logo

కన్నా... నీ కన్ను మసకబారుతోంది!

కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నర పైగా విద్యార్థులు ఎక్కువగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌ తరగతులతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు చరవాణులు, టీవీలు, ల్యాప్‌టాప్‌

Published : 21 Jan 2022 03:18 IST

చిన్నారుల కళ్లపై తీవ్ర ఒత్తిడి

న్యూస్‌టుడే, సిరిసిల్ల (విద్యానగర్‌)

ఆన్‌లైన్‌ తరగతులు వింటున్న విద్యార్థి

కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నర పైగా విద్యార్థులు ఎక్కువగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌ తరగతులతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు చరవాణులు, టీవీలు, ల్యాప్‌టాప్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో వీరి కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

జిల్లాలో మొత్తం 489 ప్రభుత్వ, 126 ప్రైవేటు, 7 ఆదర్శ పాఠశాలలు, ఒక యూఆర్‌ఎస్‌, 13 కేజీబీవీలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. సెప్టెంబర్‌లో ప్రత్యక్ష బోధన ప్రారంభించినప్పటికీ ఈనెల 8న సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నెల 30 వరకు వీటిని పొడిగించింది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మళ్లీ ఆన్‌లైన్‌ బాట పట్టారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, ఫోన్‌ సౌకర్యం లేకపోవడం, సిగ్నల్‌ సమస్య, ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఉండి ఒకే చరవాణి ఉండటం వంటి సమస్యల వల్ల పిల్లలు  చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. దానికితోడు విద్యార్థుల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న ఎలక్ట్రానిక్‌ తెరలపై అక్షరాలను, చిత్రాలను వీక్షిస్తూ చూపు కదల్చకుండా తరగతులు విన్న విద్యార్థులు దృష్టి లోపం సమస్యలు ఎదుర్కొంటున్నారని బాధపడుతున్నారు. అదేపనిగా చూడటం వల్ల కళ్లు నొస్తున్నాయని, తలనొస్తుందంటున్నారు. దీనికి తోడు పిల్లలు ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం వల్ల ఎదిగే వయస్సులో కళ్లపై ఒత్తిడి పెరిగి దృష్టి సమస్యలకు కారణమవుతుందని వాపోతున్నారు.

బాధపడేవారు...- అనిత, విద్యార్థి తల్లి

మా పెద్ద బాబు కుసుమ రామయ్య జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్నబాబు తారకరామానగర్‌ ఎంపీపీఎస్‌లో చదువుతున్నాడు. మాకు ఒకే స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. దీంతో పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. బంధువుల చరవాణి సహాయంతో పాఠాలు విన్నారు. అదే పనిగా చరవాణిని చూడటం వల్ల కళ్లు నొస్తున్నాయని, తల నొస్తుందని బాధపడేవారు. ఆసక్తి కనబరిచేవారు కాదు.

ఆన్‌లైన్‌ బోధన ప్రత్యామ్నాయం కాదు- పాకాల శంకర్‌గౌడ్‌, టీఎస్‌ యూటీఎఫ్‌, జిల్లా అధ్యక్షుడు

ప్రత్యక్ష తరగతుల ద్వారానే విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంపొందుతుంది. తద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. విద్యార్థులపై పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థులకు డిజిటల్‌ పరికరాలు లేకపోవడం వల్ల అందరికీ అందుబాటులో ఆన్‌లైన్‌ తరగతులు ఉండటం లేదు. దీనివల్ల విద్యార్థులకు చాలా నష్టం ఏర్పడుతుంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  ప్రత్యక్ష బోధన ప్రారంభించాలి.

జాగ్రత్తలు అవసరం -డి.రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి

కేవలం ఆన్‌లైన్‌ తరగతుల కారణంగానే విద్యార్థులకు దృష్టి లోపం లాంటి కంటి సమస్యలు వస్తున్నాయని చెప్పలేం. కరోనా వల్ల విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావాలి. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. తగు జాగ్రత్తలు పాటిస్తూ పాఠాలు వినాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.

పెద్ద తెరలు వినియోగించాలి - రజని, కంటి వైద్య నిపుణురాలు

ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చూడటం వల్ల విద్యార్థుల కళ్లు దెబ్బతింటాయి. ఫోన్‌ కాకుండా ల్యాప్‌టాప్‌ గానీ, టీవీలలో గానీ పాఠాలు వినేందుకు ప్రాధాన్యమివ్వాలి. చిన్న తెరల స్థానంలో పెద్ద వాటిని వినియోగించాలి. విద్యార్థులు ఆప్టిమమ్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ పెట్టుకోవాలి. గది వెంటిలేషన్‌ కూడా చక్కగా ఉండేలా చూసుకోవాలి. విద్యార్థులు ఇంటికే పరిమితమవడం వల్ల చరవాణులకు ఎక్కువగా బానిసలవుతున్నారు. అదే పనిగా ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో ఒక తరగతికి ఇంకో తరగతి మధ్య విశ్రాంతి కల్పించాలి.  తరగతులు పూర్తయ్యాక విద్యార్థులు ఎక్కువగా ఫోన్‌ వినియోగించకుండా తల్లిదండ్రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

ఇటీవల ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రి వారు ఛైల్డ్‌ బ్లైండ్‌నెస్‌ ప్రోగ్రాం (సీబీపీ)లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన విద్యార్థుల వివరాలు ఇలా...

నేత్ర వైద్య శిబిరాలు
నిర్వహించిన పాఠశాలలు : 156
మొత్తం పిల్లల సంఖ్య : 37,779
కళ్ల అద్దాలు అవసరమైనవారు : 512
మందుల పంపిణీ : 95
శస్త్రచికిత్స చేసిన వారి సంఖ్య : 3

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని