logo

నిబంధనలే అవుట్‌

జిల్లాకేంద్రంలో పురపాలక సంఘానికి నూతన భవనం ఆరేళ్లు గడిచినా సమకూరలేదు.. పట్టణ వాసులు సేద తీరేందుకు ప్రతిపాదించిన ఉద్యానవనం, క్రీడా మైదానం ఇప్పటివరకు సాకారం కాలేదు.. కేవలం స్థలం కొరత వల్లే

Published : 21 Jan 2022 03:18 IST

స్థిరాస్తి వెంచర్లపై కొరవడిన బల్దియా పర్యవేక్షణ

రిజిస్ట్రేషన్‌ల నిలిపివేతతోనైనా పరిస్థితి మారేనా!

న్యూస్‌టుడే, పెద్దపల్లి

శివపురి కాలనీలోని లేఅవుట్‌ స్థలంలో నిర్మించిన మచిలిఖేడ పాఠశాల

జిల్లాకేంద్రంలో పురపాలక సంఘానికి నూతన భవనం ఆరేళ్లు గడిచినా సమకూరలేదు.. పట్టణ వాసులు సేద తీరేందుకు ప్రతిపాదించిన ఉద్యానవనం, క్రీడా మైదానం ఇప్పటివరకు సాకారం కాలేదు.. కేవలం స్థలం కొరత వల్లే ఈ నిర్మాణాల కల తీరడం లేదు.. పట్టణంలోనే కాదు, శివారు ప్రాంతాల్లోనూ సర్కారు స్థలం అందుబాటులో లేదు.. దీనికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా పురపాలిక అధికారులు చేపడుతున్న చర్యలు స్థిరాస్తి వ్యాపారులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో పెద్దపల్లిలో స్థిరాస్తి వెంచర్లలో నిబంధనల అమలు తీరుపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..2011లో పురపాలికగా మారిన పెద్దపల్లి పట్టణం పదేళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందింది. అయిదేళ్ల అనంతరం 2016లో జిల్లాకేంద్రంగా ఆవిర్భవించాక పట్టణీకరణ వేగవంతమైంది. ఫలితంగా జిల్లాకేంద్రంలోని స్థిరాస్తి వ్యాపారం పరిసర గ్రామాలకు విస్తరించింది. కాగా స్థిరాస్తి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని అందిపుచ్చుకోవడంలో బల్దియా పాలకమండలి విఫలమైంది. ఫలితంగా వందల ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం జరిగినా సెంటు భూమి కూడా మున్సిపాలిటీకి రాలేదు. లేఅవుట్‌ నిబంధనల ప్రకారం స్థిరాస్తి వెంచర్‌లోని స్థలంలో 10 శాతం భూమిని మునిసిపాలిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఈ నిబంధన అమలులోకి తేవడంలో పాలకమండలి పూర్తిగా విఫలమైంది. వివిధ సామాజిక అవసరాల నిమిత్తం పురపాలక సంఘానికి పెద్దఎత్తున భూమి అవసరమైంది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోగా ప్రైవేటులో కొనుగోలు చేసే సామర్థ్యం పురపాలికకు లేదు. ఇలాంటి సమయంలో స్థిరాస్తి వెంచర్ల నుంచి వచ్చే వాటాను దక్కించుకోవడమొక్కటే మార్గం.

అలాగైతే 60 ఎకరాలు సమకూరేది

* మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి, పెద్దకల్వల, రంగంపల్లి, పెద్దబొంకూర్‌ ప్రాంతాల్లోనే స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. కేవలం ఈ మూడు పంచాయతీల పరిధిలోనే 600 ఎకరాలు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లింది.

* ఈ స్థలాల విక్రయాల్లో ఎక్కడా లే అవుట్‌ నిబంధనలు పాటించలేదు. కేవలం నాలా పన్ను(అది కూడా నామమాత్రంగా) చెల్లించి, ఇళ్ల స్థలాలు విక్రయించారు.

* ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు ఇచ్చింది. ఫలితంగా అలాంటి వెంచర్లన్నీ అధికారికమయ్యాయి.

* ఇళ్ల అనుమతుల కోసం అభివృద్ధి నిధి కోసం కాకుండా 10 శాతం స్థలం కోసం ప్రయత్నిస్తే కనీసం 60 ఎకరాల స్థలం వచ్చేది.

* ఇక 20 ఎకరాల దేవాదాయశాఖ భూమి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా మునిసిపాలిటీ ఆధ్వర్యంలోని సెగ్రిగేషన్‌ షెడ్డును కూడా ఊరికి 8 కిలోమీటర్ల దూరంలోని రాఘవాపూర్‌ గుట్టల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

* ఉద్యానవన నిర్మాణం కోసం స్థానిక ఐటీఐ స్థలం కోసం మరోసారి ప్రయత్నాలు మొదలయ్యాయి.(గతంలో కలెక్టరేట్‌ నిర్మాణం కోసం జరిగిన ప్రయత్నాలే ఫలించలేదు).

* పాలకమండలిలోని 10 మంది సభ్యులకు స్థిరాస్తి వ్యాపారంతో సంబంధాలుండగా, అయిదుగురు నేరుగా వ్యాపారాలు చేస్తున్నారు.

*స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనమే పరమావధిగా పాలకమండలి చర్యలుంటున్నాయనే అపవాదు నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందే.

రిజిస్ట్రేషన్లపై మెలికతో గాడిన పడుతుందా!

పెద్దపల్లి పురపాలిక పరిధిలో 80 ఎకరాల్లో విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 21 వెంచర్లలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై పురపాలిక లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఆయా వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ జిల్లా పాలనాధికారిణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో మరో పది వెంచర్లలోనూ రిజిస్ట్రేషన్ల నిలిపివేత కోసం అధికారులు జిల్లా పాలనాధికారిణిని అభ్యర్థించారు. వీటిపై త్వరలోనే ఆమె తుది నిర్ణయం తీసుకోనున్నారు. పెద్దపల్లి పురపాలిక పరిధిలో గడిచిన 15 ఏళ్లలో కేవలం శివపురి కాలనీలో మాత్రమే కొంత స్థలాన్ని నాటి స్థిరాస్తి వ్యాపారులు అప్పట్లో పంచాయతీకి రిజిస్ట్రేషన్‌ చేశారు. ప్రస్తుతం అదే స్థలంలో మచిలిఖేడ ఉర్దూ మాధ్యమ పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇటీవల బొంపల్లి రోడ్డులోని ఓ వ్యాపారి 11 గుంటల స్థలాన్ని మునిసిపాలిటీకి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ రెండు సందర్భాలు మినహా మున్సిపాలిటీ స్థలం సమకూరలేదు. మరి రిజిస్ట్రేషన్లపై మెలికతో ఎలాంటి ప్రయోజనం ఒనగూరుతుందో వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని