logo

అరకొర సిబ్బంది... ప్రజలకు ఇబ్బంది

ప్రజలకు సకాలంలో పనులు చేయాల్సిన ఉద్యోగులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వేములవాడ మున్సిపల్‌ కార్యాలయంలో చాలా కాలంగా పలు విభాగాల్లో ఖాళీలు వేధిస్తున్నాయి. ఏళ్లుగా ఖాళీలు ఉన్నా

Published : 17 Jan 2022 02:47 IST

వేములవాడ మున్సిపల్‌ కార్యాలయంలో సగానికి పైగా పోస్టులు ఖాళీలు
వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే

వేములవాడ మున్సిపల్‌ కార్యాలయం

ప్రజలకు సకాలంలో పనులు చేయాల్సిన ఉద్యోగులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వేములవాడ మున్సిపల్‌ కార్యాలయంలో చాలా కాలంగా పలు విభాగాల్లో ఖాళీలు వేధిస్తున్నాయి. ఏళ్లుగా ఖాళీలు ఉన్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఉన్న ఉద్యోగులు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఉన్న ఉద్యోగులకు పని భారం పెరిగి చేయాల్సిన పనుల్లో జాప్యం జరిగి ప్రజలకు ఇబ్బందిగా మారింది. పాలకవర్గం సభ్యులు పట్టణంలో అనుకున్న అభివృద్ధి పనులు, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నారు. ఉన్న వారితోనే సరిపెట్టుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో మొత్తం పోస్టులు 89 మంది ఉండాల్సి ఉండగా 41 మంది మాత్రమే ఉన్నారు. మిగితా 48 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో కార్యాలయంలో ఖాళీలుగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ఉన్న ఉద్యోగులనే ఇతర విభాగాలకు సర్దుకుంటూ ఏళ్లుగా నెట్టుకొస్తున్నారు. అదనపు పని భారంతో ఉద్యోగులు ఏ పని సక్రమంగా చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి.

ప్రణాళిక విభాగమే అయోమయం

అభివృద్ధి చెందుతున్న వేములవాడ మున్సిపల్‌లో ప్రణాళిక విభాగమే అయోమయంగా మారింది. పట్టణంలో ఎప్పుడు కొత్త నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయి. ఇలాంటి ప్రాంతంలో పూర్తిస్థాయి పట్టణ ప్రణాళిక అధికారి ఉండాల్సి ఉండగా ఇక్కడ పనిచేసే ఉద్యోగికి డిప్యూటేషన్‌ వేయడంతో కరీంనగర్‌, చొప్పదండిలో బాధ్యతలు నిర్వహిస్తుండటం వల్ల ఇక్కడ ఇబ్బందిగా మారింది. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పటివరకు ఉంటారో తెలియని పరిస్థితితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. టీపీఅండ్‌బీవో పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇక్కడ భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎప్పటికప్పుడు భవన నిర్మాణాల పర్యవేక్షణ లేక ఎక్కడ సెట్‌ బ్యాక్‌ లేకుండానే యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపల్‌లో మరో ముఖ్యమైన విభాగం అకౌంట్స్‌కు సంబంధించిన ఖాళీలు ఏళ్లుగా భర్తీ కావడం లేదు. దీంతో కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగులే అకౌంట్స్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో 21 మంది కార్మికుల పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. పట్టణంలో చాలా మంది పారిశుద్ధ్య సిబ్బంది కౌన్సిలర్ల ఇంటి ప్రాంతాలకే పరిమితమయ్యారనే విమర్శలున్నాయి. మిగితా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ఇబ్బందిగా మారింది. ఇటీవల జరిగిన బదిలీల్లో కార్యాలయంలో పని చేసే శానిటరీ ఇన్స్‌పెక్టర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌, ముగ్గురు జూనియర్‌ సహాయకులు, ఓ బిల్‌ కలెక్టర్‌ బదిలీ కాగా వారి స్థానంలో మరో ఆరుగురు ఉద్యోగులు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించిన మేనేజరు స్థానంలో రెగ్యూలర్‌ మేనేజరు వచ్చారు.


కొత్త నియామకాలు జరిగితేనే భర్తీ
-శ్యామ్‌సుందర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ వేములవాడ

కొత్త నియామకాలు లేకనే కార్యాలయంలో ఉద్యోగుల భర్తీ కావడం లేదు. చాలా రోజుల నుంచి కార్యాలయంలో ఖాళీలున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. బదీలీ అయిన వారి స్థానాల్లో కొత్తవారు వచ్చారు. దాదాపుగా కార్యాలయంలో పనుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని