logo

రైలు పట్టాల పద్మవ్యూహం

రైలు పట్టాలు ఆ పల్లెకు పద్మవ్యూహంలా మారాయి.. మొదట ఒకటిగా ఉన్న గ్రామాన్ని రెండు ముక్కలు చేశాయి. ఇప్పుడు రైలు వ్యాగన్ల కింది నుంచి పట్టాలు దాటి వెళ్లేలా మార్చాయి. రైలు మార్గాలు, గూడ్స్‌ రైళ్ల రాకపోకలు, నిలుపుదలతో ఆ గ్రామ

Published : 17 Jan 2022 02:47 IST

రైల్వే లైన్ల మధ్య బందీ

బద్రిపల్లి కష్టాలు తీరే దారేది?

న్యూస్‌టుడే, రామగుండం

పట్టాలపై నిలిచిన గూడ్స్‌ రైలు; ప్రత్యామ్నాయ సీసీ రోడ్డుపై 3వ ట్రాక్‌ నిర్మాణం

రైలు పట్టాలు ఆ పల్లెకు పద్మవ్యూహంలా మారాయి.. మొదట ఒకటిగా ఉన్న గ్రామాన్ని రెండు ముక్కలు చేశాయి. ఇప్పుడు రైలు వ్యాగన్ల కింది నుంచి పట్టాలు దాటి వెళ్లేలా మార్చాయి. రైలు మార్గాలు, గూడ్స్‌ రైళ్ల రాకపోకలు, నిలుపుదలతో ఆ గ్రామ రహదారి పూర్తిగా మూతపడింది. ప్రత్యామ్నాయ రహదారి నిర్మించినా.. ఇప్పుడు దానిపైనే 3వ రైలు మార్గం నిర్మిస్తుండటంతో ఆ గ్రామం పద్మవ్యూహంలో చిక్కింది. రహదారి మీదుగా రైల్వే ట్రాక్‌లు ఉండటం, వీటిపై నిత్యం గంటలకొద్ది గూడ్స్‌ రైళ్లు ఆగడంతో చేసేదిలేక రైలు వ్యాగన్ల కింది నుంచి పట్టాలు దాటి రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారినపడ్తున్నారు. ఇప్పటికే పలువురు మరణించగా మరికొందరు క్షతగాత్రులయ్యారు. నిత్యం ప్రాణభయంతో తమ జీవనం పద్మవ్యూహంలా మారిందని అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన బద్రిపల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మరోచోట పునరావాసం కల్పించి రక్షణ కల్పించాలని రైల్వే, పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బడికి వెళ్లి రావాలంటే ఇలా పట్టాలు దాటాల్సిందే..

ఒక ట్రాక్‌తో మొదలై..
50 ఏళ్ల క్రితం సింగరేణి, బీ-థర్మల్‌, ఎఫ్‌సీఐలకు బొగ్గు రవాణా కోసం రామగుండం రైల్వేస్టేషన్‌ నుంచి గోదావరిఖని వరకు రైలు మార్గాన్ని బద్రిపల్లి ప్రధాన రహదారి మీదుగా ఏర్పాటు చేశారు. గ్రామం మధ్య నుంచి ఈ రైలు మార్గం నిర్మించారు. ఒక ట్రాక్‌ కావడం, బొగ్గు రవాణా గూడ్స్‌ రైళ్లు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుండటంతో రహదారిపై రాకపోకలకు గ్రామస్థులకు ఇబ్బంది ఉండేది కాదు. ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం కోసం 2వ ట్రాక్‌ను రైల్వే నిర్మించింది. రైళ్ల రాకపోకల సంఖ్య పెరిగింది. ఈ రెండు మార్గాల్లో నడిచే గూడ్స్‌ రైళ్లను రామగుండం రైల్వేస్టేషన్‌లోని యార్డు మీదుగా గ్రాండ్‌ట్రంక్‌ ప్రధాన ట్రాక్‌లకు అనుసంధానం చేసి నడిపించేవారు. బద్రిపల్లి వద్దే సిగ్నల్‌ పాయింట్‌ ఉండగా సిగ్నల్‌ ఇవ్వని సమయంలో ట్రాక్‌పై రైలు నిలిపేవారు. యార్డు మీదుగా ఎగువ, దిగువలకు గూడ్స్‌ రైళ్లను నడిపేందుకు ఆలస్యం అవుతుండటంతో అయిదేళ్ల క్రితం బద్రిపల్లి నుంచి కుందనపల్లి రైల్వేగేట్‌ మీదుగా ప్రధాన గ్రాండ్‌ట్రంక్‌ మార్గానికి అనుసంధాన మార్గాన్ని నిర్మించారు. ఇక్కడి ఇంధన నిల్వల కేంద్రాలకు ఇంధనాలు సరఫరా చేసే గూడ్స్‌ రైళ్లను అప్పుడప్పుడు బద్రిపల్లి సైడింగ్‌ మార్గాల్లో నిలపడంతో ఇది మరో యార్డుగా మారింది. రహదారిపై రైళ్ల నిలుపుదల పెరగడంతో లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ ఏర్పాటు చేశారు.    

ఇప్పుడు.. 3వ ట్రాక్‌ నిర్మాణం
సింగరేణి, ఎన్టీపీసీల బొగ్గుతోపాటు తాజాగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూరియా రవాణా చేపడ్తుండటంతో గూడ్స్‌ రైళ్ల సంఖ్య, రాకపోకలు పెరిగాయి. రామగుండంలో ఒప్పుడు సరకు రవాణాతో రోజుకు రూ.కోటిన్నర ఆదాయం వచ్చేది. నేడు ఆ ఆదాయం సుమారు రూ.4 కోట్లకు పెరిగింది. ద.మ.రై. సికింద్రాబాద్‌ డివిజన్‌లో అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న స్టేషన్‌ రామగుండం.. 6 నెలల క్రితం రామగుండం నుంచి గోదావరిఖని వరకు 3వ ట్రాక్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకోసం బద్రిపల్లి వద్ద ఎన్టీపీసీ నిర్మించిన సీసీ రోడ్డును పూడ్చారు. దానిపైనే చేపడ్తున్న ట్రాక్‌ పనులు పూర్తికావస్తున్నాయి. రోజూ 10 నుంచి 12 గంటల పాటు రైలును ట్రాక్‌పై నిలపడంతో రహదారి దాదాపు పూర్తిగా మూతపడింది. రైల్వేతోపాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యాలు తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, జిల్లా అదనపు పాలనాధికారి, రామగుండం రైల్వే ప్రాంతీయాధికారులను గ్రామస్థులు ఇటీవల కోరారు.


సురక్షిత ప్రాంతానికి తరలించాలి
-ఒడ్నాల రాములు, బద్రిపల్లి

గ్రామానికి ఒక వైపు రైలు మార్గాలు, 2వ వైపు బీపీఎల్‌ ప్రాజెక్టు ప్రహరీ, 3వ వైపు ఎన్టీపీసీ బూడిద సరఫరా పైపులు, 4వ వైపు మల్యాలపల్లి 2 చెరువులు ఉండటంతో అన్నివైపులా దారులు మూసుకపోయాయి. ప్రత్యామ్నాయ దారి ఏర్పాటుకు అవకాశం లేదు. రైల్వే భూగర్భ వంతెన నిర్మించడం లేదు. సురక్షిత ప్రాంతానికి గ్రామాన్ని తరలించడమే ఏకైక మార్గం. పునరావాసం కల్పించాలి.


పిల్లలను పట్టాలు దాటిస్తున్నాం
-గంధం సునీత, బద్రిపల్లి

పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలను జాగ్రత్తగా వ్యాగన్ల కింది నుంచి పట్టాలు దాటిస్తూ బడులకు పంపిస్తున్నాం. దాటించే సమయంలో ఒక్కసారిగా రైలు కదిలితే ఇక అంతే.. పెద్దలు ఎలాగోలా బయటపడవచ్చు. ఇక్కడి ట్రాక్‌లు పిల్లలకు, మాకు ప్రాణసంకటంగా మారాయి. గతంలో  స్కూల్‌ బస్సు గ్రామానికి వచ్చేది. రైళ్ల నిలుపుదలతో ఇప్పుడు రావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు