logo

వైద్య కళాశాలకు తాత్కాలిక ఏర్పాట్లు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చేపట్టిన వైద్య కళాశాల భవన నిర్మాణంలో జాప్యం నెలకొనే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వైద్య కళాశాల భవన నిర్మాణం చేపట్టాల్సిన

Published : 21 Jan 2022 03:18 IST

భవన నిర్మాణంలో జాప్యం

డిగ్రీ కళాశాలలో పరిశీలన

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చేపట్టిన వైద్య కళాశాల భవన నిర్మాణంలో జాప్యం నెలకొనే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వైద్య కళాశాల భవన నిర్మాణం చేపట్టాల్సిన స్థలంలో గతంలో అంతా బూడిదతో నింపడంతో పునాదులు తవ్వుతుంటే బూడిద వస్తుండడంతో ఆలస్యమవుతోంది. భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రితో గుత్తేదారు సిద్ధంగా ఉన్నా ఇలాంటి కారణాలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి. పైగా రానున్న విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు తీసుకోవాల్సి ఉన్నందున భవన నిర్మాణం ఎంత వేగవంతం చేసినా అప్పటివరకు అందకపోవచ్చనే భావంతో తాత్కాలిక ఏర్పాట్లపై అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హిమబిందుసింగ్‌తో పాటు ఆచార్యులు డాక్టర్‌ రత్నేశ్‌, డాక్టర్‌ రాజు, డాక్టర్‌ నరేందర్‌, డాక్టర్‌ అనంతబాబు తదితరులు గురువారం గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరంలో 150 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. డిగ్రీ కళాశాల భవనం పై అంతస్థులోని ఆడిటోరియంతో పాటు కింద కొన్ని గదులను చూశారు. డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే తరగతుల బోధన జరుగుతుండడంతో భవనంలో వైద్య కళాశాల తరగతులు నిర్వహించినా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. సెప్టెంబరు నుంచి వైద్య కళాశాల తరగుతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తే డిగ్రీ తరగతులను మొదటి అంతస్థులో, వైద్య కళాశాల తరగతులను కింద నిర్వహించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడుగా వైద్య కళాశాల విద్యార్థులకు వసతి గృహాల కోసం సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. వీటన్నింటి వివరాలతో వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హిమబిందు సింగ్‌ గురువారం జిల్లా పాలనాధికారిణికి నివేదించారు. ఆమె సానుకూలంగా స్పందించి డిగ్రీ కళాశాల నిర్వాహకులతో మాట్లాడనున్నట్లుగా పేర్కొనట్లు సమాచారం.

కేంద్ర కమిటీ వచ్చేలోగా..

గోదావరిఖనిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే విషయంలో పరిశీలించేందుకు కేంద్ర వైద్య విద్యా కమిషనరేట్ కమిటీ ఫిబ్రవరిలో రానున్నట్లు సమాచారం. ఈలోగా వైద్య కళాశాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకొని కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో వారు ఆయా ఏర్పాట్లను పరిశీలించి ఆమోదిస్తేనే గోదావరిఖనిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అమనుతి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలాగైనా ఈ నెలాఖరులోగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలనే పట్టుదలతో వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, ఆచార్యులు కృషి చేస్తున్నారు. తరగతుల నిర్వహణకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కొన్ని గదుల్లో తగు ఏర్పాట్లు చేసి కేంద్ర కమిటీకి చూపించనున్నారు. ఇక బోధనాస్పత్రి విషయానికి వస్తే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి భవనంపైన మరో అంతస్థు నిర్మాణం పనులు తుది దశలో ఉన్నాయి. కేవలం రంగులు వేయడంతో పాటు, కిటికీలు, తలుపులు బిగించాల్సి ఉంది. విద్యుత్తు సరఫరా ఏర్పాట్లు దాదాపు పూర్తవుతున్నాయి. ఇప్పటికే కొత్తగా నిర్మించిన అంతస్థులో ఏయే వార్డులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో ప్రాథమికంగా నిర్ణయానికి రాగా నెలాఖరులోగా బోధనాస్పత్రిలో అవసరమైన అన్ని విభాగాలకు సంబంధించిన వార్డులను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద 330 పడకలను కేంద్ర కమిటీకి చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని గ్రౌండ్‌, పై రెండు అంతస్థుల్లో సుమారు 245 పడకలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అందుకే రక్తబ్యాంకు ముందు అదనంగా 85 పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం చేపట్టినప్పటికీ నిర్మాణం పనులు పునాదుల్లోనే ఉన్నాయి. కేంద్ర కమిటీ వచ్చేలోగా ఈ భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో సింగరేణి ప్రాంతీయ ఆస్పత్రిలోని పడకలను కేంద్ర కమిటీకి చూపించేందుకు సమాలోచిస్తున్నారు. ఎలాగైనా కేంద్ర వైద్య విద్యా కమిషనరేట్ కమిటీని మెప్పించి గోదావరిఖనిలో వైద్య కళాశాల అనుమతి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో కళాశాల ప్రిన్సిపల్‌, ఆచార్యులు నిమగ్నమయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని