logo

ప్రతిపాదనలే.. నిధులేవీ?

అధికారంలోకి వచ్చి మరో వారం రోజుల్లో రెండేళ్ల కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తీర్చలేకపోతున్నామని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కొందరు కార్పొరేటర్లు కాలనీల్లోకి వెళ్లలేని పరిస్థితులున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం జరిగిన రామగుండం నగరపాలక ఎన్నికల్లో తెరాసకు ఆధిక్యత లభించినప్పటికీ

Published : 18 Jan 2022 02:04 IST

● రెండేళ్లుగా కనిపించని పురోగతి

● నగరపాలికలో కేటాయింపులు అస్తవ్యస్తం

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

రామగుండం నగరపాలక కార్యాలయం

అధికారంలోకి వచ్చి మరో వారం రోజుల్లో రెండేళ్ల కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తీర్చలేకపోతున్నామని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కొందరు కార్పొరేటర్లు కాలనీల్లోకి వెళ్లలేని పరిస్థితులున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం జరిగిన రామగుండం నగరపాలక ఎన్నికల్లో తెరాసకు ఆధిక్యత లభించినప్పటికీ కొందరి మద్దతు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చేరితే తమ డివిజన్లలో అభివృద్ధిని వేగవంతం చేసుకోవచ్చుననే భావంతో కొందరు స్వతంత్ర, ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల నిర్వహణ ఆశించిన మేరకు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై ఆందోళనలు

కొందరు అధికారులు కనీసం తమను కార్పొరేటర్లుగా గుర్తించడం లేదని, సమస్యల పరిష్కారం కోసం ఫోన్‌ చేస్తే సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డివిజన్‌లోని కుక్కల బెడదను నివారించాలంటూ అనేక మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో అధికార పార్టీకి కార్పొరేటర్‌ నగరపాలక కార్యాలయం ముందు రాత్రి వరకు నిరసన చేపట్టడం గమనార్హం. మరో అధికారి అక్రమాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నప్పటికీ పాలకవర్గం, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ అధికార పార్టీకి చెందిన మరో కార్పొరేటరు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అనేకమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. నగరపాలికలోని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు అనేకమార్లు జిల్లాస్థాయి అధికారులు, పురపాలక నిర్వహణ సంచాలకులకు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పని కేటాయింపులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. గుత్తేదారునకు బిల్లు చెల్లించేందుకు లంచం పుచ్చుకుంటూ ఇన్‌ఛార్జి కమిషనర్‌ అనిశా అధికారులకు చిక్కారు. అవినీతి, అక్రమాల్లో ముందంజలోనున్న రామగుండం నగరపాలిక అభివృద్ధిలో మాత్రం వెనుకంజలో ఉందని కార్పొరేటర్లే వాపోతున్నారు.

కార్పొరేటర్లను బుజ్జగించేందుకో... కాలనీల్లోని ఆయా సమస్యల పరిష్కారానికి కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నామని సదరు కార్పొరేటర్లు ప్రజలకు చెప్పుకునేందుకో తప్ప నిధుల కేటాయింపులు కాగితాలు దాటి క్షేత్రస్థాయికి రావడం లేదు. నిధులు కేటాయిస్తున్నట్లుగా పేర్కొంటున్న అధికారులు ఏయే విభాగానికి చెందిన నిధులో పేర్కొనడం లేదు. ఇటీవల జరిగిన నగరపాలకవర్గ సమావేశం ఏజెండా అంశాలను పరిశీలిస్తే ఈ అంశం తేటతెల్లమవుతుంది. సుమారు 9 నెలల క్రితం జరిగిన పాలకవర్గ సమావేశంలో తీర్మానించిన అభివృద్ధి పనులకే మోక్షం లేకపోగా తాజాగా మరో రూ.25 కోట్లను కేటాయిస్తూ తీర్మానాలు చేశారు. ఒకే పనికి రెండుసార్లు నిధులు కేటాయిస్తూ తీర్మానించడం గమనార్హం. ఇటీవల నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి ముందు కొందరు కార్పొరేటర్లు తమ డివిజన్‌కు తక్కువ నిధులు కేటాయించారంటూ ఆందోళనలు వ్యక్తం చేయగా వారిని బుజ్జగించేలా ప్రధాన ప్రజాప్రతినిధి ఆయా డివిజన్లలో నిధులు కేటాయిస్తున్నట్లు అప్పటికప్పుడు కాగితంపై రాసిచ్చి టేబుల్‌ ఏజెండాగా సమావేశంలో చేర్చినప్పటికీ నిధులపై స్పష్టత లేకపోవడం గమనార్హం.

పథకం వివరాలు లేకుండానే ఏజెండాలో ప్రతిపాదనలు

కాగితాల్లోనే...

*● నగరంలోని ఓ డివిజన్‌లో ప్రధానమైన రెండు కల్వర్టుల నిర్మాణానికి 9 నెలల క్రితం రూ.1.4 కోట్లు కేటాయిస్తూ పాలకవర్గ తీర్మానం చేసినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు.

*●● రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.1.5 కోట్లతో నగరంలోని వివిధ కాలనీల్లో 10 మహిళా స్వశక్తి భవనాల నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం నిధులు కేటాయించగా ఒకే ఒక్క భవనం పనులు పునాదుల్లో ఆగిపోగా మిగతావి కార్యరూపం దాల్చలేదు. అయినా *● తాజాగా నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో మరో రెండు స్వశక్తి భవనాల నిర్మాణానికి రూ.35 లక్షలు, మరో చోట సామాజిక భవనం, మహిళా స్వశక్తి భవనం కోసమంటూ రూ.50 లక్షలు కేటాయించారు.

*●● ఒక డివిజన్‌లో రోడ్డు వెడల్పు, నిర్మాణం కోసం ఇటీవల జరిగిన పాలకవర్గ సమావేశం ప్రధాన ఏజెండాలో రూ.3 లక్షలు కేటాయించగా అదే సమావేశానికి సంబంధించి టేబుల్‌ ఏజెండాలో మరో సారి అదే పనికి రూ.3 లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.

*●● సమావేశం ప్రధాన ఏజెండాలో రూ.8.45 కోట్లతో 71 అభివృద్ధి పనులను ప్రతిపాదించగా అదే సమావేశం టేబుల్‌ ఏజెండాలో రూ.17.8 కోట్లతో 130 అభివృద్ధి పనులను ప్రతిపాదించడం పాలకవర్గ సమావేశం నిర్వహణ, ఏజెండా రూపకల్పనపై అధికారులకున్న నిర్లక్ష్యాన్ని బయట పెడుతోంది.

*●● చేపట్టనున్న అభివృద్ధి పని వివరాలు, కావాల్సిన నిధులు, ఏయే పథకం నిధులు కేటాయిస్తున్నారో వివరాలు ఏజెండాలో ఉండాల్సి ఉండగా నగరపాలికలో ఇవేం పాటించడం లేదు. ఇటీవల జరిగిన తీర్మానాల్లో కొన్నింటికి పట్టణ ప్రగతి నిధులు కేటాయిస్తున్నప్పటికీ కొన్నింటికి నిధుల కేటాయింపు వివరాలు పేర్కొనలేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని