logo

ధాన్యం డబ్బులకు పడిగాపులు

యాసంగి సీజన్‌ ప్రారంభమై అప్పుడే నెల రోజులు దాటిపోయింది. వరి, ఇతర ఆరుతడి పంటల సాగులో రైతులు తలమునకలయ్యారు. ఖరీఫ్‌ (వానాకాలం) ధాన్యం డబ్బులు అందకపోవడంతో రైతులు

Published : 20 Jan 2022 02:27 IST

జిల్లా వ్యాప్తంగా రూ. 25.65 కోట్ల బకాయిలు

గంగాధర, న్యూస్‌టుడే

వరి ధాన్యం కొనుగోలు (పాతచిత్రం)

యాసంగి సీజన్‌ ప్రారంభమై అప్పుడే నెల రోజులు దాటిపోయింది. వరి, ఇతర ఆరుతడి పంటల సాగులో రైతులు తలమునకలయ్యారు. ఖరీఫ్‌ (వానాకాలం) ధాన్యం డబ్బులు అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల వ్యాపారులకు చెల్లించేందుకు, ట్రాక్టర్‌ దున్నినవి, హార్వెస్టర్‌తో వరికోతకు, ధాన్యం తూకం వేసిన హమాలీలకు, ఇతర పెట్టుబడులు చెల్లించలేక అగచాట్లు పడుతున్నారు. ఇక రెండో పంట పెట్టుబడులకు అప్పు కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

సంఘాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ

జిల్లాలో 351 ఐకేపీ, ప్యాక్స్‌, డీసీఎంఎస్‌, మార్కెటింగ్‌ కేంద్రాల ద్వారా గత సీజన్‌లో 73,571 మంది రైతులకు చెందిన 3,91,211 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకుగాను రూ.766.77 కోట్లకు ఇప్పటి వరకు రూ. 741.12 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ. 25.65 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా గడిచిన 10 రోజులుగా బకాయిలు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. గంగాధర ప్యాక్స్‌ పరిధిలోని 9 కేంద్రాల్లో 254 మంది రైతులకు రూ. 3.94 కోట్ల ధాన్యం రొక్కం జమ కావాల్సి ఉండగా కురిక్యాల ప్యాక్స్‌ పరిధిలోని 65 మందికి రూ. 78 లక్షలు అందాల్సి ఉంది. వెంకంపల్లి, కాసారం, గోపాల్‌రావుపల్లి, తాడిజెర్రి గ్రామాల రైతులతోపాటు గంగాధర పరిధిలోని ఆయా గ్రామాల రైతులు సంఘాల కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 3 వరకు కొందరు రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాక మళ్లీ డబ్బులు రాలేదని ప్యాక్స్‌ సిబ్బంది తెలిపారు.

వారం రోజుల్లో చెల్లిస్తాం

- శ్రీకాంత్‌రెడ్డి, సివిల్‌సప్లై డీఎం

గడిచిన వారం రోజులుగా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడం కొంత ఇబ్బందిగా ఉంది. ఇప్పటివరకు రూ.741.12 కోట్ల ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇంకా రావాల్సిన డబ్బులు రూ. 25.65 కోట్లు వారం రోజుల్లో రైతులకు చెల్లిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు