logo

భగీరథ.. పూర్తయ్యేది ఎలా?

ప్రజలకు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకం అసంపూర్తి పనులతో నెరవేరని లక్ష్యంగానే మిగిలింది. పైపులైను నిర్మాణం కోసం గ్రామాల్లో సీసీ, తారు రహదారులు ధ్వంసమైనా ఇంటింటికీ నల్లాలు మాత్రం అమర్చలేదు. ట్యాంకుల నిర్మాణాలు, పైపులైన్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. దీంతో గ్రామాల్లో పాత నీటి సరఫరా పద్ధతులను కొనసాగిస్తున్నారు. పైపులైన్ల లీకేజీలు, సరఫరాలో జాప్యంతో గ్రామాల్లో నీటి తిప్పలు తప్పడం లేదు. మండల సర్వసభ్య

Published : 17 Jan 2022 02:47 IST

ప్రజలకు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకం అసంపూర్తి పనులతో నెరవేరని లక్ష్యంగానే మిగిలింది. పైపులైను నిర్మాణం కోసం గ్రామాల్లో సీసీ, తారు రహదారులు ధ్వంసమైనా ఇంటింటికీ నల్లాలు మాత్రం అమర్చలేదు. ట్యాంకుల నిర్మాణాలు, పైపులైన్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. దీంతో గ్రామాల్లో పాత నీటి సరఫరా పద్ధతులను కొనసాగిస్తున్నారు. పైపులైన్ల లీకేజీలు, సరఫరాలో జాప్యంతో గ్రామాల్లో నీటి తిప్పలు తప్పడం లేదు. మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు, గుత్తేదారులను నిలదీస్తున్నా ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో మిషన్‌ భగీరథ పనులపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం...


కలుషితమవుతున్నా..

గొల్లపల్లి: 27 గ్రామాలకు సంబంధించి 34 ఆవాసాల్లో మిషన్‌ భగీరథ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. గొల్లపల్లిలో తరచూ పైపులు లీకవడంతో నీరు కలుషితమవుతోందని గ్రామస్థులు తెలిపారు. నెలలుగా నీరు వృథా అవుతున్నా నిర్వాహకులు మాత్రం మరమ్మతులు చేయడం మరిచారని స్థానికులు చెబుతున్నారు. పలు గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటిని స్థానిక మంచి నీటి ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. గొల్లపల్లి, చిల్వాకోడూర్‌ తదితర గ్రామాల్లో కుళాయిలు అమర్చినా అందులోంచి నీరు రాకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారాయి.


పాత పైపులైన్లకే కనెక్షన్లు

కొడిమ్యాల: క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క గ్రామంలో కూడా శతశాతం పైపులైన్లు, నల్లా కనెక్షన్లు పూర్తికాని పరిస్థితి ఉంది. చాలా గ్రామాల్లో పాత పైపులైన్లకే కనెక్షన్లు ఇచ్చి మిగిలిన వాటికి ప్రతిపాదనలు పంపామంటూ అధికారులు పేర్కొంటున్నారు. హిమ్మతరావుపేట, శనివారంపేట, రాంసాగర్‌, డబ్బుతిమ్మయ్యపల్లె గ్రామాలకు రెండు రోజులకోసారి నీటి సరఫరా చేస్తుండగా తిర్మలాపూర్‌ గ్రామంలో ఇప్పటి వరకు భగీరథ నీటి సరఫరా జరగలేదు. మిషన్‌ భగీరథ ఏఈలను వివరణ కోరగా గతంలో వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాలకు ఒకే పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా జరిగేదని, నీటి సరఫరా సరిపోక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, చొప్పదండి నియోజకవర్గానికి ప్రత్యేక పైపులైన్‌ పనులు జరుగుతున్నాయని, దాదాపు పూర్తికావచ్చాయని పేర్కొన్నారు.


సర్పంచులదే బాధ్యత

మల్యాల: మండలంలోని 19 గ్రామాల పరిధిలో 50 శాతం మాత్రమే పనులు పూర్తికాగా మిగిలిన పనుల కారణంగా ఏ గ్రామంలోనూ పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడంలేదు. ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో 117.05 కి.మీ పైపులైను నిర్మాణం పూర్తిచేసి 8,233 కుళాయిలను అమర్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో భగీరథ నల్లాల ద్వారా మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతందని ప్రజలు పేర్కొంటున్నారు. పాత పథకాల పైపులైను ద్వారానే నీటి సరఫరా చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పూర్తయిన భగీరథ పైపులైను ద్వారా నీటి సరఫరా బాధ్యత ఆయా గ్రామాల సర్పంచులదేనని సంబంధిత ఏఈ మణిదీప్‌ తెలిపారు. 


బావి నీరే దిక్కు

మెట్‌పల్లి గ్రామీణం: మండలంలోని గ్రామాల్లో కొత్తగా 18 ట్యాంకులు నిర్మించి 115 కి.మీ పైపులైన్‌ వేశారు. సుమారు 14 వేల నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, ఇంకా వెల్లుల్ల, బండలింగాపూర్‌, జగ్గాసాగర్‌ తదితర గ్రామాల్లో కనెక్షన్లు ఇవ్వకపోవడంతో భగీరథ నీరందడం లేదు. ఆత్మనగర్‌, సర్కంపేట, ఆత్మకూర్‌, అందుబొందుల తండా, పాటిమీదితండా గ్రామాల్లోని ట్యాంకుల్లోకి నీరు చేరకపోవడంతో ఆత్మనగర్‌ వద్ద ప్రత్యేకంగా సంపు నిర్మించారు. ఆత్మకూర్‌లో స్థానిక బావి నీటినే ట్యాంకుల్లో నింపి గ్రామస్థులకు సరఫరా చేస్తున్నారు. పలు గ్రామాల్లో పైపులైన్‌ లీకేజీలు ఏర్పడుతున్నాయి.  


లీకేజీలతో వృథా

ఇబ్రహీంపట్నం  : మండలంలోని గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. డబ్బా గ్రామశివారులోని భగీరథ ప్రధాన గ్రిడ్‌ నుంచి గ్రామాల్లోని నీటి ట్యాంకులకు నీరు చేరుతున్నాయి. గ్రామాల్లో గతంలో ఉన్న కుళాయిలకు మాత్రమే మిషన్‌ భగీరథ నీటిని సరాఫరా చేస్తుండగా, కొత్తగా ఏర్పాటు చేసిన కుళాయిలకు ప్రస్తుతం నీటిని సరాఫరాను ప్రారంభిస్తుండడంతో చాలా చోట్ల లీకేజీలు ఏర్పడి నీరు రహదారులపై ప్రవహిస్తున్నాయి. పూర్తిస్థాయిలో పనులను వెంటనే పూర్తిచేసి ఇంటింటికీ నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.


మేజర్‌ పంచాయతీల్లోనూ..

రాయికల్‌: మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని గ్రామాల్లో పనులు అసంపూర్తిగానే మిగిలాయి. పలు గ్రామాల్లో మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా ప్రధాన పైపులైన్‌ పనులు పూర్తయినప్పటికీ గృహాలకు సరఫరా చేసే పైపులైన్‌ పనులు పూర్తి కాలేదు. దీంతో పాత ట్యాంకుల ద్వారానే నీటి పంపిణీ చేపడుతున్నారు. మేజర్‌ పంచాయతీల్లో సైతం పనులు పూర్తి కాలేదు. పలు పైపులైన్‌ తరచూ లీకేజీలు కావడంతో నీరు రహదారులపై పారుతోంది.


నీళ్లు రావడం లేదు

జగిత్యాల గ్రామీణం: జగిత్యాల అర్బన్‌, గ్రామీణ మండలాల్లో మిషన్‌ భగిరథ నీళ్లు ఎక్కడ కూడా అందటంలేదు. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఎక్కడా కూడా పూర్తి చేయలేదు. ట్యాంకుల్లోకి నెలలో చాలా రోజులు నీటి సరఫరా నిలిచిపోతుండగా ఇప్పటికే ఉన్న పాత కనెక్షన్లతో సరఫరా చేస్తున్నారు. పేరుకే మిషన్‌ భగీరథ పథకం ఉందని నీళ్లు రావడం లేదని పలువురు సర్పంచులు వాపోతున్నారు. కొత్తగా పైపులు వేసినప్పటికీ మండలంలో ఎక్కడ కూడా నీటి సరఫరా జరగటంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని