logo

నాసిరకం పనులు... లక్ష్యానికి తూట్లు

ఒకసారి సీసీ రహదారి నిర్మిస్తే అక్కడి నేల స్వభావాన్ని బట్టి ఇంజినీరింగ్‌ ప్రమాణాల ప్రకారం కనీసం పదేళ్లయినా మన్నికగా ఉండాలి. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పురపాలకలో నిర్మించిన రహదారులు రెండేళ్లు గడవకుండానే నాణ్యత తేలిపోతోంది. కోట్లాది

Published : 19 Jan 2022 02:22 IST

రెండేళ్లకే దెబ్బతింటున్న సీసీ రోడ్లు

అధికారుల పర్యవేక్షణ లోపం

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

బీవైనగర్‌లో కుంగిన సీసీ రహదారి

కసారి సీసీ రహదారి నిర్మిస్తే అక్కడి నేల స్వభావాన్ని బట్టి ఇంజినీరింగ్‌ ప్రమాణాల ప్రకారం కనీసం పదేళ్లయినా మన్నికగా ఉండాలి. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పురపాలకలో నిర్మించిన రహదారులు రెండేళ్లు గడవకుండానే నాణ్యత తేలిపోతోంది. కోట్లాది రూపాయలు మట్టిలో కలిసిపోతున్నాయి. పురపాలక ఎన్నికలకు ముందు 14వ ఆర్థిక సంఘం, ఎస్‌డీఎఫ్‌ పథకంలో అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఎక్కువగా సీసీ రహదారులు, కాల్వల నిర్మాణం చేపట్టారు. పనులు చేజిక్కించుకున్న గుత్తేదారులు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇష్టారీతిన నిర్మించారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు అంతా బాగుందంటూ బిల్లులు చెలించేశారు. అధికారులు... ప్రజాప్రతినిధులు.. గుత్తేదారులతో కలిసి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచిన తీరుకు ఇక్కడ జరిగిన పనులే నిదర్శనం.

జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పురపాలక సంఘానికి గత పాలకవర్గం సమయంలో భారీగా నిధుల కేటాయింపు జరిగింది. వీటిలో ప్రధాన రహదారులు, కూడళ్ల విస్తరణ, పార్కులు వంటి ఆహ్లాదకర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించారు. ఎక్కువగా కార్మికవాడల్లో అంతర్గత సీసీ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణానికి కేటాయించారు. అప్పట్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావుడి పనులతో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ప్రస్తుతం రోడ్లు బీటలు వారాయి. చాలా చోట్ల సీసీ కాల్వలు, సైడ్‌బర్మ్‌లో మట్టితో చదును చేయక రహదారులు కుంగిపోయాయి. చాలా వరకు నల్లరేగడి నేలు ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి ఆరు నుంచి తొమ్మిది ఇంచుల మందంతో వేయాలి. క్యూరింగ్‌, పక్కన సైబ్‌బర్మ్‌లు, కాల్వల నిర్మాణం వంటి కనీస ప్రమాణాలేవీ పాటించలేదు. ఎన్నికల ముందు ఎలా పని చేసినా బిల్లులు అవుతాయనే భావనతో కొందరు నేతలే గుత్తేదారులుగా అవతారమెత్తి చేపట్టారు. అప్పటికే అభివృద్ధి పనుల్లో వాటాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. పనుల నిర్వహణలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్నాళ్లు నిలవాల్సినవి తొందరగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.

గుత్తేదారుల ఇష్టారాజ్యంతో...
సిరిసిల్ల పురపాలకలో గత పాలకవర్గం సమయంలో లక్ష్యానికి మించి నిధుల కేటాయింపు జరిగాయి. గుత్తేదారులు సీసీ రోడ్ల నిర్మాణాలు ఇష్టారాజ్యంగా చేపట్టారు. అధికారులు సైతం పనుల పర్యవేక్షణను విస్మరించారన్న ఆరోపణలున్నాయి. 14వ ఆర్థిక సంఘంలో 2015-18లో రూ.10.5 కోట్లతో 15 సీసీ రహదారులు, రూ.92 లక్షలతో మురుగు కాల్వలు నిర్మించారు. రూ.8.57 కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధులతో 51 సీసీ రహదారులు, 26 కాల్వల పనులు చేపట్టారు. రూ.32.11 కోట్ల సాధారణ నిధులతో 164 సీసీ రహదారులు ఏర్పాటు చేశారు. వివిధ దశల్లో జరిగిన సీసీ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణాల్లో చాలా వరకు నాణ్యతలోపించింది. జులై, సెప్టెంబరులో కురిసిన వర్షాలకు సిరిసిల్ల పట్టణం నీటమునిగింది. దీనిలో చాలా వరకు కాల్వలు, సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. సిరిసిల్ల-కరీంనగర్‌ ప్రధాన రహదారి కాలిబాటల్లోని టైల్స్‌, సిమెంటు దిమ్మలు దెబ్బతిన్నాయి. సెప్టెంబరులో మంత్రి కేటీఆర్‌ పర్యటనకు వచ్చిన సమయంలో అప్పటికప్పుడు వరద పనులకు రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. నేటికీ ఈ పనులు ప్రారంభం కాలేదు.

నేను రాకముందే పనులు జరిగాయి
- ప్రసాద్‌, డీఈ, ప్రజారోగ్యశాఖ, సిరిసిల్ల

నేను బాధ్యతలు స్వీకరించక ముందే పనులు జరిగాయి. అప్పుడు పనులు ఎలా చేశారనేది పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. వివిధ పథకాల్లో పూర్తి చేసిన పనులకు గుత్తేదారు నిర్వహణ సమయం కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. పట్టణంలో దెబ్బతిన్న రహదారులు, మురుగుకాల్వల వివరాలు సేకరిస్తున్నాం. బాగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని