logo

నద్ది నాలా.. కబ్జా గోల

రేకుర్తిలో కొందరు భూదాహం తీర్చుకునే విషయంలో తగ్గేదేలె..! అంటున్నారు. కాస్త జాగ కనపడితే చాలు.. ఎలాగోలా కబ్జా చేయాలనే ఆలోచనే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. తమకున్న పలుకుబడితో

Published : 20 Jan 2022 02:27 IST

కాలువ ప్రాంతాన్ని మింగే ప్రయత్నాలు

రేకుర్తిలో తీరొక్క విధంగా భూ ఆక్రమణలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ఇలా రాళ్లను నింపడంతో కుచించుకుపోయిన తీరు..

రేకుర్తిలో కొందరు భూదాహం తీర్చుకునే విషయంలో తగ్గేదేలె..! అంటున్నారు. కాస్త జాగ కనపడితే చాలు.. ఎలాగోలా కబ్జా చేయాలనే ఆలోచనే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. తమకున్న పలుకుబడితో అనుకున్నది చేసేస్తున్నారు. విలువైన భూముల విషయంలో తిమ్మిని బమ్మిగా మార్చేస్తున్నారు. వారనుకున్నట్లే తప్పు ఒప్పు అయిపోయేలా సరిహద్దులను తెలివిగా చెరిపేస్తున్నారు. ఆక్రమణల తీరుని యథేచ్ఛగా కొనసాగించేస్తున్నారు. కబ్జాల కోరల్లో కొట్టుమిట్టాడుతున్న రేకుర్తిలో భూమిని మింగినట్లే.. గలగల పారే నీటి పరివాహక ప్రాంతాన్ని మింగేలా ఎత్తుగడల జోరు చాకచక్యంగా సాగిస్తున్నారు. ఏళ్ల కిందటి నుంచి గొలుసు కట్టు చెరువులకు ఆధారమైన ఓ ప్రధాన నాలా అన్యాక్రాంతమవుతోంది.అధికారులు కనీసం ఈ కాలువను పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఇది ప్రవహించే పొడుగునా ఇరువైపుల ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతోంది.

ఏం జరుగుతుందంటే..?

రేకుర్తిలోని విలువైన స్థలాల మధ్య నుంచి వర్షాకాలంలో వరద నీటిని ఆయా గ్రామాలకు తీసుకెళ్లే నద్దినాలా కథే ఇది. కొత్తపల్లి పెద్ద చెరువు కట్ట మత్తడి నుంచి ప్రారంభమైన ఈ నాలా రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి గ్రామాల మీదుగా నగునూర్‌ సమీపంలోని వాగులో కలుస్తుంది. చెరువు నిండినప్పుడు మత్తడి నీళ్లతోపాటు ఎస్సారెస్పీ డి-94 ఉప కాలువ నీళ్లు పొలాలకు చేరగా.. మిగిలినవన్నీ ఈ నాలాలో కలుస్తూ ముందుకెళ్తుంటాయి. కరీంనగర్‌- జగిత్యాల రహదారిలో రేకుర్తికి ఇరువైపుల వెడల్పుగా ఉన్న ఈ కాలువ కాలక్రమంగా తన సహజ రూపును కోల్పోతోంది. పలుగ్రామాలకు అనుసంధానంగా ఉన్న దీని వెడల్పు ఒక్కో స్థానంలో ఒక్కో విధంగా ఉంటుంది. మొత్తంగా మాత్రం దీని పరివాహక ప్రాంతంతోపాటు ఆనుకుని ఉండే బఫర్‌ జోన్‌ అంతా కలిపి ప్రవాహపు పొడుగునా దాదాపుగా 50కిపైగా ఎకరాలే ఉంటుందని వినికిడి. కొన్నిచోట్ల 50 అడుగులు ఇంకొన్ని చోట్ల 80 అడుగుల వెడల్పుతో నీళ్లు నిల్వ ఉంటాయి. గడిచిన దశాబ్ద కాలానికిపైగా ఈ నద్దినాలా సరిహద్దుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణే లేకపోవడంతో ఇది చాలాచోట్ల నామరూపాలు లేకుండా పోయింది. స్థిరాస్తి ముసుగులో చాలాచోట్ల కబ్జాకు గురైంది.

వ్యూహాత్మక ఎత్తుగడలు..

కొన్నేళ్లుగా ఇక్కడి ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుండటంతో ఈ నాలాకు ఆనుకుని ఇరువైపులా పలునిర్మాణాలు జరుగుతున్నాయి. నాలాకు రెండు దిక్కులా 10 నుంచి 20 అడుగుల బఫర్‌జోన్‌ అక్కడి ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. దాన్ని చాలాచోట్ల చెరబట్టారు. పక్కనే ప్రభుత్వ భూములున్న స్థలాలే కాకుండా ఇరువైపుల ఉండే పట్టా భూముల సర్వే నంబర్లలో ఈ జాగను దర్జాగా కొందరు కలిపేసుకుంటున్నారు. ఇటీవల రేకుర్తి శివారులోని రైల్వే కట్ట చెంతన ఈ కాలువ స్థలానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొందరు చదును చేశారు. నీళ్లు నిలిచే ప్రాంతాన్ని దాదాపుగా వారి స్థలంలో మిళితమయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక దీన్ని అటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం, పూడిక తీత సహా హద్దుల ఏర్పాటు, రక్షణ చర్యల దిశగా అడుగులేయకపోవడంతో చాలా చోట్ల ఈ నాలా ఇతరుల భూముల్లో బందీ అవుతోంది. కొన్నిచోట్ల కనీసం దాన్ని పరిశీలించే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం.! పలుమార్లు ఈ విషయమై ఫిర్యాదులు అందినా ఇటు రెవెన్యూ, అటు నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయి రావడం లేదనే విమర్శలున్నాయి. కొందరి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి సరిహద్దుల్ని పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు ఇకమీదటనైనా స్థలాన్ని కోల్పోకుండా హద్దుల్ని గుర్తించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అదే సమయంలో పట్టాభూముల వాస్తవ స్థితిగతుల్ని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేయాల్సిన అవసరముంది.

అధికారులేమన్నారంటే..!

నద్ది నాలాను ఆనుకుని ఉన్న స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. నక్ష ప్రకారం రికార్డుల్లో ఉన్న తీరుకు క్షేత్రస్థాయిలోని వాస్తవ స్థితిగతుల్ని గమనిస్తామని చెప్పారు. నీటిపారుదల శాఖ ఈఈ నాగభూషణం మాట్లాడుతూ.. తక్షణమే కాలువను మ్యాప్‌ ప్రకారం పరిశీలించి సరిహద్దులు పెడుతామన్నారు. అవసరాన్నిబట్టి సర్వే కోసం సహాయక సంచాలకులకు లేఖను రాసి సర్వేచేసి ఆక్రమణల్ని తొలిగిస్తామన్నారు. మ్యాప్‌ ఆధారంగా బఫర్‌జోన్‌ ప్రదేశాల్ని ఇరువైపుల గుర్తిస్తామని తెలిపారు.


ప్రభుత్వ భూములు పరిశీలించిన ఆర్డీవో

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న అక్రమార్కుల తీరుపై ‘ఈనాడు’లో వచ్చిన వరస కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ నెల 18న ‘రేకుర్తి కబ్జాల కక్కుర్తి’.. 19న ‘గుట్టల చుట్టూ ఆక్రమణల గుట్టు’ శీర్షికలతో వచ్చిన కథనాలకు స్పందించిన రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, కొత్తపల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఇతర సిబ్బంది రేకుర్తి సమీపంలోని సమ్మక్కసారలమ్మ చెంతన ఉన్న భూముల్లో తిరుగుతూ వాస్తవాల్ని గమనించారు. ఈ సందర్భంగా రికార్డులతోపాటు నక్షాను అధికారులు పరిశీలించారు. త్వరలోనే ఇక్కడి భూముల విషయమై సమగ్రంగా సర్వేను నిర్వహించి హద్దులు నిర్ణయిస్తామని స్థానికులకు తెలిపారు. మరోవైపు రేకుర్తిలోని రెండు డివిజన్ల కార్పొరేటర్లైన సుధగోని మాధవి, ఏదుల్ల రాజశేఖర్‌లు రేకుర్తిలోని విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రాల్ని అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని