logo

బొగ్గు ఉత్పత్తి సాగేనా..!

బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై కరోనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో బొగ్గు ఉత్పత్తి కుంటుపడే అవకాశం ఉంది. 2020లో మార్చిలోనే కరోనా కేసులు పెరిగాయి. ఆ

Published : 20 Jan 2022 02:27 IST

పెరుగుతున్న కేసులతో లక్ష్య సాధనపై సందేహాలు

న్యూస్‌టుడే, గోదావరిఖని

గనిలో కార్మికులు

బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై కరోనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో బొగ్గు ఉత్పత్తి కుంటుపడే అవకాశం ఉంది. 2020లో మార్చిలోనే కరోనా కేసులు పెరిగాయి. ఆ తర్వాత 2021లో సైతం మార్చి నుంచి కరోనా కేసులు పెరగడంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. తొలిదశ సమయంలో భూగర్భ బొగ్గుగనులకు లేఆఫ్‌ ప్రకటించారు. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండో దశలో భారీగా కేసులు పెరగడంతో కార్మికుల గైర్హాజరు శాతం పెరిగింది. దీంతో ఉత్పత్తి ఆశించిన స్థాయిలో చేపట్టలేకపోయింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం 50.5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే చేపట్టింది. ఈ ఏడాది 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్న సింగరేణికి వార్షిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. ఇప్పటి వరకు 50 మిలియన్‌ టన్నుల బొగ్గుఉత్పత్తి సాధించిన సింగరేణి రానున్న కాలంలో మరో 20 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండటంతో యాజమాన్యం అప్రమత్తమైంది. నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

క్వారంటైన్‌లో కార్మికులు

కొవిడ్‌ సోకిన కార్మికులు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. కొంత మంది సింగరేణి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు సింగరేణిలో 1000కి పైగా మంది కరోనా సోకిన వారున్నారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఇళ్లలోనే ఉండి మందులు వాడుతున్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన కార్మికులకు ఏడు రోజులు క్వారంటైన్‌ సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఏడు రోజుల పాటు వీరు విధులకు దూరంగా ఉండటంతో బొగ్గుఉత్పత్తి లక్ష్య సాధనకు ఆటంకం ఏర్పడుతోంది. వరుసగా రెండు సంవత్సరాలు ఆర్థిక సంవత్సరం చివరలో కరోనా కేసులు విజృంభించగా ఈసారి మాత్రం మరో రెండునెలలు ఉండగానే కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. దీంతో యాజమాన్యం కార్మికులను అప్రమత్తం చేసే పనిలో పడింది. గనుల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తోంది. మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు శానిటైజర్లు వినియోగించాలని చెబుతోంది. గనులపై హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించడంతో పాటు కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని