logo

పండగ పూట... పల్లెలకు రాని బస్సు

మారుమూల ప్రాంతాలకు పల్లె వెలుగులు దూరంగా ఉంటున్నాయి. చిన్నపాటి చినుకులు పడితే బస్సును ఆ సంస్థ అధికారులు రద్దు చేస్తున్నారు. కారణం ఏదయినా ఈ ప్రాంత

Published : 17 Jan 2022 02:47 IST

వీర్నపల్లి, న్యూస్‌టుడే: మారుమూల ప్రాంతాలకు పల్లె వెలుగులు దూరంగా ఉంటున్నాయి. చిన్నపాటి చినుకులు పడితే బస్సును ఆ సంస్థ అధికారులు రద్దు చేస్తున్నారు. కారణం ఏదయినా ఈ ప్రాంత గిరిజనులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ ఎల్లమ్మ ఆలయానికి చేరువలోని ఈదులచెరువు మత్తడి కింద వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీని కోసం గుత్తేదారు అప్రోచ్‌రోడ్డును నిర్మించాడు. నాసిరకం మట్టిని పోసి ఒకే పైపును వేసి చేతులు దులుపుకున్నారు. మట్టి కూరుకుపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే గత వారంలో కురిసిన వర్షాలతో మట్టి గుల్లగా మారి సిరిసిల్ల నుంచి వన్‌పల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సు అందులో కూరుకుపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కూరుకుపోయిన బస్సును తీసి తిరిగి సిరిసిల్లకు తీసుకువెళ్లారు. అప్పటి నుంచి వీర్నపల్లి మండలంలోని 17 గ్రామాలకు ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. దీనిపై ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు నాసిరకం పనుల కారణంగా బస్సు సేవలు నిలిచిపోయాయని మండలవాసులు ఆరోపిస్తున్నారు. పండగ పూట ప్రైవేటు వాహనాల్లో అధికంగా చెల్లించి ప్రయాణించాల్సి వచ్చిందని వాపోతున్నారు. సంస్థ అధికారులు చొరవ తీసుకుని సేవలను పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు. అప్రోచ్‌రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని