logo

బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధికి ముందడుగు

వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు ముందుకు పడుతున్నాయి. మొన్నటి వరకు నిధులేమితో సతమతమైన వేములవాడ టెంపుల్‌ ఏరియా అభివృద్ధి సంస్థ (వీటీఏడీఏ)కు ఆలయ నిధుల నుంచి రూ.20 కోట్లు 

Published : 21 Jan 2022 03:18 IST

పరిహారానికి రూ.20 కోట్లు సిద్ధం

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయం

వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు ముందుకు పడుతున్నాయి. మొన్నటి వరకు నిధులేమితో సతమతమైన వేములవాడ టెంపుల్‌ ఏరియా అభివృద్ధి సంస్థ (వీటీఏడీఏ)కు ఆలయ నిధుల నుంచి రూ.20 కోట్లు జమ చేశారు. వీటిని బద్దిపోచమ్మ ఆలయ విస్తరణలో నిర్వాసితులకు పరిహారంగా చెల్లించనున్నారు. వేములవాడ ఆలయ పట్టణ అభివృద్ధిపై గతేడాది హైదరాబాద్‌లో మంత్రులు కె.తారక రామారావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు వీటీఏడీఏ, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇక్కడ కీలకమైనవి భూసేకరణ, పరిహారం చెల్లింపు. దీనికి వీటీఏడీఏ వద్ద నిధులు లేవు. అప్పుడు ఆలయ నిధుల్లోంచి అవసరం మేరకు వీటీఏడీఏకు బదిలీ చేయాలని ఈవోకు లేఖ రాశారు. ఈ నిధులను ప్రభుత్వం ద్వారా తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం నిధులు సమకూరడంతో బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధికి మార్గం సుగమమైంది.

పట్టణంలోని బద్దిపోచమ్మ ఆలయం ప్రస్తుతం రెండు గుంటల విస్తీర్ణంలో ఉంది. బోనాలతో వచ్చే భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలగకుండా సుమారు ఎకరంపైన విస్తరించనున్నారు. దీనిలో ఆలయ చుట్టుపక్కల ఉన్న 11 కుటుంబాలు పూర్తిగా నిర్వాసితులవుతున్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖ సర్వే చేపట్టి వివరాలు సేకరించి ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గజానికి రూ.30 వేలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. పరిహారం విషయంలో నిర్వాసితుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. వారితో ఎమ్మెల్యే రమేశ్‌బాబు సైతం పలుమార్లు మాట్లాడారు. నిర్వాసిత కుటుంబాలకు ఆలయ పరిధిలోనే దుకాణాల నిర్వహణ, ఇతర ఉపాధి మార్గాల్లో ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

త్వరలోనే చెల్లింపులు -శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి డీఆర్వో

పట్టణంలో వ్యాపార సముదాయం కావడంతో డిమాండ్‌ ఉంది. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేశాక పరిహారం ఫైనల్‌ చేశాం. ఇటీవలే వీటీఏడీఏకు నిధులు జమయ్యాయి. గృహాలు, నిర్వాసితుల తుది జాబితాను సిద్ధం చేస్తున్నాం. ఆ జాబితా ప్రకారం త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ చేపడతాం.

నిధుల లేమితోనే జాప్యమా?

వేములవాడలోని ఆలయాన్ని 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.400 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దాని తర్వాత వీటీఏడీఏ ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు నమూనాలు రూపొందించారు. దీనిపై శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి పరిశీలన తర్వాత కొన్ని మార్పులు కూడా సూచించారు. ఆలయ విస్తరణకు గుడి చెరువుకు 35 ఎకరాల మేరకు పూడ్చివేసి చెరువుకు అవసరమైన అదనపు స్థలాన్ని సమీపంలోని రైతుల నుంచి సేకరించారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలో గుడిచెరువును ట్యాంక్‌బండ్‌గా మార్చుతున్నారు. రాజరాజేశ్వర జలాశయం వెనక జలాల నుంచి గుడిచెరువులోకి నీటిని తరలించేందుకు ఎత్తిపోతల పథకం పూర్తయింది. ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో పట్టణానికి ఇరువైపులా రెండు బాహ్యవలయ రహదారులు, మూలవాగుపై రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజన్న ప్రధాన ఆలయం విస్తరణ మిగిలి ఉంది. ఆరున్నరేళ్లుగా ఇప్పుడు అప్పుడు అంటూ వస్తున్నారు. పరిహారం చెల్లింపులకే వీటీఏడీఏ వద్ద నిధులు లేకపోతే ఇక అభివృద్ధి ఎలా జరుగుతుందనే విమర్శలు  లేకపోలేవు. ఇప్పటికైనా ఆలయ నిధులతో పనులు చేపడితే భక్తులకు మెరుగైన వసతులు సమకూరుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని