logo

ప్రజారోగ్యం.. గాలిలో దీపం

వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం తినుబండారాల తయారీలో శుభ్రత, నాణ్యత విధిగా పాటించాల్సి ఉండగా జిల్లాకేంద్రంలో అమలుకు నోచుకోవడం లేదు. పాలనా ప్రాంగణానికి ఎదురుగా, బస్టాండ్‌, కమాన్‌, జెండాచౌరస్తాల వద్ద ఇబ్బడిముబ్బడిగా

Published : 17 Jan 2022 02:47 IST

అపరిశుభ్ర పరిసరాల్లో తినుబండారాల తయారీ
జిల్లాకేంద్రంలోనే నిబంధనలు బేఖాతరు
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

సర్వపిండి తయారీలో నూనె రీసైక్లింగ్‌

వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం తినుబండారాల తయారీలో శుభ్రత, నాణ్యత విధిగా పాటించాల్సి ఉండగా జిల్లాకేంద్రంలో అమలుకు నోచుకోవడం లేదు. పాలనా ప్రాంగణానికి ఎదురుగా, బస్టాండ్‌, కమాన్‌, జెండాచౌరస్తాల వద్ద ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, టీ కొట్లలో పరిశుభ్రత చర్యలు కనిపించడం లేదు. గురువారం ‘ఈనాడు’ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

రాజీవ్‌ రహదారిపై ఉండే హోటళ్లు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి పదార్థాలపై పడుతోంది. అయినప్పటికీ నిర్వాహకులు వాటినే విక్రయిస్తున్నారు.
ముఖానికి మాస్కులు లేకుండానే, చేతులకు తొడుగులు వేసుకోకుండానే పదార్థాలు తయారు చేస్తున్నారు. ఫాస్ట్‌పుడ్‌ కేంద్రాల్లో నూడుల్స్‌, ఫ్రైడ్‌రైస్‌ తయారీ తర్వాత ప్లాస్టిక్‌ పాత్రల్లో, కవర్లలో వడ్డిస్తున్నారు.

అధికారి లేక.. తనిఖీలు కానరాక..
జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ(ఆహారభద్రత) అధికారి పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో తనిఖీలు చేయడం లేదు.  


దుమ్ము.. ధూళి.. ఈగలు..

పెద్దపల్లి బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రంలో ఏళ్ల తరబడి పరిశుభ్రం చేయక పదార్థాలు వేయించే చోట నల్లగా మారింది. వాడిన నూనెనే తిరిగి వాడుతుండటంతో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. పదార్థాలపై ఎలాంటి రక్షణ లేక ఈగలు వాలుతున్నాయి.


విచ్చలవిడిగా రంగుల వాడకం

వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన రంగులు వాడుతున్నారు. హోటళ్లలో సమోసాలు, బజ్జీలు, గారెలకు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో చికెన్‌మంచూరియా, వెజ్‌మంచూరియాల తయారీలో ఎరుపు రంగులు వాడుతున్నారు. మిగిలినవాటిని ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు విక్రయిస్తుండటం గమనార్హం. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల నుంచి వెలువడే పొగతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు, తోటి వ్యాపారులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కూతవేటు దూరంలో బల్దియా కార్యాలయం ఉన్నా తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి.


నిబంధనలు పాటించని వారికి నోటీసులు
తిరుపతి, పురపాలక సంఘం కమిషనర్‌

తినుబండారాల తయారీని పరిశుభ్ర వాతావరణంలోనే చేపట్టాలి. ప్లాస్టిక్‌ వాడవద్దు. మాస్కులు, గ్లౌజులు ధరించడం సహా ఇతర జాగ్రత్తలు పాటించాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు అందిస్తాం. స్పందించని వారిపై చర్యలు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి జరిమానాలు విధించే బాధ్యత ఆహారభద్రత శాఖాధికారులదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని