logo

స్థానిక అవసరాల పేరిట ఇసుక దందా

స్థానిక అవసరాల పేరిట అనుమతులు తీసుకొంటున్నారు. తీరా అధికారులు వేబిల్లులు ఇచ్చిన తరవాత వాటితో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలించి గ్రామ శివారుల్లో కుప్పలుగా పోస్తున్నారు.

Published : 20 Jan 2022 02:27 IST

మానేరు వాగు నుంచి ఇష్టారాజ్యంగా తరలింపు

న్యూస్‌టుడే, తంగళ్లపల్లి

రాత్రి వేళ మానేరు వాగు నుంచి ట్రాక్టరులో తరలిస్తున్న ఇసుక

స్థానిక అవసరాల పేరిట అనుమతులు తీసుకొంటున్నారు. తీరా అధికారులు వేబిల్లులు ఇచ్చిన తరవాత వాటితో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలించి గ్రామ శివారుల్లో కుప్పలుగా పోస్తున్నారు. అనుమతి తీసుకున్నది ఒకచోట అయితే వారు తరలిస్తున్నది వేరేచోట కావడం గమనార్హం. అదను చూసి రాత్రి వేళ ఈ కుప్పలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

తంగళ్లపల్లి మండల కేంద్రంతో పాటు మండేపల్లి, కస్బెకట్కూర్‌, గండిలచ్చపేట గ్రామాల శివారులోని మానేరువాగు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకెళుతూ కొందరు జిల్లా సరిహద్దులు దాటిస్తుంటే మరికొందరు ఇళ్ల వద్దనే డంపు చేసి అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో తరలిస్తున్నారు. గ్రామాల్లో ఇది లాభసాటి వ్యాపారంగా మారడంతో ఇసుక వ్యాపారులు స్థానిక అవసరాల పేరిట ఇష్టారాజ్యంగా తీసుకెళుతున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.400 నుంచి రూ.600 వరకు ఖర్చు అవుతుంది. అక్కడి నుంచి రాత్రి వేళల్లో సిద్దిపేట, మెదక్‌, హైదరాబాద్‌ వంటి పట్టణాలకు తరలిస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల వారు ఇక్కడికే వచ్చి రూ.2 వేల నుంచి రూ.3 వేలకు తీసుకెళుతున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ట్రాక్టర్లు ఉన్న వారికి ఇది లాభసాటి వ్యాపారంగా మారింది.

వేబిల్లులు తీసుకుని...

స్థానిక అవసరాల పేరిట వేబిల్లులు తీసుకొని సూచించిన స్థానంలో ఇసుకను పోయకుండా జిల్లా సరిహద్దు గ్రామాలైన జిల్లెల్ల, రామచంద్రాపూర్‌, మల్లాపూర్‌, భరత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు వారంలో రెండు సార్లు బుధ, ఆదివారాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుకకు అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదనుగా ఇసుక అక్రమార్కులు యథేచ్ఛగా తెల్లవారుజాము నుంచే ఇసుకను తీసుకుపోతున్నారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు.

గండిలచ్చపేట శివారులో పోసిన ఇసుక డంపులు

కందకాలు తీసినా...

రోజూ రాత్రి వేళల్లో గండిలచ్చపేట, కస్బెకట్కూర్‌ గ్రామాల శివారులోని మానేరు వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై లక్ష్మారెడ్డి మానేరు వాగులో కందకాలు సైతం తవ్వించారు. అయినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని స్థానికులు చెప్పుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టిసారించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

చర్యలు తీసుకుంటాం - సదానందం, తహసీల్దార్‌, తంగళ్లపల్లి

స్థానిక అవసరాలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నాం. అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించినట్లు మా దృష్టికి రాలేదు. నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని