logo

అప్రమత్తతపై గురి.. జాగ్రత్తలు తప్పనిసరి

11..14..16..18..21..23..33..38 ఇవీ జిల్లాలో గడిచిన కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే మూడో దశ వైరస్‌ ముప్పు జిల్లాలో ఇంతకింతకు పెరుగుతోంది. జనవరి మొదటి వారం ఒక అంకెకు

Published : 17 Jan 2022 02:47 IST

జిల్లాలో పెరుగుతున్న కేసులు
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

జిల్లాసుపత్రి

11..14..16..18..21..23..33..38 ఇవీ జిల్లాలో గడిచిన కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే మూడో దశ వైరస్‌ ముప్పు జిల్లాలో ఇంతకింతకు పెరుగుతోంది. జనవరి మొదటి వారం ఒక అంకెకు పరిమితమైన కేసుల సంఖ్య ఇప్పుడు రోజులో 40 దాకా చేరుకున్నాయి. సమీప భవిష్యత్తులోనే ఈ అంకె రెండింతలయ్యే అవకాశముందని జిల్లా వైద్యవర్గాలు హెచ్చరికల్ని జారీ చేస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారు విధిగా మాస్క్‌లను శానిటైజర్‌లను తప్పకుండా వాడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. అంతేకాకుండా భౌతికదూరాన్ని పాటించడంతోపాటు గతానికి భిన్నంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఏతెంచింది. గత రెండేళ్లుగా మొదటి, రెండో దశ కరోనా ఉద్ధృతి జిల్లాలో ఏ విధంగా ఉందనేది అందరికి తెలిసిందే.! అందువల్ల ఈ సారి వైరస్‌ను మన జాగ్రత్త చర్యలతోనే తిప్పికొట్టాల్సిన అవసరముంది. పైగా ఈ సారి చిన్నారులు, 60ఏళ్లు పైబడిన వారంతా మరింత జాగురుకతగా వ్యవహరించడంతో ఆరోగ్యం పదిలమవనుంది.

ఇంకా 50 శాతమే...!
15-17 ఏళ్ల వయస్సున వారికి టీకాలను వేసే విషయంలో జిల్లాలో ఇంకా 50 శాతాన్ని దాటిన ప్రగతి మాత్రమే కనిపించింది. ఈ నెల 3న ఈ ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటి వరకు 50 శాతాన్ని దాటేలా వ్యాక్సినేషన్‌ కొనసాగింది. జిల్లాలో ఈ వయస్సు కలిగిన వారు 50,908 మంది ఉండగా ఇప్పటి వరకు 25,816 మందికి టీకాలు వేసి 50.71శాతం పురోగతిని చూపించారు. పట్టణాల్లో ఈ వయస్సున్న వారికి టీకాలను వేసే విషయంలో జోరు కనిపించినా పల్లెల్లో మాత్రం నింపాదిగా సాగుతోంది. ఇక 18 ఏళ్లపైబడిన వారికి సూదిమందు అందించే విషయంలో జిల్లా ఆదర్శంగానే నిలిచింది. అర్హులైన 7,92,922 మందిలో మొదటి విడత శతశాతం పూర్తవగా రెండో విడతలోనూ 95 శాతం మంది టీకాను పొందగలిగారు. బూస్టర్‌ డోసును కూడా 3,829 మంది వేసుకున్నారు.

ముందస్తు చర్యలు..
కరీంనగర్‌ జిల్లాసుపత్రిలో ఒమిక్రాన్‌ ముప్పును ఎదుర్కోవడంతోపాటు కరోనా కేసులు పెరగకుండా ముందస్తు సన్నద్ధమనే చర్యలు కనిపిస్తున్నాయి. గతంలో వరుసగా రెండు దశల్లో కరోనా కేసుల తాకిడి ఇక్కడి జిల్లా ఆసుపత్రికి విపరీతంగా పెరిగిన దరిమిలా ఈసారి వైద్యఆరోగ్యశాఖ ముందుజాగ్రత్త చర్యలకు సిద్ధమవుతోంది. మొదటి దశ కేసుల తాకిడి ఉన్నప్పుడు 200 పడకలతో కొవిడ్‌ బాధితులకు సేవల్ని అందించారు. జిల్లాతోపాటు సరిహద్దు జిల్లాల బాధితులు ఇక్కడికి రావడంతో 450 పడకలకు పెంచారు.
జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణలో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు రెండున్నాయి. ఇవి కాకుండా 21వేల లీటర్ల ప్రాణవాయువును నింపేలా అతిపెద్ద సిలిండర్‌ ట్యాంకు ఇక్కడి సేవల్లో భాగమవుతోంది. ఒక ప్లాంట్‌ ద్వారా నిమిషానికి 425 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంటే.. మరో కేంద్రం ద్వారా 500 లీటర్ల ప్రాణవాయువు సేవల కోసం అందుతోంది. 450 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది.
చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ 12 ఐసీయూ, 30 ఆక్సిజన్‌ పడకల్ని అత్యవసర సేవల కింద ఏర్పాటు చేశారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచారు. జిల్లామంత్రి గంగుల కమలాకర్‌ సౌకర్యాలపై రెండ్రోజుల కిందట అత్యవసర సమీక్షను నిర్వహించారు. ప్రస్తుతం ఆస్పతిలో కొవిడ్‌తో బాధపడుతున్న ఒకరు చికిత్స అందుకుంటున్నారు.
కొవిడ్‌ పరీక్షల్ని క్రమంగా పెంచుతున్నారు. త్వరలో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా కూడా పరీక్షల్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
రద్దీ ప్రాంతాల్లో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. టీకా వేసుకున్నామని.. తమకేమి కాదనేలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బయటపడుతున్న కేసుల జాడలు అందరిలోనూ కనిపిస్తున్నాయని, జాగ్రత్త చర్యలు తీసుకున్నవారు ఈ ముప్పు నుంచి తప్పించుకుంటారని వైద్యులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని