logo

50 రోజులు.. 5 లక్షల పని దినాలు

‘ఉపాధిహామీ పథకంలో కోరిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. చెరువుల్లో

Published : 20 Jan 2022 02:27 IST

కూలీల ‘ఉపాధి’ భద్రతకు పెద్దపీట

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

‘ఉపాధిహామీ పథకంలో కోరిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. చెరువుల్లో పూడికతీత, కాలువలు, ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు, భూగర్భ జలాలు పెంపొందించే పనులు కొనసాగుతున్నాయి. హరితహారం మొక్కల సంరక్షణలో కొన్ని చోట్ల లోపాలను సరిదిద్దుతున్నాం. ఈ ఏడాది లక్ష్యాలు అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీధర్‌ తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో గత వేసవిలో ఆశించిన స్థాయిలో కూలీలు పనికి రాకపోవడంతో లక్ష్యాలపై కొంత ప్రభావం చూపిందని, వచ్చే యాభై రోజుల్లో (ఫిబ్రవరి, మార్చి నెలల్లో) అయిదు లక్షల పని దినాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. పథకం నిర్వహణ, కూలీలకు ఉపాధి, హరితహారంలో మొక్కలు, నర్సరీల పెంపకం తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’తో ఆయన మాట్లాడారు..

న్యూ: ఎలాంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు?

జి.గ్రా.అ.: చెరువులు, కుంటల్లో పూడికతీత, కట్ట సామర్థ్యం పెంచడం, ప్రధాన కాలువల్లో, పిల్ల కాలువల్లో పూడిక తొలగించే పనులను గుర్తించాం. పూడిక మట్టి తొలగింపుతో చెరువుల్లోకి నీరు సమృద్ధిగా చేరి ఆయకట్టులో సాగుకు భరోసా కలగనుంది. భూగర్భ జలాలు ఒడిసిపట్టేలా గుట్టలు, కొండల ప్రాంతాల్లో నీటి నిల్వకు కాంటూరు, సమతల కందకాలు, ఇంకుడుగుంతల నిర్మాణాన్ని వేగిరం చేస్తున్నాం. జిల్లాలోని డీ-83, డీ-86 కాలువలను ఆధునికీకరించే పనులు చేస్తున్నాం.

న్యూ: జిల్లాలో ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవడానికి ప్రణాళిక ఏమిటి?

జి.గ్రా.అ.: గతేడాది 28.50 లక్షల పని దినాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్యను అధిగమించేందుకు ప్రణాళిక చేపట్టాం. ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ తీవ్రతతో కూలీలు పనికి రాలేదు. ప్రస్తుతం రోజుకు 10 వేల మంది హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఊరిలో కనీసం 50 మంది కూలీలు తప్పకుండా పని చేసేలా చూడాలని ఆదేశించాం. ఇప్పటివరకు 23.34 లక్షల పని దినాలు చేశారు. మరో ఐదు లక్షల పని దినాలను 50 రోజుల్లో పూర్తి చేస్తాం.

న్యూ: నూతన సాంకేతిక విధానం అమలు ఎలా ఉంది?

జి.గ్రా.అ.: ఉపాధిహామీ పథకం నిర్వహణలో నూతన సాంకేతిక విధానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఎంబీ రికార్డుల ఆధారంగా కూలీల వేతనాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే రాష్ట్ర స్థాయిలో వారి ఖాతాలో జమయ్యేవి. ప్రస్తుత విధానంతో కూలీల పని సామర్థ్యంతో రికార్డు చేస్తే కేంద్రం నుంచే నేరుగా జమ కానున్నాయి. వేతనాల చెల్లింపులో జాప్యం ఉండదు.

న్యూస్‌టుడే: జిల్లాలో కూలీలకు ఉపాధి కల్పన ఎలా సాగుతోంది?

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి: జిల్లాలో 1,17,234 జాబ్‌కార్డులున్నాయి. వీటి పరిధిలో 2,56,724 మంది కూలీలుగా నమోదయ్యారు. గ్రామాల్లో కోరిన ప్రతి కూలీకి పని చూపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం తీసుకుంటున్నాం. పనులకు వచ్చేలా కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్ర సహాయకులు లేకపోవడంతో కార్యదర్శులు ఆ బాధ్యతలు చూస్తున్నారు.

న్యూ: హరితహారం మొక్కల సంరక్షణలో అక్రమాలపై చర్యలేమిటి?

జి.గ్రా.అ.: జిల్లాలో ఆవాస, ప్రభుత్వ భూముల్లో మొక్కలు పెంచుతున్నాం. పంచాయతీ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని సరఫరా చేస్తున్నాం. ఒక్కో ట్రిప్పుతో 333 మొక్కలకు నీరందించాలి. ఇందుకు మొక్కకు రూ.5 చొప్పున చెల్లిస్తున్నాం. నెలకు మూడు సార్లు నీరు పట్టాలి. నీటి సరఫరా బిల్లులు నేరుగా పంచాయతీ ఖాతాలో జమ కానున్నాయి. మంథని మండలంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచుతున్నందున అదనంగా ట్రాక్టర్లను వినియోగించారని ఫిర్యాదులు అందాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవినీతికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం.

న్యూ: కూలీల వేతన నిధులు స్వాహా అవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణ ఎలా ఉంది?

జి.గ్రా.అ.: గతంతో పోలిస్తే నిధుల దుర్వినియోగం తక్కువగానే ఉంది. సామాజిక తనిఖీ ప్రజావేదికల్లో పలు చోట్ల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కూలీల హాజరు నమోదులో తప్పిదాలు, బినామీ పేర్లతో నిధులు స్వాహా చేస్తున్నట్లు వెల్లడవుతోంది. పక్కదారి పట్టిన ప్రతి పైసాను రికవరీ చేస్తున్నాం. స్వాహా చేసిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు