logo

బల్దియాలో బిల్లుల లొల్లి

రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్న నగరపాలిక.. పనులను సక్రమంగా చేపట్టేలా పర్యవేక్షణ చేయాల్సిన ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు. నాణ్యత ప్రమాణాల ప్రకారం

Published : 20 Jan 2022 02:27 IST

అకౌంట్స్‌కు వెళ్లకుండానే మోకాలడ్డు

డివిజన్ల కేటాయింపుల్లో పోటా పోటీ

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

కరీంనగర్‌ నగరపాలక కార్యాలయం

రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్న నగరపాలిక.. పనులను సక్రమంగా చేపట్టేలా పర్యవేక్షణ చేయాల్సిన ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు. నాణ్యత ప్రమాణాల ప్రకారం బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకునే సమయంలోనే లొల్లి మొదలవుతోంది. చేసిన పనికి ఓ రేటు విధించి వసూళ్లకు పాల్పడుతున్న సంఘటన బయట పడిన విషయం తెలిసిందే.

కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో సాధారణ నిధులతో పాటు పట్టణ ప్రగతి, ఆర్థిక సంఘం నిధులు, సీఎంఏ నిధులతో డివిజన్‌లో రోడ్లు, మురుగునీటి కాల్వలు, పార్కులు, శ్మశానవాటికలు, పండుగల ఏర్పాట్లు, హరితహారం, పూడికతీత తదితర అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఈ పనులను ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు ఆహ్వానించి టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు. టెండర్లు నిర్వహించినా..స్పందించకపోతే అధికారులే దగ్గరుండీ నామినేషన్‌ పద్ధతిలో అప్పగిస్తారు. పనులు చేసే సమయంలో పర్యవేక్షణ చేసి నాణ్యత ప్రమాణాల ప్రకారం కొలతలు నిర్వహించి ఎంబీ రికార్డు చేస్తారు. దీనిని డీబీ సెక్షన్‌ ద్వారా అకౌంట్స్‌ విభాగానికి చెక్కుల తయారీకి పంపిస్తారు. అయితే పనులు పూర్తి కావాలంటే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు తనిఖీలు చేసిన తర్వాత బిల్లు మంజూరు అవుతుంది.

నువ్వా? నేనా?

ఇంజినీరింగ్‌ విభాగంలో అంతర్గత బదిలీలు జరిగే సమయంలో సివిల్‌ వర్క్స్‌ ఉండే డివిజన్ల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఆ డివిజన్లు కేటాయింపులు చేయకపోతే ఫిర్యాదులు చేసుకుంటారు. సాధారణ డివిజన్లు కేటాయిస్తే మొక్కుబడిగా పనులు చేసి చేతులు దులుపుకుంటారు. తక్కువ సంఖ్యలోనే ఉద్యోగులు, అధికారులు ఉండగా వీరి మధ్యనే పోటాపోటీ ఉంటుంది.

ముందే వసూళ్లు

బిల్లు తయారు చేసిన తర్వాత దస్త్రం కదలాలంటే ముందుగానే నిర్ణయించిన మొత్తాన్ని సదరు అధికారులకు సమర్పించుకోవాల్సిందేనని గుత్తేదారులు విమర్శలు చేస్తున్నారు. అధికారి స్థాయిని బట్టి చెల్లింపులు ఉంటాయని చెబుతున్నారు. రెండు నెలల కిందట ఓ అధికారి ఏ దస్త్రమైనా రెండు శాతం ఇవ్వాల్సిందేనని, అప్పుడే ఏ బిల్లుపైనైనా సంతకం అవుతుందని పేర్కొని ఆరోపణలకు గురయ్యారు. దీంతో పాటు పలు రకాల ఫిర్యాదులు రావడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడం, అందులో భాగంగానే మంగళవారం ఇంజినీరింగ్‌ విభాగంలోని ఈఈ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.

ప్రాధాన్యం లేకుండా సాధారణ బిల్లులు

బడ్జెట్‌ అంచనా ఆధారంగా సాధారణ నిధులతో పలు రకాల అభివృద్ధి పనులకు టెండర్లు పిలుస్తున్నారు. ఈ ఖాతాలో ఉన్న నిధులను ఉద్యోగుల, కార్మికుల వేతనాలు, నిర్వహణ కోసం ఉపయోగించుకుంటారు. ఆ తర్వాతే బిల్లుల చెల్లింపు జరుగుతుంది. గత కొన్ని నెలలుగా సాధారణ నిధులు లేకపోయినా రూ.3 కోట్లు వరకు పలు రకాల పనులకు టెండర్లు పిలిచారు. ఆరు నెలల కిందట ఈ పనులు పూర్తి చేశారు. వీటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో తకరారు మొదలైంది. నిధులు లేవనే సాకుతో వీటికి సంబంధించిన దస్త్రాలను ముందుకు కదిలించకుండానే డీబీ సెక్షన్‌లో అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా బిల్లు తయారు చేసి అధికారుల సంతకాలు తీసుకొని అకౌంట్స్‌ విభాగానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ చెక్కులు రాసే సమయంలో సీనియార్టీ పరిగణలోకి తీసుకుంటారు. నిధులు లేకపోతే అదే వరుసలో ఉంటాయి. అయితే ఈ మధ్య అలా చేయకపోవడంతో గుత్తేదారుల మధ్య ఫిర్యాదులు ఎక్కువయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని