logo

నిరీక్షణకే.. విసుగుపుట్టేలా..

సొంత గూడు లేని పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడానికి ప్రభుత్వం రెండు పడక గదుల ఇంటి నిర్మాణం చేపట్టింది. జిల్లాలోని బోయినపల్లి మండలంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులను ఎంపిక చేసి ఏళ్లు గడుస్తుంది. స్థల

Published : 17 Jan 2022 02:47 IST

ఆరేళ్లుగా ముందడుగు పడని రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం
ఇంకా పూర్తికాని టెండరు ప్రక్రియ
బోయినపల్లి, న్యూస్‌టుడే

బోయినపల్లిలో ఇళ్ల నిర్మాణం కోసం పరిశీలించిన స్థలం

సొంత గూడు లేని పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడానికి ప్రభుత్వం రెండు పడక గదుల ఇంటి నిర్మాణం చేపట్టింది. జిల్లాలోని బోయినపల్లి మండలంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులను ఎంపిక చేసి ఏళ్లు గడుస్తుంది. స్థల పరిశీలన చేపట్టినప్పటికీ నిర్మాణాలకు ముందడుగు పడటం లేదు. ఫలితంగా కలల ఇళ్లు సాకారమయ్యేదెన్నడోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బోయినపల్లి, దేశాయపల్లి, నర్సింగాపూర్‌, బూరుగుపల్లి, అనంతపల్లి గ్రామాల్లో మొదటి విడతలో 65 రెండు పడకగదుల ఇళ్లు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లో ఆశావహుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 2016 మార్చిలో గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం బోయినపల్లి-వేములవాడ ప్రధాన రహదారిలోని మార్కెట్‌ యార్డు సమీపంలో స్థల పరిశీలన చేశారు. ఇక్కడ బోయినపల్లి, దేశాయిపల్లి, బూరుగుపల్లి, అనంతపల్లి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు. నర్సింగాపూర్‌ లబ్ధిదారులకు ఆ గ్రామంలో స్థల పరిశీలన చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి సుమారు ఆరేళ్లు పూర్తి కావొస్తున్నప్పటికీ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదని పేర్కొంటున్నారు. బోయినపల్లిలో నిర్మించనున్న ఇళ్ల పర్యవేక్షణ బాధ్యతను నీటిపారుదల శాఖ (మధ్యమానేరు ఇంజనీరింగ్‌), నర్సింగాపూర్‌లోని ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు నిర్వహించనున్నారు. ఈ మేరకు గతంలోనే బోయినపల్లిలోని స్థలాన్ని మధ్యమానేరు ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి వెళ్లారు. ఆరేళ్లు గడిచినప్పటికీ నిర్మాణాలు ప్రారంభించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి త్వరితగతిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


టెండరు ప్రక్రియ కావాల్సి ఉంది
-యాదగిరి, పంచాయతీరాజ్‌ ఏఈ

నర్సింగాపూర్‌లో రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాలకు స్థలసేకరణ పూర్తయింది. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు టెండర్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని