logo

భగీరథ.. ఎన్నాళ్లీ వ్యథ

చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో మిషన్‌ భగీరథ నీరు రాకపోవడంతో పట్టణంలోని పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 6వేల కుటుంబాలకు ఇంటింటికి మిషన్‌ భగీరథలో భాగంగా నల్లాలు బిగించకపోవడంతో

Published : 17 Jan 2022 02:47 IST

తరచూ అంతరాయాలతో నీటిసరఫరా నిలిపివేత
చొప్పదండి, న్యూస్‌టుడే

చొప్పదండిలో ఏర్పాటు చేసిన నల్లాలు

చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో మిషన్‌ భగీరథ నీరు రాకపోవడంతో పట్టణంలోని పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 6వేల కుటుంబాలకు ఇంటింటికి మిషన్‌ భగీరథలో భాగంగా నల్లాలు బిగించకపోవడంతో పూర్తిస్థాయిలో మంచినీటిని పొందలేకపోతున్నారు. పట్టణంలో పాత ట్యాంకులతో పాటు అవసరమైన చోట నూతన ట్యాంకుల నిర్మాణం చేసి సుమారు 4,469 మిషన్‌ భగీరథ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. ఇంకా సుమారు 1500 వరకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో నల్లాలు పూర్తిస్థాయిలో బిగించలేదు. ఇంకా సుమారు 18కి.మీ మేర నూతన లైన్లు వేయాల్సి ఉంది. పట్టణంలో పాతవి మూడు ట్యాంకులు ఉండగా 5ట్యాంకులు నూతనంగా నిర్మించారు. పట్టణానికి ప్రతీరోజు 20లక్షల లీటర్ల నీరు అవసరముండగా ప్రస్తుతం కేవలం 9.20లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతుంది. మరో 11లక్షల నీటి సరఫరాకు గాను సుమారు ఏడు ట్యాంకుల వరకు నిర్మాణం జరగాల్సి ఉంది.

దూరాభారంతో తక్కువగా నీరు
చొప్పదండికి అగ్రహారం నుంచి సుమారు 70కి.మీ నుంచి మిషన్‌భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి చివరికి వచ్చేది చొప్పదండే కావడంతో నీరు చాలా తక్కువ వేగంతో కొద్దిసేపు మాత్రమే వస్తుంది. ఎల్‌ఎండీ నుంచి వచ్చే లైన్‌ నగునూరు వరకు సరఫరా జరుగుతుంది. కనీసం ఈ సరఫరాను చొప్పదండి వరకు పెంచితే బాగుంటుందని ఈ దిశగా అధికారులు ఆలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు. అగ్రహారం నుంచి చొప్పదండికి సుమారు 70కి.మీ ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేమార్గంలో తరుచు పైపులైన్లు ధ్వంసం అవుతుండటంతో నీటి సరఫరా నిలిచిపోతుంది. గత 15 రోజులుగా మూడు ప్రాంతాల్లో పైపులైన్‌ ధ్వంసంతో పాటు పైపులైన్‌ సర్వీసింగ్‌ పేరుతో నీటి సరఫరా నిలిచిపోయింది. కేవలం ఒకటి,రెండురోజుల్లో మాత్రమే నీటి సరఫరా జరిగింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాతబావిల నుంచి నీటి సరఫరా చేస్తున్నారు.


ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి
   - లలిత, చొప్పదండి

పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. అప్పుడప్పుడు నీరు మురికిగా వస్తుంది. నీరు తాగడానికి అనువుగా లేకుండాపోతుంది. దీంతో మళ్లీ శుద్ధజలం కొనుగోలు చేయాల్సివస్తుంది. శుద్ధిచేసిన నీటిని సరఫరా చేస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది.  


నీటిఎద్దడి రాకుండా చర్యలు
- రాజేశం, ఏఈ పురపాలక సంఘం

పట్టణంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆదేశాల మేరకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే అన్ని కాలనీల్లో అవసరమైన చోట నిర్మాణాలకు సంబంధించిన వివరాలు సేకరించాం. పూర్తి నివేదికతో ప్రణాళికలు సిద్ధం చేసి మంజూరు కాగానే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని