలుగుల రవళి

సంక్రాంతి.. అనగానే పల్లె వాతావరణమే స్ఫురిస్తుంది. పంటలు చేతికొచ్చే సమయంలో అన్నదాత ఆనందంగా జరుపుకునే పండుగకు తెలుగు లోగిళ్లలో ప్రత్యేకత ఉంది. మూడు రోజుల పాటు ముచ్చటగా నిర్వహించే వేడుకకు పట్టణాలన్నీ పల్లె బాట పడతాయి. పిండి వంటలనే కాకుండా చక్కటి వినోదాన్ని ఆస్వాదించడం కూడా సంక్రాంతికే కుదురుతుంది

Published : 15 Jan 2022 03:38 IST

● జిల్లాలో సంక్రాంతి పండుగ ప్రత్యేకతలెన్నో

న్యూస్‌టుడే, పెద్దపల్లి

సంక్రాంతి.. అనగానే పల్లె వాతావరణమే స్ఫురిస్తుంది. పంటలు చేతికొచ్చే సమయంలో అన్నదాత ఆనందంగా జరుపుకునే పండుగకు తెలుగు లోగిళ్లలో ప్రత్యేకత ఉంది. మూడు రోజుల పాటు ముచ్చటగా నిర్వహించే వేడుకకు పట్టణాలన్నీ పల్లె బాట పడతాయి. పిండి వంటలనే కాకుండా చక్కటి వినోదాన్ని ఆస్వాదించడం కూడా సంక్రాంతికే కుదురుతుంది. ఇతర పండుగల్లాగా తిథి, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఏటా దాదాపు ఒకే రోజు వచ్చే పర్వదినాన ఒక్కో ఊరిలో ఒక్కో విధంగా జరుపుకున్నా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకతల సమాహారమే ఇది.

ఆ పల్లెలు పందేలకు ప్రత్యేకం

సంక్రాంతి అంటేనే కోడి పందేలు గుర్తుకొస్తాయి. ఈ సంస్కృతి కోస్తా ప్రాంతంలోనే ఉన్నా జిల్లాలోని పలు గ్రామాల్లోనూ పోటీలు నిర్వహిస్తుంటారు. గెలుపోటములు సహజమైనా, కొన్ని సందర్భాల్లో గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉదంతాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇటీవల కొంత తగ్గినా కోడి పందేలు మాత్రం కొనసాగుతున్నాయి. జిల్లాలో కోడి పందేలకు ఎలిగేడు మండలం శివపల్లి ప్రసిద్ధి గాంచింది. గతంలో ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పోటీదారులు వచ్చేవారు. రెండేళ్లుగా పోలీసులు గట్టి నిఘా వేయడంతో ఇక్కడి వారే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. శివపల్లితో పాటు పెద్దపల్లి మండలం రాగినేడు, కనగర్తి గ్రామాలకు చెందిన పలువురు ఇప్పటికే మహారాష్ట్రకు వెళ్లిపోయారు. కోడి పందేలపై మహారాష్ట్రలో నిషేధం లేకపోవడంతో ఇక్కడి నుంచి ఆసక్తి కలిగిన వారంతా వెళ్తున్నారు.

పెద్దమ్మకు బోనాల మొక్కులు

సంక్రాంతి సందర్భంగా స్థానిక ఆలయాల్లో గ్రామదేవతలకు పూజలు నిర్వహించే సంస్కృతి పలు గ్రామాల్లో ఉంది. మంథని మండలం గుంజపడుగు, బోయపేట గ్రామాల్లో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ఏటా సంక్రాంతికి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. కాల్వశ్రీరాంపూర్‌లో బోనాలతో ఆలయానికి వెళ్తున్న మహిళల దృశ్యమే ఇది.

పశువులను పూజించే కాట్రేవుల వేడుక

వ్యవసాయంలో నిరంతరం శ్రమించే రైతుకు చేదోడువాదోడుగా నిలిచే పశువులను పూజిస్తారు. పశువులను ప్రత్యేకంగా అలంకరించి వాటిని గ్రామ చావడి లేదా ఊరి చివరలో కట్టిన తోరణం కిందుగా పంపించే వేడుకను కాట్రేవుల పండుగగా పిలుస్తారు. ఒకప్పుడు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈ వేడుక నిర్వహించేవారు. యాంత్రీకరణ ప్రభావంతో పశు సంపద తగ్గడంతో ప్రస్తుతం కొన్ని గ్రామాలకే పరిమితమైంది. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌, సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి, భూపతిపూర్‌ గ్రామాల్లో కాట్రేవుల పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొందరు యువ రైతులు పల్లెల్లో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించి, పండుగకు నిండుదనాన్ని తీసుకొస్తున్నారు.

పతంగుల సందడి..

పండుగ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తూ కేరింతలు కొడుతుంటారు. గోదావరిఖనిలో సింగరేణి, పెద్దపల్లిలో ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏటా గాలిపటాలు ఎగురవేసే పోటీలు నిర్వహిస్తుంటారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో పోటీలు నిర్వహించడం లేదు. కాగా పోటీలతో సంబంధం లేకుండా పెద్దపల్లిలోని ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో పండుగ సెలవుల్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా మారింది.

భోగి పండ్లు.. గౌరీ నోములు

మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి. పిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తుంటారు. పెద్దలు వ్రతాలు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. మహిళలు కలియుగ వైకుంఠం, లాలీగౌరమ్మ, రేపల్లెవాడ, రుక్మిణీకల్యాణం, నవదుర్గ, చుక్కల పర్వతాలు, చాటల వాయినం, గుంటల వాయినం, పంచవట్టి, గజ్జలగౌరీ, గవ్వలగౌరీ, గాజులగౌరీ తదితర నోములు ఆచరిస్తారు. సామూహికంగా నిర్వహించే నోములను ఆలయాలు, సామాజిక భవనాల్లో నిర్వహిస్తారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని, గోదావరిఖని పట్టణాల్లోని కొన్ని సామాజికవర్గాలు ఈ ప్రత్యేకమైన పూజలు, నోములు ఆచరిస్తున్నారు. ఇళ్ల ముందు అందమైన రంగవల్లికలను అలంకరించే మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని